సాక్షి, హైదరాబాద్: తాము టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. తాము బీజేపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.
మునుగోడు ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని రవీందర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఒక్కొక్కరిని టీఆర్‌ఎస్ నుంచి వెళ్లగొట్టారని, ఉద్యమ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు నైతిక విలువలు లేవని గ్రహించే తాము ఆ పార్టీని వీడి బీజేపీలో చేరామన్నారు. మళ్లీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోకి వెళతామనుకోవడం అవివేకమన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
నన్ను ఎవరూ కొనలేరు: విఠల్
తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని.. తనను ఎవరూ కొనుగోలు చేయలేరని టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ స్పష్టంచేశారు. చివరిశ్వాస వరకూ బీజేపీలోనే ఉంటానన్నారు. తాను నైతిక రాజకీయ విలువలకు కట్టుబడి ఉన్నానని, ఆ విలువల ప్రాతిపదికనే బీజేపీలో చేరానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment