
సాక్షి,హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు తరలిస్తుంటే రేవంత్ సర్కార్ చోద్యంగా చూస్తోందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించాలని తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం (BAC Meeting)లో డిమాండ్ చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ (Telangana Assembly Speaker) అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. అనంతరం హరీష్ రావు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు.. అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవటంపై అభ్యంతరం తెలిపాం ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా స్పీకర్‌ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తాం. సంఖ్యా బలాన్ని బట్టి బీఆర్ఎస్‌కు సభలో సమయం ఇవ్వాలని కోరాం. తమ విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు. రైతాంగ సమస్యలు, తాగు సాగు నీటి సమస్యలపై చర్చించాలని కోరామని.. వివిధ (సుంఖిశాల,పెద్దవాగు కొట్టుకుపోవడం,ఎస్ ఎల్ బీసీ ప్రమాదం) ప్రాజక్టులు కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేమన్నారు. మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలని కోరామన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి స్పీకర్ చొరవ తీసుకుని నిధులు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. నదీ జలాల వినియోగంలో విఫలం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఏసీలో చెప్పామన్నారు. ఏపీ నీళ్ళు తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసిందని విమర్శించారు. బిల్లులు చెల్లింపుకు 20 శాతం కమిషన్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని కోరినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవటం చర్చించాలని, బార్స్, వైన్స్, బెల్ట్ షాపులు పెంచటంపై చర్చించాలని కోరినట్లు చెప్పారు. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై చర్చ జరపాలని డిమాండ్ చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలిన పిల్లర్‌ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని బీఏసీలో చెప్పామన్నారు. నిరుద్యోగభృతి, జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని బీఏసీలో కోరినట్లు హరీష్ రావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment