సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడీవేడిగా కొనసాగుతున్నాయి. నేడు సభలో మంత్రులు వర్సెస్ మాజీ మంత్రి హరీష్ అన్నట్టుగా వాతావరణం నెలకొంది. సభలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు రోడ్ల అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘హరీష్‌రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలియదు. నేను మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేదు. ఆయనకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే తెలుసు. హరీష్.. 10వేల కోట్లు దోచుకున్నాడు. రోడ్లు వేయడం బీఆర్‌ఎస్ నేతలకు చేతకాదు.. కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. లక్ష కోట్ల విలువ చేసే ఓఆర్‌ఆర్ అమ్ముకున్నారు. ఏడేళ్లు అయినా ఉప్పల్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ కోసం మాత్రం నాలుగు లైన్ల రోడ్లు ఫామ్ హౌస్ వరకు వేసుకున్నారు. వచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాము. వచ్చే నాలుగు ఎండ్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ను పూర్తి చేస్తాం అన్నారు.
ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డికి హరీష్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ మాట్లాడుతూ..‘వ్యక్తిగతమైనటువంటి విమర్శలు సభలో చేయకూడదని కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. సిద్ధులు మాకే కాదు తమ మంత్రులకు కూడా చెప్పాలి. సభలో ఎవరు తప్పు మాట్లాడినా వారికి రూల్స్ వర్తిస్తాయా. కమీషన్ గురించి మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్టాలు అన్ని వరుసగా చదువుతాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి. నేను కమీషన్ తీసుకున్నట్టు నిరూపించాలి అని సవాల్ విసిరారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి. కొంతమంది సభ్యులు మద్యం తాగి సభకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభ్యులు తాగొచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హరీష్ రావు మాట్లాడిన మాటలు బాధిస్తున్నాయి. సభ్య సమాజం ఇబ్బంది పడే విధంగా హరీష్ రావు మాటలున్నాయి. హరీష్ రావు వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విప్ బీర్ల ఐలయ్య కామెంట్స్.. హరీష్‌రావుకు వాళ్ళ మామ గుర్తుకు వచ్చినట్టు ఉన్నాడు. అందుకు గుర్తుకొచ్చి సభలో మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్‌లో పడుకునే మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడేది. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడిందన్నారు.
అనంతరం, స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘హరీష్ రావు, బీర్ల ఐలయ్య మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment