రాజధానిలో వేడెక్కిన రాజకీయం | GHMC Elections 2020 Political Heat In Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ పీఠం: వేడెక్కిన రాజకీయం

Published Fri, Nov 20 2020 1:49 PM | Last Updated on Fri, Nov 20 2020 8:23 PM

GHMC Elections 2020 Political Heat In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. నామినేషన్‌ పత్రాలు దాఖలకు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ తుది జాబితాపై కసరత్తు మరింత వేగవంతం చేశాయి. అధికార టీఆర్‌ఎస్‌ 25 మంది తన చివరి జాబితాను విడదల చేయగా.. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భార్య శ్రీదేవిని చర్లపల్లి డివిజన్‌ నుంచి బరిలో దింపారు.  బల్దియా ఎన్నికల్లో గట్టెక్కేందుకు గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పక్షాలు భారీ కసరత్తు చేశాయి. పార్టీ శ్రేణులు టికెట్‌ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాయి. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ సైతం పోటాపోటీగా గెలుపు గుర్రాల వేటలో వ్యహత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్‌ దక్కనివారిని చేరదీస్తున్నాయి. (చార్మినార్ వద్ద హైటెన్షన్‌.. సంజయ్‌ సవాల్‌)

టీఆర్‌ఎస్‌ నేతలే టార్గెట్‌గా
మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌లో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. టికెట్‌ ఆశించిన భంగపడ్డ నేతలు.. రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో తెలంగాణ భవన్‌ వద్దకు టీఆర్ఎస్ ఆశావహులు భారీ ఎత్తున చేరుకున్నారు. టికెట్‌ దక్కని వారు పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బాలాజీనగర్‌ డివిజన్ టిక్కెట్ కోసం లక్ష్మీ మల్లేష్ యాదవ్ తీవ్రంగా పోరాడినా.. టికెట్‌ దక్కకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక టీఆర్‌ఎస్‌ నేతలే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ అసంతృప్తులను, రెబల్స్‌ను తన వైపుకు తిప్పుకుంటోంది. 

అస్త్రశస్త్రాలు సిద్ధం
నామినేషన్ల అంకం పూర్తయ్యాక ప్రచారానికి మిగిలింది వారం రోజులే కావడంతో ఉరుకులు, పరుగులు తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రచారంలోనూ వ్యూహ ప్రతివ్యూహాలు, లోపాయికారీ ఒప్పందాలు, ఇతరత్రా కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. అన్ని పార్టీల్లోనూ హేమాహేమీల ప్రచార యాత్రలూ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ, స్వతంత్రులూ సర్వసన్నాహకాల్లో మునిగారు. ఓట్ల వేట కోసం ఇంటింటి ప్రచారాలు, సోషల్‌మీడియా వేదికగానే కాక ఇతరత్రా మార్గాలూ యోచిస్తున్నారు. ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించాలని భావిస్తున్నవారితోపాటు గుంభనంగా చేయాలని భావిస్తున్నవారూ ఉన్నారు. ఇక అధికార పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే ఆయుధంగా చేసుకోనుండగా, ప్రతిపక్షాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. గ్రేటర్‌ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మరోసారి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార టీఆర్‌ఎస్‌, ప్రభావం చూపాలని బీజేపీ, పట్టునిలుపుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

పెద్ద సంఖ్యలో నామినేషన్లు
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల రెండోరోజైన గురువారం 522 మంది అభ్యర్థులు 608 నామినేషన్లను దాఖలు చేశారు. మంచి రోజు కావడంతో ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేశారు.  దీంతో ఇప్పటి వరకు మొత్తం 537 మంది అభ్యర్థులు 628 నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం నామినేషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నుంచి 140 మంది, సీపీఐ నుండి ఒకరు, సీపీఎం నుంచి నలుగురు, కాంగ్రెస్‌ నుండి 68 మంది, ఎంఐఎం నుండి 27 మంది, టీఆర్‌ఎస్‌ 195 మంది, టీడీపీ 47 మంది, వైఎస్సార్‌సీపీ  ఒకరు, గుర్తింపు పొందిన పొలిటికల్‌ పార్టీల నుండి 15 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు.  ఇక శుక్రవారం రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. 

గ్రేటర్ టీఆర్ఎస్‌ అభ్యర్ధుల తుది జాబితా విడుదల
25 మంది అభ్యర్ధులతో టీఆర్ఎస్‌ తుది జాబితా 
మేయర్ బొంతు రామ్మోహన్‌ భార్యకు చర్లపల్లి టిక్కెట్‌
టీఆర్ఎస్: ఏఎస్‌రావు నగర్-పావనిరెడ్డి, మీర్‌పేట్‌-ప్రభుదాస్
టీఆర్ఎస్: నాచారం-శేఖర్‌, చిలుకానగర్‌- ప్రవీణ్
టీఆర్ఎస్: హబ్సిగూడ-స్వప్నారెడ్డి, ఉప్పల్‌-భాస్కర్
టీఆర్ఎస్: అత్తాపూర్- మాధవీ అమరేందర్‌, కాచిగూడ-శిరీష
టీఆర్ఎస్: నల్లకుంట-శ్రీదేవి, అంబర్‌పేట్‌-విజయ్‌కుమార్
టీఆర్ఎస్: అడిక్‌మెట్‌-హేమలతారెడ్డి, ముషీరాబాద్‌-భాగ్యలక్ష్మి
టీఆర్ఎస్: కవాడిగూడ-లాస్య, యూసుఫ్‌గూడ-రాజ్‌కుమార్
టీఆర్ఎస్: వెంగళ్‌రావ్‌నగర్‌-దేదీప్యరావు, రెహమత్‌నగర్‌-సీఎన్‌రెడ్డి
టీఆర్ఎస్: నేరెడ్‌మెట్‌-మీనా ఉపేందర్‌రెడ్డి, ఈస్ట్ ఆనంద్‌బాగ్‌-ప్రేమ్‌కుమార్
టీఆర్ఎస్: గౌతమ్‌నగర్‌-సునీతా రాము, గోల్నాక-లావణ్య
టీఆర్ఎస్: చందానగర్‌-రఘునాధరెడ్డి, హైదర్‌నగర్‌-నార్నె శ్రీనివాసరావు
టీఆర్ఎస్: తార్నాక-శ్రీలత, మౌలాలి-ఫాతిమా
తుది జాబితాలో 6 సిట్టింగ్ స్థానాల్లో మార్పులు
నేరేడ్‌మెట్‌, ఈస్ట్ ఆనంద్‌బాగ్, అంబర్‌పేట్, హైదర్‌నగర్‌..
గోల్నాక, తార్నాక స్థానాల్లో అభ్యర్ధులను మార్చిన టీఆర్ఎస్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement