Huge Public Support For YSRCP Andhra Pradesh Atmakur Bypoll - Sakshi
Sakshi News home page

జనం.. వైఎస్సార్‌సీపీ పక్షం 

Published Mon, Jun 27 2022 2:16 AM | Last Updated on Mon, Jun 27 2022 10:20 AM

Huge Public Support For YSRCP Andhra Pradesh Atmakur bypoll - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నిక ఏదైనా పోటీ ఏకపక్షమే.. ఘన విజయం వైఎస్సార్‌సీపీదే.. ఎన్నిక ఎన్నికకూ పెరుగుతున్న ప్రజాదరణతో వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ సహా ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడుతున్నాయి. ఇదీ 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ రికార్డు విజయాన్ని సాధించింది.

2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు అసలైన నిర్వచనం చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గం నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి సామాజిక న్యాయానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 

ఎన్నిక ఎన్నికకూ పెరుగుతున్న ఓట్ల శాతం 
► పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం సాధించింది. మూడేళ్లలో జరిగిన తిరుపతి లోక్‌సభ.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లోనూ ఏకపక్షంగా ఘన విజయం సాధించింది. 
► 2019లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో 13,16,473 ఓట్లు (79.76 శాతం) పోలైతే.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌ 7,22,877 ఓట్లు (55.03 శాతం) సాధించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 4,94,501 (37.65 శాతం) ఓట్లు దక్కించుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌ 2,28,376 ఓట్ల ఆధిక్యంతో అప్పట్లో విజయం సాధించారు.
► బల్లి దుర్గాప్రసాద్‌ హఠాన్మరణంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి 2021 ఏప్రిల్‌ 27న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో 11,05,468 (64.60 శాతం ఓట్లు పోలైతే.. వైఎస్సార్‌సీపీకి 6,26,108... 56.67 శాతం) ఓట్లు వచ్చాయి. టీడీపీకి 3,54,516 (32.09 శాతం.. బీజేపీ–జనసేన అభ్యర్థికి 5.17 శాతం) ఓట్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి 2,71,592 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.
► తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో చావు దెబ్బ తినడంతో.. ఆ తర్వాత జరిగిన బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబు దూరంగా ఉన్నారు.

సవాల్‌ విసిరినా స్వీకరించలేని దైన్యం 
► టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో.. సంప్రదాయానికి భిన్నమైనా.. బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ సవాల్‌ విసిరితే, ఘోర పరాజయం తప్పదనే భయంతో చంద్రబాబు విముఖత వ్యక్తం చేశారు. 
► నేరుగా బరిలోకి దిగకుండా వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి.. మెజార్టీ తగ్గించేందుకు తెరవెనుక మంత్రాంగం నడిపారు. బీజేపీకి పరోక్షంగా మద్దతు పలుకుతూ.. ఆ పార్టీ అభ్యర్థులకు ఓట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు.
► బద్వేలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకటసుబ్బయ్య హఠాన్మరణం వల్ల జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య డాక్టర్‌ సుధను వైఎస్సార్‌సీపీ బరిలోకి దించింది. టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ–జనసేన పొత్తుతో పోటీ చేశాయి. ఎన్నికల్లో తమ ఏజెంట్లను బూత్‌ల్లో పెట్టి పరోక్షంగా వారి అభ్యర్థికి టీడీపీ పరోక్షంగా మద్దతు పలికింది. 
► 2021 అక్టోబరు 30న ఎన్నికలు జరిగితే నంబర్‌ 2న ఫలితాలు వెల్లడించారు. అంటే ప్రభుత్వం ఏర్పాటైన సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ 90,533 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 76.25 శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకి వచ్చాయి.
► 2019 ఎన్నికలతో పోల్చితే.. వైఎస్సార్‌సీపీకి 15.33 శాతం ఓట్లు పెరిగాయి. అప్పట్లో పోలైన ఓట్లలో వైఎస్సార్‌సీపీకి 60.89 శాతం రాగా.. 44,734 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 14.27 శాతం ఓట్లకు పరిమితమైన బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. 
► 2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్‌ రెడ్డి 22,276 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పట్లో పోలైన ఓట్లలో 53.22 శాతం ఓట్లు సాధించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో అతని సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి పోటీ చేశారు. పోటీకి దూరంగా ఉన్న టీడీపీ.. బీజేపీ అభ్యర్థి తరఫున పలు గ్రామాల్లో ఆ పార్టీ నేతలను పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్లుగా కూర్చోబెట్టి.. పరోక్షంగా మద్దతు పలికింది. 
► అయినప్పటికీ పోలైన ఓట్లలో 74.47 శాతం (1,02,241) ఓట్లు సాధించిన విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ కేవలం 14.1 శాతం ఓట్లకు పరిమితమై.. డిపాజిట్‌ కోల్పోయింది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రక విజయాలు 
► పంచాయతీ.. మండల పరిషత్, జిల్లా పరిషత్‌.. మున్సిపాల్టీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డను అడ్డు పెట్టుకుని.. వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడం కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేయని కుట్ర లేదు. ఆ కుట్రలను ప్రజలు చిత్తు చేశారు. రాష్ట్రంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10,536 పంచాయతీలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు దక్కించుకుంటే.. టీడీపీ మద్దతుదారులు కేవలం 2,100 పంచాయతీలకు పరిమితమయ్యారు.
► రాష్ట్రంలో 649 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 637 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. కేవలం 9 స్థానాలకు టీడీపీ పరిమితమైతే.. జనసేన ఒక స్థానంలో ఉనికిని చాటుకుంది. దాంతో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఒక రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్‌లను ఒకే పార్టీ కైవసం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం.
► రాష్ట్రంలో 9,654 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 8,264 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తే.. టీడీపీ కేవలం 955 స్థానాలకు చిక్కిపోయింది. జనసేన కేవలం 182 స్థానాలకు, బీజేపీ 32 స్థానాలకు పరిమితమైంది.
► రాష్ట్రంలో 87 మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహిస్తే 84 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. 13 కార్పొరేషన్‌లలోనూ క్లీన్‌ స్వీప్‌ చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement