విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు చేయాలి: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: చేతకాని వాడికి మాటలెక్కువ. చేవలేనోడికి బూతులు ఎక్కువ అనే రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. వరంగల్ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపట్ల ఆయన ‘ఎక్స్’వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘11 నెలల పాలనలో సీఎం నోటి వెంట బూతులు తప్ప నీతులు రాలేదు.
కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని 11 నెలల్లో చేసింది చెప్పుకోవడానికి లేక పిచ్చి మాటలు వదిలిండు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి లంబాడీల బిడ్డల దాకా ఆయన చేసిన ఘోరాలు సమసిపోవు’అని హరీశ్ వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. నీ వదరుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు’అని పేర్కొన్నారు. కాంగ్రెస్ జరపాల్సింది అపజయోత్సవాలు నిర్వహించాలని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కవులకు అవమానం: కాళోజీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏటా ఇచ్చే పురస్కారాన్ని కవి, రచయిత నలిమెల భాస్కర్‌కు ప్రదానం చేయకపోవడం శోచనీయమని హరీశ్‌రావు విమర్శించారు. 2024 సంవత్సరానికి గాను నలిమెల భాస్కర్‌కు ప్రభుత్వం కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కాళోజీ జయంతి సందర్భంగా సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేసి గౌరవించే సంస్కృతిని ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా విస్మరించి కవులను అవమానించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment