సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసు రెండో అనుబంధ చార్జ్‌షీట్‌లో ఎంపీ రాఘవ చెడ్డా పేరును చేర్చింది.
అయితే, ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీకి రూపకల్పన కోసం జరిగిన సమావేశంలో విజయ్ నాయర్‌తో పాటు రాఘవ్ చద్దా ఉన్నారని ఈడీ చార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. ఈ సందర్బంగా అప్పటి ఎక్సైజ్ శాఖ కార్యదర్శి సి. అరవింద్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కూడా ప్రస్తావించింది ఈడీ. దీంతో, రాఘవ్ చద్దాకు షాక్ తగిలినట్టు అయ్యింది. ఇక, ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ వంటి ఇతర ఆప్ నేతల పేర్లను ఈడీ.. చార్జ్‌షీట్‌లో ప్రస్తావించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో ఈడీ మరో ఆసక్తికర అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఢిల్లీలో మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్‌లో భూములు కొనుగోలు చేశారని, ఇందులో సౌత్‌గ్రూపుదే కీలకపాత్ర అని పేర్కొంది. భూముల కొనుగోలు వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కుమార్ ప్రమేయం ఉందని తెలిపింది. గౌతమ్ మల్హోత్రా, అమన్‌దీప్, మాగుంట రాఘవ, అరుణ్ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను సోమవారం ఈడీ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుల్ని కస్టడీలోకి ఇవ్వాలని ఈడీ కోరింది.
ఈ నేపథ్యంలో రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఈడీ చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ చార్జిషీట్లలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శరత్‌చంద్రారెడ్డి, కవిత సన్నిహితుడు వి.శ్రీనివాసరావు, ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్, ఫీనిక్స్ గ్రూపు, ఎన్‌గ్రోత్ క్యాపిటల్, క్రియేటివ్ డెవలపర్స్ తదితరుల పేర్లను ప్రస్తావించింది. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా అసాధారణ అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పింది. ఆప్ నేతలకు సౌత్‌గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ కవితపై కీలక అభియోగాలు మోపిన ఈడీ.. తెరపైకి భర్త అనిల్ పేరు..
Comments
Please login to add a commentAdd a comment