
జైపూర్: రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బుధవారం ధోల్‌పూర్, భరత్‌పూర్‌లలో జరిగిన ప్రచారసభల్లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘ దేశ రక్షణ కోసం పాటుపడేందుకు సైన్యంలో చేరాలని కలలు కనే లక్షలాది మంది యువత ఆశలను మోదీ సర్కార్ అగ్నిపథ్ పథకం తెచ్చి చిదిమేసింది.
ఈ ఎన్నికల్లో గెలిచాక రాష్ట్రంలో, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం. దళితులు, వెనుకబడిన తరగతుల జనాభా వంటి సమగ్ర వివరాలు బహిర్గతంకావాలంటే కులగణన జరగాల్సిందే. మోదీ హయాంలో దేశవ్యాప్తంగా ప్రజా సంపద పంపిణీ ఏ విధానంలో జరుగుతోందనేది పెద్ద ప్రశ్నగా మారింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
అప్పుడలా.. ఇప్పుడిలా
‘‘తాను ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తినని మోదీ పదేపదే చెప్పుకునేవారు. నేను ఎప్పుడైతే కులగణన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చానో అప్పటి నుంచి ఆయన మాట మార్చారు. దేశంలో ఒక్కటే కులం ఉందట. అది పేదకులమట’’ అని రాహుల్ ఎద్దేవాచేశారు. ‘ప్రజాధనం లూటీ చేయడంలో మోదీ, కుబేరుడు గౌతమ్ అదానీ, హోం శాఖ మంత్రి అమిత్ షా బిజీగా మారారు. ముందుగా ప్రధాని మోదీ టీవీల్లో ప్రత్యక్షమై హిందువుల, ముస్లింల గురించి ప్రసంగాలు దంచేస్తూ ప్రజల దృష్టి మరల్చుతారు.
వెంటనే గౌతమ్ అదానీ వెనక నుంచి వచ్చి ప్రజల జేబుల్లోని సొమ్ము నొక్కేస్తారు. ఆ తర్వాత ప్రజా వ్యతిరేకత, ఆందోళన అణచివేసేందుకు లాఠీ పట్టుకుని అమిత్ షా సిద్ధంగా ఉంటారు. ఇపుడు దేశంలో ప్రభుత్వం ఇలాగే నడుస్తోంది. మోదీ అనుక్షణం చానెళ్లలో కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ చానెళ్లకు అధిపతి అదానీ కదా. మోదీనే ప్రజాధనాన్ని అదానీకి ముట్టజెప్తారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సిమెంట్ కర్మాగారాలను ధారాదత్తం చేస్తారు. అదానీకి అనుగుణంగా చట్టాలు చేస్తారు. పెద్ద నోట్లను రద్దుచేస్తారు’’ అని రాహుల్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment