ఎల్లారెడ్డి పట్టణం
సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఎల్లారెడ్డిలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో వెనుకబడిన నియోజకవర్గంగా పేరొందిన ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఎల్లారెడ్డిలో మొదటిసారిగా 2004లో టీఆర్‌ఎస్ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి గులాబీ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ క్యాడర్‌ను పెంచుకున్నారు.
2008లో నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌అభ్యర్థి జనార్దన్‌గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2009, 2010, 2014లలో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో టీఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్ ఏర్పడింది. గతంలో నాలుగుసార్లు రవీందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆయన ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వచ్చింది. కానీ 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టడంతో ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలుపొందిన రవీందర్‌రెడ్డికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా హోదా వచ్చింది.
చేపట్టిన అభివృద్ధి పనులు
నాలుగున్నరేళ్లలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సుమారు రూ. 760 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ముఖ్యంగా వ్యవసాయాధారితంగా జీవనం సాగించే నియోజవర్గ రైతాంగానికి కరెంట్‌కష్టాలు తొలగిపోయేలా ఎల్లారెడ్డి మండలంలో రూ. 8 కోట్ల నిధులతో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయించారు. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు పలు గ్రామాల్లో రూ. 15 కోట్లు వెచ్చించి 33/11కేవీకి సంబంధించి 15 విద్యుత్ సబ్‌స్టేషన్లను మంజూరు చేయించారు. నియోజకవర్గంలో సుమారు 275 కిలోమీటర్ల రోడ్లు పనులకు ఆర్‌అండ్‌బీ ద్వారా రూ. 240 కోట్ల నిధులను మంజూరు చేయించారు. 661 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లకు శాఖ ద్వారా రూ. 133 కోట్ల నిధులను మంజూరు చేయించారు. నియోజకవర్గంలో 500మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నాలుగు గోదాంల నిర్మాణానికి రూ. 12 కోట్లు కేటాయింపజేశారు.
మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ. 151 కోట్ల నిధులతో నియోజకవర్గంలో 427 చెరువులకు పునఃరుద్ధరణ పనులు చేయించారు. దీంతోపాటు ఎల్లారెడ్డి పట్టణంలో రూ. 4.50 కోట్ల నిధులను వెచ్చించి 30 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మింపజేశారు. నియోజవర్గంలో బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయించారు. దీంతోపాటు నాగిరెడ్డిపేట మండలంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయించారు. కాగా నియోజవర్గంలోని అమర్లబండ, ధర్మరావుపేట, మోతె, గుర్జుల్, కాటేవాడి డ్యాంలను నిర్మింపజేసి నియోజకవర్గానికి 10 టీఎంసీల సాగునీరు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఎల్లారెడ్డికి డివిజన్‌హోదా కల్పించడంతోపాటు ఎల్లారెడ్డిని మున్సిపాలిటీగా మార్చడం వల్ల ప్రజలకు చక్కని సేవలు అందే అవకాశాలు కల్పించబడ్డాయి.
అమలవుతున్న పథకాలు
ఆసరా పిఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, రైతుభీమా, రైతుబంధు, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం, మత్స్యకారుల పనిముట్లు, కేసీఆర్ కిట్ల పంపిణీ.
ప్రధాన సమస్యలు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్ల సమస్య ప్రజలను వేధిస్తుంది. బోధన్–మైదక్–హైదరాబాద్ రోడ్డుతో పాటు ఎల్లారెడ్డి–కామారెడ్డి కరీంనగర్ రోడ్డు పూర్తి అధ్వానంగా మారింది. ఎల్లారెడ్డిలో 30 పడకల ఆస్పత్రి భవనం నిర్మించినా పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఎల్లారెడ్డి బస్సుడిపో ఏర్పాటు వాయిదాపడడం, నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు బస్సుసౌకర్యం లేదు. పోచారంప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడం, నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్‌సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన ఏనుగు రవీందర్‌రెడ్డి మొదట సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వమించేవారు. కాగా తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో రవీందర్‌రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణవాదంతో రాజకీయ అరంగ్రేటం చేసిన రవీందర్‌రెడ్డి కేసీఆర్ ఆదేశాల మేరకు 2008లో తన పదవికి రాజీనామా చేశారు.
2008లో ఎల్లారెడ్డికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్‌గౌడ్‌చేతిలో ఓడిపోయారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసిన రవీందర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రవీందర్‌రెడ్డి తన పదవికి రెండోసారి రాజీనామా చేశారు. దీంతో 2010లో జరిగిన ఉపఎన్నికల్లో రవీందర్‌రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో రవీందర్‌రెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2014 లో పోల్ అయిన ఓట్లు
రవీందర్‌రెడ్డి | 70,760 |
సురేందర్‌రెడ్డి | 46,751 |
పోలైన ఓట్లు | 1,58,015 |
మొత్తం ఓటర్లు | 1,85,055 |
మెజారిటీ | 24,009 |
2018 ఓటర్ల జాబితా
పొలింగ్‌కేంద్రాలు | 259 |
పురుషులు | 92,308 |
మహిళలు | 99,267 |
ఇతరులు | 14 |
మొత్తం ఓటర్లు | 1,91,589 |
Comments
Please login to add a commentAdd a comment