ఇల్లందకుంట ఆలయం వద్ద ఊరి పెద్దమనుషుల ముచ్చట్లు
సాక్షి, ఇల్లందకుంట(హుజూరాబాద్): రాష్ట్రమంతటా బతుకమ్మ, దసరా సందడి కొనసాగుతుంటే.. హుజూరాబాద్ నియోజకవర్గంలో వీటితో పాటు ఎలక్షన్ల పండగకూడా సందడి చేస్తోంది. పిల్లోడి నుంచి ముసలివాళ్ల వరకు ఇద్దరు, ముగ్గురు కలిసిన చోట ఎన్నికల గురించే చర్చ. ‘అన్నా ఈ ఎలచ్చన్లల్ల.. ఎవరు గెల్తరంటవే’ అంటూ ఊరి సావడివద్ద జోరుగా చర్చ కొనసాగిస్తున్నారు.
ఇల్లందకుంట మండలకేంద్రంలోని శ్రీసీతారాముల ఆలయం వద్ద ఉన్న రచ్చబండ వద్ద సోమవారం గ్రామానికి చెందిన పలువురు కూర్చుని ఉన్నారు. ఎన్నికల ముచ్చట్లే మాట్లాడుకుంటున్నా రు.ఈ క్రమంలో ‘సాక్షి’వారిని పలుకరించగా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసేవారికి ఓటు వేస్తామని.. ప్రజల మనిషికి పట్టం కడతామని చెబుతున్నారు.
ముచ్చటగా మూడోసారి!
కరీంనగర్‌అర్బన్: హుజూరాబాద్ నియోజకవర్గానికి రాజకీయ రణరంగంలో చెరగని ముద్ర. కమలాపూర్ నియోజకవర్గ కేంద్రంగా 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 1952, 1957 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ద్విసభ్యుల ప్రాతినిథ్యంగా సాగాయి. 1952లో పి.నారాయణరావు(కాంగ్రెస్), జి.వెంకటేశం(సోషలిస్టు)లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1957లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పి.నర్సింగరావు, జి.రాములు గెలిచారు. 1962నుంచి ఒకరే ప్రాతినిథ్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి. 2008లో హుజూరాబాద్ కేంద్రంగా ఉపఎన్నిక జరగగా తెరాస అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గెలుపొందారు. 2010లో జరిగిన ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. తాజాగా మూడో సారి ఉప ఎన్నిక జరుగుతోంది.
వృద్ధుల నుంచి యువకుల వరకు పోటీ
కరీంనగర్‌టౌన్: హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 61మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, పరిశీలన తర్వాత 43 మంది మిగిలారు. ఇందులో 68 ఏళ్ల వృద్ధుడి నుంచి 25 ఏళ్ల యువకుడి వరకు పోటీలో నిలవడం ఆసక్తి కల్గిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈటల రాజేందర్ వయస్సు 57 ఏళ్లు కాగా, ఆ తర్వాతి స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 38, బల్మూరి వెంకటనర్సింగరావుకు 29 ఏళ్లు ఉన్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థుల్లో చెండులూరి వెంకటసుబ్బారెడ్డి వయస్సు 68 ఏళ్లు కాగా, చిన్న వయసు్కడిగా రావుల సునీల్ 25 బరిలో నిలిచారు. ఈనెల 13న నామినేషన్ల విత్‌డ్రాలు ఉండగా, అప్పటి వరకు బరిలో నిలిచేదెవరో తేలనుంది.
రూ.5.55 లక్షలు పట్టివేత
పోలీసుల తనిఖీల్లో సోమవారం మధ్యాహ్నం రూ.4.50 లక్షల నగదు పట్టుపడింది. కరీంనగర్ టూ టౌన్ సీఐ టి.లక్ష్మీబాబు, ఎస్సైలు టి.మహేశ్, రవీందర్ సిబ్బందితో కలిసి కోర్టుచౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. కారులో నగదు పట్టుబడింది. స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.
రూ.1.05లక్షలు
ఇల్లందకుంట(హుజూరాబాద్): హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా సోమవారం జమ్మికుంట మండలంలో సీఐ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.05 లక్షలు పట్టుకున్నట్లు తెలి పారు. ఈ డబ్బును ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఆ గుర్తులపైనే మక్కువ..
సాక్షి, కరీంనగర్:హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ప్రధానపార్టీలతో పాటు స్వతంత్రులు కలిపి 43మంది బరిలోనిలిచారు. నామినేషన్ల సందర్భంగా స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఇచ్చింది. దీంతో ప్రధాన పార్టీల గుర్తులను పోలిఉండే విధంగా చాలా మంది స్వతంత్రులు తమగుర్తులను ఎంపిక చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా కారును, కమలం గుర్తును పోలిఉండే విధంగా ఉండే గుర్తులపైనే చాలా మంది స్వతంత్రులు మక్కువ చూపారు. ట్రక్కు, రోడ్డురోలర్, ఆటోరిక్షా, ట్రాక్టర్, బస్ లారీ, కమలం గుర్తును పోలి ఉండే క్యాలిఫ్లవర్, పైనాపిల్, పెన్‌నిబ్ విల్ సన్‌రేస్ గుర్తులు కావాలని ఆప్షన్‌గా ఎంచుకున్నారు.
ఈ గుర్తులతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఇరుకున పెట్టడమే కాకుండా తమకు కూడా కొన్ని ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ గుర్తుల ఎంపిక వెనుక రాజకీయ పార్టీలు వ్యూహాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్వంతంత్రులు కోరుకున్న 50 గుర్తుల్లో ట్రక్కు, బ్యాట్స్‌మన్, రోడ్డు రోలర్, చపాతిరోలర్, ఫ్రాక్, కప్పుసాసర్, ట్రాక్టర్, గ్లాసుతంబ్లర్, కుండ, టార్చిలైట్, పతంగి, కుట్టుమిషన్, సీలింగ్‌ఫ్యాన్, టెలివిజన్, ఆటోరిక్షా, సూట్‌కేస్, పెన్‌నిబ్ విత్ సెవన్‌రేస్, హెలికాప్టర్, రైతునాగలి, ఫ్లూట్, విజిల్, కంప్యూటర్, క్యారంబోర్డు, కాలిఫ్లవర్, పైనాపిల్, రింగ్, గ్యాస్‌సిలిండర్, స్టూల్, టైర్, బ్యాట్, గ్లాస్, సాక్స్, స్టాప్లర్, బాల్, అగ్గిపెట్టె, టేబుల్‌ఫ్యాన్, డైమండ్, టేబుల్, పండ్ల గంప, ట్రాక్టర్‌టిల్లర్, డీజిల్‌ఇంజిన్, హార్మోనియం, ఊయల, ఆపిల్, గ్యాస్‌స్టవ్, షూ, సీసీ టీవీ కెమెరా, ఇస్త్రీపెట్టె, బస్, లారీ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment