సీఎం రేవంత్ నిజ స్వరూపాన్ని ప్రజల ముందుంచుతాం: హరీశ్‌రావు
ప్రజలను వంచించడం, మోసగించడమే ఆయన నైజం
ఏడాదిగా ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులే తప్ప చేసిందేమీ లేదు
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపాటు
‘రేవంత్ ఆణిముత్యాలు’ అంటూ వీడియో క్లిప్పింగులు విడుదల
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి రెండు నాలుకల మనిషి అని, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ప్రజలను నిలువునా ముంచేస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. పూటకో రకంగా మాట్లాడే విద్యలో రేవంత్ పీహెచ్‌డీ చేశాడని ఎద్దేవా చేశారు. రేవంత్ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెట్టాలన్నదే తన ప్రయత్నమని చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ సవివర చార్జిషీట్ విడుదల చేస్తామని ప్రకటించారు.
సోమవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, చిరుమర్తి లింగయ్య తదితరులతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘గత ఏడాది పాలనలో సీఎం ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పట్టే ఆణిముత్యాలు’ అంటూ వివిధ అంశాలపై రేవంత్ చేసిన ప్రకటనల వీడియో క్లిప్పింగులను హరీశ్‌రావు విడుదల చేశారు.
ఏడాది పాలనలో ఎడతెగని వంచన
తెలంగాణ ప్రజలను మోసగించడం, వంచించడం రేవంత్ నైజమని హరీశ్ విమర్శించారు. ఏడాది నుంచి ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగుతోందని.. సీఎం అపరిచితుడిలా పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడో పంటకు రైతు బంధు ఇవ్వాలని... కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని ప్రకటించిన రేవంత్ ప్రస్తుతం మాట మార్చారని ఆరోపించారు.
‘బతుకమ్మ చీరల పథకం, ఎల్‌ఆర్‌ఎస్, పోటీ పరీక్షల వాయిదా, కుల సర్వే, ఆక్రమణల కూల్చివేతలు వంటి అంశాలపై రేవంత్ మాటలు మారుస్తున్నారు. ఏక్ పోలీసు విధానం, మద్యం, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై రేవంత్ మాటలు మార్చారు. పచ్చ పార్టీలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవత అన్నారు.. ఇప్పుడు అమ్మ అంటున్నారు. రేవంత్ అవసరమొస్తే కాళ్లు పట్టగలడు, అవసరం తీరిన తర్వాత కాళ్లు లాగగలడు..’’ అని హరీశ్ వ్యాఖ్యానించారు.
నిర్బంధాలు, అణచివేతలే..
కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పిందని... గత ఏడాది పాలనలో నిర్బంధాలు, అణచివేతలు, లాఠీచార్జీలు, కంచెలు, ఆంక్షలు నిత్యకృత్యం అయ్యాయని హరీశ్ ఆరోపించారు. న్యాయం కావాలని రోడ్డెక్కిన నిరుద్యోగులపై కేసులు, లగచర్ల గిరిజనులపై దాడులు ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరిట ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నారని.. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కాలరాసి, రాక్షస పాలన కొనసాగిస్తురని మండిపడ్డారు. విపక్ష నేతగా నక్సలైట్లపై మొసలి కన్నీరు కార్చిన రేవంత్.. బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment