ఖాస్‌గంజ్ : సమాజ్‌వాదీ వంటి కుటుంబ పార్టీలకు ఓటేయొద్దని యూపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. వారొస్తే రాష్ట్ర పేదల కోసం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆపేస్తారన్నారు. యూపీలోని ఖాస్‌గంజ్‌లో శుక్రవారం ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఓటర్లను కుటం పేరిట విడదీసేందుకు సమాజ్‌వాదీ వంటి పార్టీలు ఎంతగా ప్రయత్నించినా వాటి పాచికలు పారలేదన్నారు.
ఈసారీ అలాంటి ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యూపీ తొలి దశ ఓటింగ్‌లో బీజేపీ హవాయే సాగిందని ధీమా వెలిబుచ్చారు. ‘‘మహిళలు భారీగా వచ్చి మాకు ఓటేశారు. ఓటమి తప్పదని విపక్షాలకు అర్థమైంది. అందుకే ఇప్పటినుంచే ఈవీఎంలపై, ఈసీపై విమర్శలు మొదలు పెట్టాయి. చివరికి పేదలకు కరోనా వ్యాక్సిన్లు వేయడం లేదంటూ దుష్ప్రచారానికి దిగాయి’’ అని ఎద్దేవా చేశారు.
సీఎంగా యోగి ఆదిత్యనాథ్ అద్భుతంగా పని చేశారని కితాబిచ్చారు. రేషన్ మాఫియాను రూపుమాపారని, కేంద్రం పంపుతున్న ప్రతి గింజా హక్కుదారులకే అందేలా చూస్తున్నారని అన్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసే సాహసం చేయలేరన్నారు. అంబేడ్కర్‌వాదులంతా సమాజ్‌వాదీలో చేరాలని పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పిలుపివ్వడం హాస్యాస్పదమన్నారు.
విభజించడమే కాంగ్రెస్ పని
కులం, ప్రాంతం, మతం ఆధారంగా ప్రజలను విడదీయడం, దోచుకోవడమే కాంగ్రెస్ పనంటూ మోదీ దుయ్యబట్టారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మళ్లీ బీజేపీకే ఓటేస్తే అభివృద్ధిలో రాష్ట్రాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క కుమాయున్ ప్రాంతంలోనే ఏకంగా రూ.17 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు తాను శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. తాజా బడ్జెట్లో ప్రకటించిన పర్వతమాల, వైబ్రంట్ విలేజీ ప్రాజెక్టులతో ఉత్తరాఖండ్‌లో మౌలిక సదుపాయాలు మరింత విస్తరించి, టూరిజం పెరిగి అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment