
సాక్షి, విశాఖపట్నం: విశాఖ అభివృద్ధి చెందటం చంద్రబాబుకు, ఈనాడుకు, ఎల్లో మీడియాకు ఎప్పుడూ కడుపుమంటగానే ఉంటుందని, విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా విషపురాతలు రాస్తే ఈ ప్రాంతవాసిగా సహించేది లేదని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హెచ్చరించారు. ‘రుషికొండ సాగరతీరంలో పరిమితులకు మించి ప్రభుత్వం తవ్వకాలు జరుపుతోందని ఒక దుర్మార్గమైన వార్తాకథనాన్ని ఈనాడు ప్రచురించింది. కేంద్రం నుంచి సీఆర్‌జెడ్ అనుమతులున్నా.. లేవంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. పూర్వం ఇక్కడ బిల్డింగులుండేవి.. ఇక్కడ పాతవయ్యాయని కొత్తగా తమ ప్రభుత్వం నిర్మిస్తే ‘రుషికొండ పిండి’ పేరుతో అవాస్తవాలను చంద్రబాబు రాయిస్తున్నారు.
అడుగడుగునా విశాఖ అభివృద్ధిని చంద్రబాబు, టీడీపీ పాంప్లెట్ అయిన పనికిమాలిన పేపర్ ఈనాడు రామోజీరావు అడ్డుకుంటూనే ఉన్నారు..’ అని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలోగల వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ మతాలకు, కులాలకు అతీతంగా అందరినీ ఆదరించిందని చెప్పారు. ఈనాడు పత్రికకు పునాదులు పడింది కూడా విశాఖలోనే అన్న విషయం మరిచిపోయి విషపు రాతలు రాస్తున్నారన్నారు. ‘తిండిపెట్టిన విశాఖ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటావా..? చంద్రబాబు చెప్పినట్లు విశాఖపై విషపు రాతలు రాస్తావా? తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేలా రామోజీరావు తీరు ఉంది..’ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసం రామోజీరావు ఈనాడుని టీడీపీ పాంప్లెట్‌గా తయారుచేసి విషపు రాతలు రాస్తున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబుకి, ఈనాడు రామోజీరావుకి ఉత్తరాంధ్ర అంటే ఎందుకు అంత అక్కసు అని ప్రశ్నించారు. ‘అప్పుడు విశాఖ రైల్వేజోన్ చేయాలని మా పార్టీ ఉద్యమంచేస్తే మీ పార్టీ నేతలతో అడ్డుకున్నావు. పేదలకు ఇళ్ల పట్లాలిస్తే కోర్టులో కేసువేసి అడ్డుకున్నావు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తే కోర్టుల్లో అడ్డుకున్నావు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రాంతమన్నా, విశాఖ అన్నా అంత కోపం ఎందుకో చెప్పాలి. అమరావతిలో కొన్న భూములకు రేట్లు తగ్గుతాయనే బాధ చంద్రబాబులో సుస్పష్టంగా కనబడుతోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం తథ్యం’ అని చెప్పారు. దేశంలోనే అద్భుత నగరంగా విశాఖను తమ నాయకుడు తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు.
కౌలు రైతులకు అండగా సీఎం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 41 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున ఇచ్చి ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. తమ నాయకుడు రైతులకు అన్నివిధాల అండగా నిలుస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలోనే రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం పవన్‌కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు.
1.23 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలిస్తున్నాం
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 28న 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారని చెప్పారు. ఇది దేశచరిత్రలోనే ఓ రికార్డని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చివారిలో లక్షమందికి ఒక్కొక్కరికి రూ.1.80 లక్షలతో ఇల్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment