సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ అకాల వర్షంతో నష్టపోయిన రైతులపై లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం సర్వేకు వస్తుందన్నా రాష్ట్ర ప్రభుత్వం కదలడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఇల్లు కూలిన వారికి కేవలం రూ. 10వేలు ఇస్తే సరిపోదని, పూర్తిగా కూలిన ఇళ్లకు 2 లక్షల రూపాయలు, పాక్షికంగా కూలిన ఇళ్లకు ఒక లక్ష రూపాయలు చెల్లించాలని ఆయన డిమండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు చెల్లించాలన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ నష్టం జరిగినా అది కాంగ్రెస్ పాపమే అంటున్నారని, 6 ఏళ్ల నుంచి మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చూపిన శ్రద్ధ.. రైతులు, ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపించారు. వర్షాలతో నష్టం ఎక్కడ జరిగిందో అక్కడికి అధికారులు వెంటనే వెళ్లి సర్వే చెయ్యాలని, వారికి న్యాయం చెయ్యాలన్నారు. పంట నష్టం కారణంగా రైతులు ఆందోళనతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని, వెంటనే మేలుకొని ఎకరాకు 20వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేందుకు వారి తరపున ఈ నెల 31న కాంగ్రెస్ పార్టీ ఆధ్యరంలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. (చదవండి: బండి సంజయ్‌కు మంత్రి హరీష్ సవాల్)
Comments
Please login to add a commentAdd a comment