2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలోదాంతా రామ్‌గఢ్ నియోజకవర్గం ఎన్నికలు ఆసక్తికరమైన రాజకీయ పోరుకు తెర తీయ నున్నాయి. రెండు వేర్వేరు పార్టీలనుంచి భార్యా భర్తలు ఈ సారి ఎన్నికల బరిలోకి నిలవనున్నారు. దంతారామ్‌గఢ్‌లో భర్తపై భార్య పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీ సేవలు చేసినా ఫలితం లేదని భావించిన భార్య ప్రత్యర్థి పార్టీని పోటీకి ఎంచుకోగా, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భర్త అదే నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో భార్యా భర్తల మధ్య పోరులో గెలుపెవరిది అనేది ఆసక్తికరంగా మారింది.
పీసీసీ మాజీ చీఫ్, ఏడుసార్లు ఎమ్మెల్యే నారాయణ్ సింగ్ కుమారుడు వీరేంద్ర సింగ్ కుటుంబం కాంగ్రెస్‌లో చిర కాలంగా కొనసాగుతోంది. కానీ వీరేంద్ర సింగ్ భార్య రీటా సింగ్ ఈ ఏడాది ఆగస్టులో జననాయక్ జనతా పార్టీ (జెజెపి)లో చేరారు. దీన్ని అవకాశం తీసుకున్న జేజేపీ రీటా సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైనట్టైంది. అటు కాంగ్రెస్ నాయకత్వం కూడా దాంతా రాంగఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్‌నే మరోమారు బరిలో దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దంతా రామ్‌గఢ్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని రీటా భావించి భంగపడ్డారు.ఇక్కడ పోటీకి పార్టీ ఆమె భర్తను ఎంపిక చేయడంతో మౌనం వహించారు. కానీ రాజకీయాల్లో ఎదగాలని భావిస్తున్న రీటా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపారు. ఫలితం లేకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జేజేపీలో చేరి మరీ దాంతా రామ్ గఢ్ టికెట్ సంపాదించారు.
తాను మనసు చెప్పిందే చేశాను. ఇన్నాళ్లుగా ప్రజలతోనే ఉన్నా.. వారి ప్రతీ ఆపదలోనూ, అవసరమైనప్పుడల్లా వారికి అండగా ఉన్నాను అని చెప్పారు రీటా. అందుకే తన నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించి, మద్దతిస్తారనే విశ్వాసాన్ని ప్రకటించారు. తన విజయంపై నమ్మకం ఉందని రీటా వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో పార్టీ సీటు మళ్లీ తనకే దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు వీరేంద్ర సింగ్. జేజేపీ ఆమెను (రీటాను) రంగంలోకి దింపింది, ఈ నేపథ్యంలో తనకు సీట్ లభిస్తే తమ మధ్య ప్రత్యక్ష పోరు తప్పదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ-జేజేపీ కూటమి హర్యానాలో విజయం సాధించిన జేజేపీ ఇపుడు రాజస్థాన్‌లో కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది.
రీటా సింగ్ రాజకీయ ప్రస్థానం
రాజస్థాన్ రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే రీటా 1995లో తొలిసారిగా దంతారామ్‌గఢ్ పంచాయతీ సమితి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె ప్రధాన్ ఎన్నికల్లో రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2010లో సికార్ జిల్లా పరిషత్ సభ్యుని ఎన్నికలో పోటీ చేసి 2015 వరకు సికార్ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగారు. 2014లో సచిన్ పైలట్ పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో రీటా సింగ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రాజస్థాన్‌లో జేజేపీ మహిళా మోర్చా అధ్యక్ష పదవిని రీటా సింగ్‌కు అప్పగించడం విశేషం.
కాగా 2018లో దాంతా రామ్ గఢ్ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేయనని నారాయణ్ సింగ్ ప్రకటించడంతో వీరేంద్ర సింగ్‌కు కాంగ్రెస్ టికెట్ లభించింది. నారాయణ్ సింగ్ 1972, 1980, 1985, 1993, 1998, 2003 , 2013లో ఏడుసార్లు గెలిచారు. నవంబర్ 25న రాజస్థాన్ లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment