డింపుల్ యాదవ్. సైనిక కుటుంబానికి చెందిన సాదాసీదా అమ్మాయి. అఖిలేశ్ యాదవ్‌ను పెళ్లాడి అనూహ్యంగా బడా రాజకీయ కుటుంబంలో అడుగు పెట్టారు. తొలుత తనను అంతగా ఇష్టపడని ములాయం సింగ్ యాదవ్‌కు ప్రియమైన కోడలిగా మారారు. తండ్రీ కొడుకుల రాజకీయ విభేదాలను పరిష్కరించే స్థాయికి ఎదిగారు. అంతే అనూహ్యంగా రాజకీయ అరంగేట్రమూ చేసినా స్వయంకృషితో ఎంపీగానూ రాణించారు. అలా ఇంటా బయటా ఫుల్ మార్కులు కొట్టేశారు.
డింపుల్‌కు తొలుత రాజకీయాలు, కులాల గురించి అస్సలు అవగాహన లేదు. ఆమె పుట్టింది పూర్తి భిన్నమైన కుటుంబం కావడమే అందుకు కారణం. అలాంటిది పెళ్లి తర్వాత వాటిపై లోతుగా అవగాహన పెంచుకున్నారు. కుల సమీకరణాలకు పుట్టిల్లయిన యూపీ వంటి రాష్ట్రంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. స్వతహాగా మితభాషి అయినా వేదిక ఎక్కితే మాత్రం డింపుల్ అద్భుతమైన వక్త. యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారీ అక్కడి నుంచే సమాజ్‌వాదీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు.
అనూహ్యంగా రాజకీయాల్లోకి...
రాజకీయాల్లోకి రావాలని డింపుల్ ఎప్పుడూ అనుకోలేదు. భర్త అఖిలేశ్ యాదవ్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఫిరోజాబాద్, కన్నౌజ్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు. కన్నౌజ్‌ను అట్టిపెట్టుకోవడంతో ఫిరోజాబాద్‌కు ఉప ఎన్నిక జరిగింది. దాంతో అక్కడ డింపుల్ బరిలో దిగాల్సి వచి్చంది. కానీ బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ యూపీ సీఎం కావడంతో కన్నౌజ్ లోక్‌సభ స్థానమూ ఖాళీ అయింది. అక్కడి నుంచి డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కన్నౌజ్‌కు ప్రాతినిధ్యం వహించిన రెండో మహిళగా, యూపీ చరిత్రలో ఏకగ్రీవంగా ఎంపికైన తొలి మహిళా ఎంపీగా రికార్డు నెలకొల్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ స్థానం నుంచి మళ్లీ గెలుపొందారు. 2019లో బీజేపీ నేత సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. 2022లో మామ ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో డింపుల్ భారీ విజయం సాధించారు. ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని డింపుల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా ప్రచారం చేశారు. భర్తకు మద్దతుగా 20 ర్యాలీల్లో ప్రసంగించారు. అంతకుముందు కుటుంబ కలహాల వేళ తండ్రీ కొడుకుల మధ్య సఖ్యత నెలకొల్పారు.
ప్రేమ, పెళ్లి, పిల్లలు..
డింపుల్ మహారాష్ట్రలోని పుణెలో 1978 జనవరి 15న జని్మంచారు. తండ్రి ఆర్మీ కల్నల్ రామ్‌చంద్ర సింగ్ రావత్. వారిది ఉత్తరాఖండ్. తండ్రి ఉద్యోగరీత్యా పుణె, భటిండా, అండమాన్, నికోబార్ దీవుల్లోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో చదివారు డింపుల్. లక్నో యూనివర్సిటీ నుంచి కామర్స్ డిగ్రీ పొందారు. అఖిలేశ్‌ను తొలిసారి చూసినప్పుడు డింపుల్ ప్లస్ టూ చదువుతున్నారు. ఆమెకు 17 ఏళ్లు, అఖిలేశ్‌కు అప్పుడు 21 ఏళ్లు. ఇంజనీరింగ్ చేస్తున్నారు. కామన్ ఫ్రెండ్ పార్టీలో పరిచయమైంది. తొలి భేటీలోనే మంచి స్నేహితులయ్యారు. పై చదువులకు అఖిలేశ్ ఆ్రస్టేలియా వెళ్లారు.
అప్పుడు ఇద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు. అలా ప్రేమ చిగురించింది. తిరిగొచ్చాక అఖిలేశ్‌పై పెళ్లి ఒత్తిడి పెరగడంతో డింపుల్ గురించి అమ్మమ్మకు చెప్పారు. కుటుంబ నేపథ్యాలు వేర్వేరు కావడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. అఖిలేశ్ పట్టుదల చూసి తండ్రి ములాయం సింగ్ చివరికి పెళ్లికి అంగీకరించారు. అలా 1999న వారు ఒకటయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి అదితి. అర్జున్, టీనా కవలలు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, పెయింటింగ్ వేయడానికి ఇష్టపడతారు డింపుల్. ‘‘పిల్లలే దేశ భవిష్యత్తు. రాజకీయాలతోపాటు పిల్లలకు సమయమివ్వడానికి ఇష్టపడతా’’ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment