మొన్నటి వరకు వాళ్లిద్దరూ ఉప్పు-నిప్పులా ఉన్నారు.. ఒకరు తమ పదవి కొనసాగింపు కోసం... మరొకరు అదే పదవిని కొట్టేయడానికి హస్తిన చుట్టూ తిరిగారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన ట్రీట్మెంట్ తో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు ? వాళ్లు మనుషులు మాత్రమే కలిశారా ? మనుసులు కూడా కలిశాయా ?
తెలంగాణ కాషాయ దళపతి బండి సంజయ్... ఉద్యమ కెరటం ఈటల రాజేందర్... విరుద్ద స్వభావాలు కల్గిన వీరిద్దరి ఎజెండా ఒక్కటే అయినా.. మొన్నటి వరకు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారు. పక్కా హిందుత్వం ఎజెండాతో ముందుకు వెళ్లే బండి సంజయ్ ఓ వైపు... బీజేపీ యేతర ఓటు బ్యాంకు కల్గిన ఈటల రాజేందర్ మరోవైపు పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా ఉప్పు–నిప్పుగా ఉంటున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చుతున్నారని ప్రచారం కావడం.. ఆపై ఆ పదవి దక్కించుకోవడానికి ఈటల రాజేందర్ పార్టీ హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టడం జరిగింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ తెలంగాణ కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో సున్నితమైన హెచ్చరికలు చేయడం.. కలిసి వెళ్లాలని సూచించారు. అమిత్ షా ఇచ్చిన ట్రీట్మెంట్ తో తెలంగాణ నేతల్లో మార్పు కనిపిస్తుందని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. తెలంగాణ నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతను ప్రత్యేకంగా బన్సల్ కు అప్పగించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బన్సల్ టానిక్ ఎఫెక్ట్ తో నేతలు కొంతకలివిడిగా కనిపిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా చేపట్టిన దీక్షలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ కలిసి మాట్లాడుకోవడం దీక్షలో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఆ ఇద్దరు నేతలు ఒక్కటైనట్లైనని కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. గతంలో ఒకరు మాట్లాడితే.. మరొకరు ఖండనలు ఇవ్వడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే.. తాను అక్కడే పోటీ చేస్తానని గతంలో ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఆ వెంటనే బండి సంజయ్ ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందన్న కామెంట్ చేశారు. పార్టీలో కోవర్టులున్నారని ఈటల రాజేందర్ కామెంట్ చేస్తే.. వెంటనే పార్టీలో మరో నేత కోవర్టులు ఎవరో చెప్పాలని కౌంటర్ ఇచ్చారు.
-విక్రమ్, సాక్షిన్యూస్, హైదరాబాద్.
చదవండి: అందుకే అలా మాట్లాడా.. నాకు వేరే ఉద్దేశం లేదు: కోమటిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment