Huzurabad: టార్గెట్‌ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో? | Huzurabad: Target Etela Rajender Defeat TRS Strategy Over By Poll | Sakshi
Sakshi News home page

Huzurabad: టార్గెట్‌ ఈటల.. అన్ని పార్టీలదీ అదే బాట!

Published Thu, Jun 17 2021 6:14 PM | Last Updated on Thu, Jun 17 2021 8:09 PM

Huzurabad: Target Etela Rajender Defeat TRS Strategy Over By Poll - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనుండడంతో టీఆర్‌ఎస్‌ అధిష్టానం అందుకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకుంటున్నట్లు సమాచారం. హుజూరాబాద్‌లో బీజేపీకి సంస్థాగతంగా బలం లేకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 వేల లోపు ఓట్లు మాత్రమే పోలవడం వంటి పరిణామాలతో ఆ పార్టీకి చెందిన గ్రామ, మండల స్థాయి నాయకులపై కన్నేసింది.

గ్రామ, మండల బీజేపీ నాయకులను గులాబీ గూటికి చేర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈటల బీజేపీలో చేరడాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే సమయంలో గ్రామ, మండల స్థాయిల్లో కాంగ్రెస్‌ కేడర్‌ను కూడా టీఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తున్నారు. ఈటల బీజేపీలో చేరడంతో హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలలో గతంలో ఆయనకు మద్దతుగా నిలిచిన మైనార్టీలు కూడా ఇప్పుడు టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటారనే ధీమాతో ఉన్నారు.

పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో?
ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయమని తేలగా, ప్రస్తుతం అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తే హుజూరాబాద్‌ నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తా’ అని పేర్కొన్నారు. బీజేపీ వంటి పార్టీలోకి నాయకులు రావడం సహజమేనని, హుజూరాబాద్‌ నుంచి గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈటలను బీజేపీలోకి తీసుకోవడంపై పెద్దిరెడ్డి గతంలో బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయనను పార్టీ నాయకురాలు డీకే అరుణ సముదాయించారు కూడా. అయితే.. బుధవారం ఆయన మీడియా సమావేశంలోచేసిన వ్యాఖ్యల వెనుక పార్టీ మారే ఆలోచన ఉన్నట్లు స్పష్టమవుతోంది. గులాబీ బాస్‌ పిలిస్తే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశాలను కొట్టి పారేయలేం. 

కాంగ్రెస్‌ నుంచి కౌశిక్‌
ఇటీవల ఓ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావును కలిసిన పాడి కౌశిక్‌ రెడ్డి కూడా బుధవారం హుజూరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్టు అభ్యర్థించడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన ‘ఈఒక్కసారి కాంగ్రెస్‌ టికెట్టు ఇస్తే గెలిచి వస్తాను,పనితీరును చూసి వచ్చే సాధారణ ఎన్నికల నాటికిఏ నిర్ణయం తీసుకున్నా, శిరసావహిస్తాను’ అనిచెప్పుకొచ్చారు. ఆయన ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధిష్టానంతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ ఇంచార్జిగా ఉన్న ఆయన కాంగ్రెస్‌ టికెట్టు కోరడం వెనుక కొత్త లెక్క ఏంటో అర్థం కాకుండా ఉంది.

హుజురాబాద్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు
ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన రోజు నుంచే టీఆర్‌ఎస్‌ అధిష్టానం హుజూరాబాద్‌పై కన్నేసింది. కరీంనగర్‌ జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు సిద్దిపేటకు చెందిన మంత్రి హరీశ్‌ రావును, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రంగంలోకి దింపింది. మండలాల వారీగా ఇంచార్జీలను నియమించి రాజకీయ ఆట ప్రారంభించింది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాతోపాటు వరంగల్‌కు చెందిన ఎమ్మెల్యేలను కూడా హుజూరాబాద్‌లో మోహరించింది.

ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ఓ ఫంక్షన్‌  హాల్‌ను ప్రత్యేకంగా తీసుకున్నారు. ప్రజలతో ఎన్నికైన సర్పంచి మొదలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న నాయకులెవరూ ఈటల వెంట వెళ్లకుండా చూసిన కమలాకర్‌ ఉప ఎన్నిక బాధ్యతను కూడా భుజాన వేసుకున్నారు. 

టీఆర్‌ఎస్‌లోకి ఎల్‌. రమణ
టీఆర్‌ఎస్‌ నుంచి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడంతో ఏర్పడ్డ ‘బీసీ’ గ్యాప్‌ను టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణతో భర్తీ చేయాలని గులాబీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు టీడీఎల్పీ మాజీ నేత, ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు రమణతో చర్చలు జరిపారు. రమణ సైతం ‘మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటా’ అని ఇటీవల జగిత్యాలలో తన భవిష్యత్‌ కార్యాచరణను తెలియజేశారు. ఈనెల 20 తారీఖులోపు రమణ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్‌లో లెక్కలు మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement