Enugu Ravinder Reddy
-
జంపింగ్ జంపాగ్స్‌పై జోరుగా ప్రచారం.. టీఆర్ఎస్, బీజేపీలో కొత్త టెన్షన్!
కామారెడ్డి జిల్లాలో బీజేపీలోని ఓ మాజీ ఎమ్మెల్యే, గులాబీ గూటిలో ఉన్న మరో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ మార్పిళ్ళ ప్రచారం తలబొప్పి కట్టిస్తోంది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓటమిపాలై టీఆర్ఎస్ నుంచి కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన జాజుల సురేందర్ చాలా కాలం క్రితమే హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేశారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ పార్టీ మారుతున్నారంటూ సాగుతున్న ప్రచారం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. అదే సమయంలో తమ పార్టీలకు చెందిన కేడర్‌ను కూడా గందరగోళంలో ముంచుతోంది. ఏడాది క్రితమే బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డి తిరిగి పాత గూటికి చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా ఎల్లారెడ్డి అంతటా ప్రచారం హల్ చల్ చేస్తోంది. ఏనుగు, జాజుల వ్యవహారం అటు బీజేపీలోను.. ఇటు గులాబీ పార్టీలోను అలజడి రేపుతోంది. ఇటీవలే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంపై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వీరిద్దరి వ్యవహారం కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో కాక రేపుతోంది. ఎవరిది ఘర్..? ఎవరు వాపస్? టీఆర్ఎస్ ఘర్ వాపసీలో భాగంగా.. ఇప్పటికే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటివారు.. కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరిపోయారు. మరికొందరు మాజీల గురించి కూడా ప్రచారం ఊపందుకోగా.. ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్ రెడ్డి పేరు జోరుగా వినిపిస్తోంది. ఏనుగు పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పుడల్లా అనుచరులు ఆయన్ను అడగడం, పార్టీ మారేది లేదని రవీందర్ రెడ్డి ఖండించడం షరామాములుగా జరుగుతూనే ఉంది. ఐతే మునోగోడు ఉప ఎన్నిక సమయంలో మరోసారి ఇలాంటి ప్రచారం జరుగుతుండటం ఆయనకు తలబొప్పి కట్టిస్తుండటంతో పార్టీ మరే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఏనుగు ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ముందు పుకార్లు.. ఆపై షికార్లు ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉద్యమ కాలం నుంచీ గులాబీపార్టీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ చేతిలో ఓటమి చెందారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సురేందర్ కారు ఎక్కేయడంతో అలక వహించిన రవీందర్ రెడ్డి కాషాయతీర్దం పుచ్చుకున్నారు. అయితే, ఇటీవల కొందరు పని గట్టుకుని ఏనుగు.. తిరిగి గులాబీ గూటికి చేరతారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుండటంతో ఎల్లారెడ్డిలో ఓ విచిత్ర రాజకీయ పరిస్థితికి తెరలేపింది. ఏనుగు తిరిగి పార్టీలోకి వస్తే తమ పరిస్దితేంటన్నది ప్రస్తుత ఎమ్మెల్యే జాజుల టెన్షన్. రవీందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం ఎంత వరకు నిజమన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట సిట్టింగ్ ఎమ్మెల్యే. పోటాపోటీగా ఆపరేషన్ ఆకర్ష్ పాత మిత్రులందరినీ దగ్గరకు తీస్తున్న గులాబీ పార్టీ.. రవీందర్ రెడ్డికి సైతం సాదర ఆహ్వానం పలుకుతుందనే ప్రచారం అయితే బలంగా వినిపిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆపరేషన్ ఆకర్ష్ పోటాపోటీగా జరుగుతున్న వేళ ఏనుగు అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
టీఆర్ఎస్ చేరే ప్రసక్తే లేదు అవన్నీ పుకార్లు.. బీజేపీతోనే ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: తాము టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. తాము బీజేపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని రవీందర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఒక్కొక్కరిని టీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టారని, ఉద్యమ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. టీఆర్ఎస్కు నైతిక విలువలు లేవని గ్రహించే తాము ఆ పార్టీని వీడి బీజేపీలో చేరామన్నారు. మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళతామనుకోవడం అవివేకమన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ను ఓడిస్తామని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నన్ను ఎవరూ కొనలేరు: విఠల్ తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని.. తనను ఎవరూ కొనుగోలు చేయలేరని టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ స్పష్టంచేశారు. చివరిశ్వాస వరకూ బీజేపీలోనే ఉంటానన్నారు. తాను నైతిక రాజకీయ విలువలకు కట్టుబడి ఉన్నానని, ఆ విలువల ప్రాతిపదికనే బీజేపీలో చేరానని పేర్కొన్నారు. -
మాజీ మంత్రి ఈటలకు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెన పాదయాత్రకు బ్రేక్ పడింది. జ్వరంతో పాటు ఆక్సిజన్ స్థాయి, బీపీ తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. ప్రత్యేక వైద్యుల పరీక్షల తర్వాత హుజూరాబాద్‌లోని కార్యాలయానికి తరలించారు. ఈటల కోలుకునే వరకు యాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాదీవెన యాత్రలో భాగంగా వీణవంక మండ లం పోతిరెడ్డిపల్లికి శుక్రవారం చేరుకున్నారు. అక్కడి నుంచి కొండపాక చేరకుని సభలో మాట్లాడిన అనంతరం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న ప్రత్యేక బస్సులో వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ 90/60, షుగర్ 265 ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆక్సిజన్ స్థాయి లు 94లోపు ఉండటంతో ప్రాథమిక వైద్యం అందించారు. ర్యాపిడ్ టెస్టు చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించగా, జ్వరం తగ్గింది. ముందుగా హైదరాబాద్ నిమ్స్‌కు ఈటలను తరలిస్తారని ప్రకటించగా, అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో రాత్రి 7.30 గంటలకు హుజూరాబాద్‌లోని తన కార్యాలయానికి తరలించారు. ఈ నెల 19న కమలాపూర్ మండలంలో యాత్ర ప్రారంభించగా, 222 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. హిమ్మత్‌నగర్ వరకు కొనసాగించిన జమున.. కొండపాకలో నిలిచిన పాదయాత్రను ఈటల సతీమణి జమునారెడ్డి హిమ్మత్‌నగర్ వరకు కొనసాగించారు. ప్రజలు ఈటల కోసం ఎదురు చూస్తున్నారనే ఉద్దేశంతో ఆమె యాత్రను చేపట్టారు. కాగా, అస్వస్థతకు గురైన ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫోన్లో పరామర్శించారు. -
కారులో కలకలం.. ఈటల వెన్నంటే ఏనుగు రవీందర్‌రెడ్డి
సాక్షి, కామారెడ్డి : అధికార టీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెన్నంటి ఉంటున్న రవీందర్‌రెడ్డి.. ఆయనతోపాటే ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన కారు దిగి కమలం గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏనుగు రవీందర్‌రెడ్డి బలమైన నేతగా గుర్తింపు పొందారు. ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా 2004, 2009, 2010, 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో మాత్రం గెలుపు తీరాలకు చేరలేకపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జాజాల సురేందర్ చే తిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత పరిణామాలతో సురేందర్ గులా బీ కండువా కప్పుకున్నారు. దీంతో క్రమంగా పార్టీలో రవీందర్‌రెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఎన్నికలలో ఓటమి పాలైనా తనకు అధిష్టానం న్యాయం చేస్తుందని ఆశించినా నిరాశే ఎదురైంది. అనుచరులతో నిత్యం చర్చలు.. తెలంగాణ ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన ఈటలను ప్రభుత్వం మంత్రి పదవినుంచి తొ లగించడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అప్పటినుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి ఈటల వెంటే ఉంటున్నారు. వివిధ పార్టీల నేతలు, ప్ర జాసంఘాల నేతలతో చర్చల సందర్భంగా రవీందర్‌రెడ్డి కూడా ఆయన వెన్నంటే ఉన్నా రు. నియోజక వర్గానికి చెందిన తన అనుచరులతో నిత్యం చర్చించగా చాలా మంది బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. చదవండి: Etela Rajender: మాజీ మంత్రి వెంటే మాజీ ఎమ్మెల్యే -
Etela Rajender: మాజీ మంత్రి వెంటే మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్కు దూరమైనట్లే కనిపిస్తోంది! పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చే సిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే మంత్రిమండలి నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంట నడుస్తున్నారు. ఆయన కోటరీలో ఒకరిగా ఉంటూ ఆయన వెంటే తిరుగుతున్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడమా.. ఇతర పార్టీలో చేరడమా? అన్న దానిపై రా జేందర్ వేస్తున్న అడుగుల్లో రవీందర్‌రెడ్డి వెన్నంటి ఉండడం గమనార్హం. ఈటల బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో ఆయన కూడా కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారి పోనున్నాయి. చదవండి: Etela Rajender: బీజేపీలో చేరికపై బండి సంజయ్ క్లారిటీ గులాబీ జెండా ఆవిర్భావం నుంచి.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజక వర్గంలో బలమైన కేడర్ ఉంది. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత నామినేటెడ్ పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ నుంచి గెలిచిన జాజాల సురేందర్ అనూహ్యంగా గులాబీ గూటికి చేరడం, నియోజక వర్గ బాధ్యతలన్నీ ఆయనకు అప్పగించడంతో రవీందర్‌రెడ్డి ప్రాధాన్యత తగ్గింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేసిన తనను కాదని సురేందర్‌ను చేర్చుకోవడంతో మాజీ ఎమ్మెల్యే నిరాశ చెందారు. అయితే, పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలతో నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించారు. రెండున్నరేళ్లుగా పదవి దక్కక పోగా, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనను, తన అనుచరులను పట్టించుకోక పోవడం రవీందర్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. చివరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ రవీందర్‌రెడ్డికి, ఆయన అనుచరులకు నమోదు పుస్తకాలు ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్టు సమాచారం. అప్పటి నుంచి ఆయన పార్టీ ముఖ్య నేతలకు దూరమవుతూ వచ్చారు. ఇటీవల ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బయటకు పంపింన నేపథ్యంలో రవీందర్‌రెడ్డి.. ఈటలను కలిసి అండగా నిలిచారు. మొదటి నుంచి పార్టీలో కలిసి పని చేసిన వారు కావడం, రవీందర్‌రెడ్డి కూడా పార్టీ నాయకత్వంపై ఉన్న కోపంతో ఈటలతో కలిసి అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్కు కొంత నష్టం.. ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్ను వీడితే ఎల్లారెడ్డి నియోజక వర్గంలో రాజకీయ సమీకరణలు మారుతాయని భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమాల్లో నియోజక వర్గ ప్రజలు చురకైన పాత్ర పోషించారు. రవీందర్‌రెడ్డి వెంట ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన ఓటమి చెందినా చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ ఆయన వెన్నంటే ఉన్నారు. ఈటల కొత్త పార్టీ పెడితే రవీందర్‌రెడ్డి వెంట ఉన్న వారంతా ఆయనతో కలిసి పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అయితే, ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వెంట ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా కాషాయ గూటికి చేరతారని తెలిసింది. అదే జరిగితే ఎల్లారెడ్డి నుంచి గతంలో బీజేపీ తరఫున పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డికి, ఏనుగు రవీందర్‌రెడ్డికి మధ్య టిక్కెట్ కోసం పోటీ తప్పదు. రవీందర్‌రెడ్డి కమలం గూటికి చేరితే ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి ఒకరిని, జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి మరొకరిని నిలిపే అవకాశాలుంటాయనే చర్చ జరుగుతోంది. కాగా నియోజక వర్గంలో బలమైన కేడర్ కలిగి ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్ను వీడితే అధికార పార్టీకి కొంత నష్టం తప్పదని భావిస్తున్నారు. ఈటల కోటరీలో ఒకడిగా.. మాజీ మంత్రి ఈటల కోటరీలో ఒకరిగా ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ తదితర పార్టీల నేతలను కలవడానికి వెళ్లిన ఈటల వెంట ఆయన ఉన్నారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేయడమా.. వేరే పార్టీలో చేరడమా? అన్న విషయంలో జరుగుతున్న చర్చల్లో రవీందర్‌రెడ్డి ఉండడం ద్వారా ఆయన టీఆర్ఎస్పై తిరుగుబాటు చేసినట్టుగానే భావిస్తున్నారు. తమ చర్చలు, ప్రయత్నాల గురించి రవీందర్‌రెడ్డి తన అనుచరులకు ఎప్పటికప్పుడు స మాచారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ తో ఇన్నేళ్ల అనుబంధాన్ని తెంచుకున్నట్టే కనిపిస్తోంది. ఏనుగు అనుచరులు చాలా రోజుల నుంచి పార్టీని వీడాలని, బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో ఆయన బీజేపీలో చేరుతున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. -
గులాబీ ముళ్లు: ఈటలతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు మంతనాలు!
గులాబీ కోటలో కలకలం మొదలైంది. అధిష్టానం వైఖరిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఈటల రాజేందర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. తగిన గుర్తింపు దక్కని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం మాజీ ఎమ్మెల్యే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. సాక్షి, కామారెడ్డి: టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నికలను ఆయుధంగా మలచుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2008లో ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించారు. అప్పుడు రవీందర్‌రెడ్డి అధినేత చెప్పినట్లుగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్‌గౌడ్ చేతిలో ఓటమి చెందారు. 2009 సాధారణ ఎన్నికల్లో తిరిగి ఆయన గెలుపు తీరాలకు చేరారు. తెలంగాణ కోసం 2010లో మరోసారి ఎమ్మెల్యే పదవిని వీడారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీని ఓడించారు. 2014 సాధారణ ఎన్నికల్లో మరోసారి గెలిచారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన రవీందర్‌రెడ్డి 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు. సురేందర్ చేరికతో తగ్గిన ప్రాధాన్యత ఎల్లారెడ్డి నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జాజాల సురేందర్ 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గ టీఆర్ఎస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా సురేందర్‌కు ప్రాధాన్యత లభించడం, పార్టీ అధిష్టానం తనను పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారన్న ప్రచారం ఉంది. 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన రవీందర్‌రెడ్డికి అధిష్టానం నుంచి భరోసా దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మంత్రి హరీశ్‌రావు సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న రవీందర్‌రెడ్డికి పార్టీ నాయకత్వం తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆయన కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. తనతో పాటు తన క్యాడర్‌కు అన్యాయం జరుగుతోందంటూ పార్టీ నేతల దగ్గర పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈటల వెంటే..? టీఆర్ఎస్ ఆవిర్భావ సమయం నుంచి పార్టీ ముఖ్య నేతలందరితో సన్నిహిత సంబంధాలున్న ఏనుగు రవీందర్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈటల వెంట అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టినా, వేరే పార్టీలో చేరినా ఆయన వెంట నడవాలనే ఆలోచనతోనే ఈటలను కలిసినట్టు సమాచారం. ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజక వర్గంలో బలమైన క్యాడర్ ఉంది. వారంతా ఆయన వెంటే నడుస్తారని తెలుస్తోంది. అప్పట్లో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినా తాను టీఆర్ఎస్ను వీడేదిలేదని పేర్కొన్నారు. అయితే పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనలో ఉన్న రవీందర్‌రెడ్డి.. ఇప్పుడు ఈటల వెంట నడుస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఈటలను కలవడం అందుకు బలాన్ని చేకూర్చింది. రవీందర్‌రెడ్డి అనుచురులైతే తాడోపేడో తేల్చుకోవాలని కొంత కాలంగా ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పార్టీలో గుర్తింపు లేకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని పలువురు ఆయన అనుచరులు బాహాటంగానే పేర్కొంటున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా వారికి సభ్యత్వ నమోదు పుస్తకాలు అందకపోవడంతో సభ్యత్వం కూడా తీసుకోలేదని సమాచారం. జిల్లా టీఆర్ఎస్ పార్టీలో మరికొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వివిధ మండలాలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు చాలా మంది తమకు సరైన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతో ఉన్నారని తెలు స్తోంది. నామినేటెడ్ పదవులు లేకపోవడంతో పాటు రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు రాకపోవడంతో కొందరు అసంతృప్తితో ఉన్నారు. వారు రవీందర్‌రెడ్డి బాటలో నడుస్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో తొలి నాటి నుంచి పనిచేసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వంలో çతగిన గుర్తింపు లభించలేదు. దీంతో వారంతా ఈటల వెంట నడిచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. చదవండి: ఈటలతో కాంగ్రెస్ నేత భేటీ, టీపీసీసీకి షాక్ తప్పదా? -
అభివృద్ధే లక్ష్యంగా..
సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఎల్లారెడ్డిలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో వెనుకబడిన నియోజకవర్గంగా పేరొందిన ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఎల్లారెడ్డిలో మొదటిసారిగా 2004లో టీఆర్ఎస్ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి గులాబీ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీఆర్ఎస్ క్యాడర్‌ను పెంచుకున్నారు. 2008లో నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి జనార్దన్‌గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2009, 2010, 2014లలో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో టీఆర్ఎస్కు బలమైన క్యాడర్ ఏర్పడింది. గతంలో నాలుగుసార్లు రవీందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆయన ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వచ్చింది. కానీ 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలుపొందిన రవీందర్‌రెడ్డికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా హోదా వచ్చింది. చేపట్టిన అభివృద్ధి పనులు నాలుగున్నరేళ్లలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సుమారు రూ. 760 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ముఖ్యంగా వ్యవసాయాధారితంగా జీవనం సాగించే నియోజవర్గ రైతాంగానికి కరెంట్కష్టాలు తొలగిపోయేలా ఎల్లారెడ్డి మండలంలో రూ. 8 కోట్ల నిధులతో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయించారు. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు పలు గ్రామాల్లో రూ. 15 కోట్లు వెచ్చించి 33/11కేవీకి సంబంధించి 15 విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేయించారు. నియోజకవర్గంలో సుమారు 275 కిలోమీటర్ల రోడ్లు పనులకు ఆర్అండ్బీ ద్వారా రూ. 240 కోట్ల నిధులను మంజూరు చేయించారు. 661 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లకు శాఖ ద్వారా రూ. 133 కోట్ల నిధులను మంజూరు చేయించారు. నియోజకవర్గంలో 500మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నాలుగు గోదాంల నిర్మాణానికి రూ. 12 కోట్లు కేటాయింపజేశారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ. 151 కోట్ల నిధులతో నియోజకవర్గంలో 427 చెరువులకు పునఃరుద్ధరణ పనులు చేయించారు. దీంతోపాటు ఎల్లారెడ్డి పట్టణంలో రూ. 4.50 కోట్ల నిధులను వెచ్చించి 30 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మింపజేశారు. నియోజవర్గంలో బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయించారు. దీంతోపాటు నాగిరెడ్డిపేట మండలంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయించారు. కాగా నియోజవర్గంలోని అమర్లబండ, ధర్మరావుపేట, మోతె, గుర్జుల్, కాటేవాడి డ్యాంలను నిర్మింపజేసి నియోజకవర్గానికి 10 టీఎంసీల సాగునీరు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఎల్లారెడ్డికి డివిజన్హోదా కల్పించడంతోపాటు ఎల్లారెడ్డిని మున్సిపాలిటీగా మార్చడం వల్ల ప్రజలకు చక్కని సేవలు అందే అవకాశాలు కల్పించబడ్డాయి. అమలవుతున్న పథకాలు ఆసరా పిఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, రైతుభీమా, రైతుబంధు, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం, మత్స్యకారుల పనిముట్లు, కేసీఆర్ కిట్ల పంపిణీ. ప్రధాన సమస్యలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్ల సమస్య ప్రజలను వేధిస్తుంది. బోధన్–మైదక్–హైదరాబాద్ రోడ్డుతో పాటు ఎల్లారెడ్డి–కామారెడ్డి కరీంనగర్ రోడ్డు పూర్తి అధ్వానంగా మారింది. ఎల్లారెడ్డిలో 30 పడకల ఆస్పత్రి భవనం నిర్మించినా పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఎల్లారెడ్డి బస్సుడిపో ఏర్పాటు వాయిదాపడడం, నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు బస్సుసౌకర్యం లేదు. పోచారంప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడం, నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన ఏనుగు రవీందర్‌రెడ్డి మొదట సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వమించేవారు. కాగా తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో రవీందర్‌రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణవాదంతో రాజకీయ అరంగ్రేటం చేసిన రవీందర్‌రెడ్డి కేసీఆర్ ఆదేశాల మేరకు 2008లో తన పదవికి రాజీనామా చేశారు. 2008లో ఎల్లారెడ్డికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్గౌడ్చేతిలో ఓడిపోయారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన రవీందర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రవీందర్‌రెడ్డి తన పదవికి రెండోసారి రాజీనామా చేశారు. దీంతో 2010లో జరిగిన ఉపఎన్నికల్లో రవీందర్‌రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో రవీందర్‌రెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 లో పోల్ అయిన ఓట్లు రవీందర్‌రెడ్డి 70,760 సురేందర్‌రెడ్డి 46,751 పోలైన ఓట్లు 1,58,015 మొత్తం ఓటర్లు 1,85,055 మెజారిటీ 24,009 2018 ఓటర్ల జాబితా పొలింగ్కేంద్రాలు 259 పురుషులు 92,308 మహిళలు 99,267 ఇతరులు 14 మొత్తం ఓటర్లు 1,91,589 -
టీఆర్ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు
సాక్షి, కామారెడ్డి : ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణతో స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో తహసీల్దార్ రంజిత్ కుమార్ ఆయనపై ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఈ 171కింద కేసు నమోదైంది. అసలేం జరిగింది... టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈసీ విచారణకు ఆదేశించింది. డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షలు ఇస్తానంటూ రవీందర్‌రెడ్డి మాట్లాడిన వీడియో ఫుటేజీల ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి నివేదిక పంపిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా సంఘాలకు రూ. 5 లక్షలు ఇస్తానంటూ వాగ్దానం చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సురేందర్ తదితరులు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వీడియో ఫుటేజీని జతచేశారు. -
చిక్కుల్లో టీఆర్ఎస్ నేత ఏనుగు..
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్కల్ గ్రామంలో ఓట్ల కోసం మహిళా సంఘాలను ప్రలోభాలకు గురి చేసేలా ఆయన మాట్లాడారని ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించాయి. ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ ఈ తతంగంపై విచారణ జరుపుతున్నారు. ప్రతిపక్షాలు సమర్పించిన వీడియో పుటేజీలను కూడా ఈసీ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఈసీ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ రంజీత్ సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కోడ్ ఉల్లంఘనపై విచారణకు ఈసీ ఆదేశం
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈసీ విచారణకు ఆదేశించింది. డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షలు ఇస్తానంటూ రవీందర్‌రెడ్డి మాట్లాడిన వీడియో ఫుటేజీల ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి నివేదిక పంపిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా సంఘాలకు రూ. 5 లక్షలు ఇస్తానంటూ వాగ్దానం చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సురేందర్ తదితరులు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వీడియో ఫుటేజీని జతచేశారు. -
‘గ్రంథాలయ’ చైర్మన్‌గా ‘ఏనుగు’
కరీంనగర్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామానికి చెంది న ఏనుగు రవీందర్‌రెడ్డిని ని యమిస్తూ ముఖ్యమంత్రి కేసీ ఆర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం జిల్లా పరిధిలోని వీణ వంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను రా ష్ట్ర టీఆర్ఎస్వీ విద్యార్థి విభా గం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించగా.. రెండు రోజుల క్రితం గంగాధర మండలానికి చెందిన సుంకె రవిశంకర్‌కు టీఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. తాజాగా ఏనుగు రవీందర్‌రెడ్డిని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించడంతో ఉద్యమకారులకు తగిన గుర్తింపునిచ్చారని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవీందర్‌రెడ్డి ప్రాథమిక విద్యను గోపాల్రావుపేటలో, ఇంటర్మీడియట్, డిగ్రీ కరీంనగర్లో పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పనిచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఎస్‌జేఏసీ జిల్లా చైర్మన్‌గా కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్థి ఉద్యమాలను ఉవ్వెత్తున ఎగిసిపడేలా తనవంతు పాత్ర పోషించారు. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన రవీందర్‌రెడ్డిపై 29 కేసులు కూడా నమోదయ్యాయి. సాగరహారం, మిలియన్‌మార్చ్, రెడ్డిగర్జన వంటి కార్యక్రమాల్లో పోలీసుల కళ్లు కప్పి ఉద్యమాలు చేశారు. రవీందర్‌రెడ్డి నియామకంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారందరికీ సముచిత ప్రాధాన్యం దక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తిరుపతికి నిరాశేనా? టీఎస్జేఏసీలో పనిచేస్తూ ఉద్యమాన్ని ముం దుండి నడిపించిన విధ్యార్థి నాయకులైన సిద్ధం వేణు ఇల్లంతకుంట జెడ్పీటీసీ కాగా.. భూక్య తిరుపతినాయక్ ప్రణాళికా బోర్డు మెంబర్‌గా నియామకమయ్యారు. జిల్లా చైర్మన్‌గా పనిచేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి తాజాగా జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. వారితో పాటు కీలకంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి చెందిన వారి చేతుల్లో దాడికి గు రై.. తలకు గాయాలై.. 30 కేసుల వరకు నమోదైన కెమసారం తిరుపతికి పదవి దక్కకపోవడంపై పలువురిని విస్మయానికి గురిచేసింది. సీఎంకు కృతజ్ఞతలు ఉద్యమకారులకు అరుదైన గౌరవం దక్కేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయి. పైరవీలకు, పలుకుబడులకు తావివ్వకుండా ఉద్యమ సమయంలో ముందుండి పనిచేసిన సామాన్యులందరికీ చట్టసభల టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా నామినేటెడ్ పదవుల్లో నియమిస్తున్నారు. సామాన్యులను భుజం తట్టి నడిపిస్తున్న ముఖ్యమంత్రి తీరు అభినందనీయం. నన్ను గుర్తించి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవికి న్యాయం చేస్తూ బంగారు తెలంగాణలో భాగస్వాముడినవుతా. – ఏనుగు రవీందర్‌రెడ్డి -
నేను మొదటి నుంచీ రైతునే
ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సదాశివనగర్: ఇజ్రాయిల్ పర్యటనపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆరోపించారు. తాను మొదటి నుంచి రైతునేనని, తనకు 30 ఎకరాల సాగు భూమి ఉందని పేర్కొన్నారు. బుధవారం ఆయన సదాశివనగర్ మండలం కుప్రియాల్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఓర్వలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇజ్రాయిల్ పర్యటకు వెళ్తున్నారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. గతంలోనూ మహారాష్ట్రలోని బారామతి, సాంగ్లీ ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న చెరుకు పంటను పరిశీలించామన్నారు. ఇప్పుడు సాగు విషయాలను తెలుసుకోవడానికే ఇజ్రాయిల్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. -
హ్యాట్రిక్ రేసులో ఐదుగురు వీరులు
నిజామాబాద్ : ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలవడం అరుదు. ఇలా గెలిస్తే హ్యాట్రిక్ సాధించారంటాం. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నవారిలో పలువురు అభ్యర్థులు ఈ అరుదైన ఘనత సాధించటానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి రెండుసార్లు గెలిచిన యెండల లక్ష్మీనారాయణ సైతం హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సైతం ఈ ఘటన సాధించటానికి ఒక్క విజయం దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నాలుగో విజయం కోసం మరోసారి బోధన్ నుంచే బరిలో నిలిచారు. ఆయన 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.