
ఇల్లందకుంట (హుజూరాబాద్)/ కమలాపూర్: ‘టీఆర్‌ఎస్ పార్టీ ఏమిచ్చినా తీసుకోండి. కానీ ఒట్టు పెట్టకండి. అధికార పార్టీ ఓడిపోతుందని నిర్ధారణ అయింది. అందుకే నా మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అండగా ఉండండి’ అంటూ మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి, కనగర్తి, లక్ష్మాజిపల్లి, మల్యాల గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, డబ్బులు ఇచ్చి ప్రమాణం చేయమని మాట తీసుకుంటున్నారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కేసీఆర్ అహంకారం వల్ల వచ్చిన ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఇప్పటివరకు తడిసిపోయిన వడ్ల మొఖం చూడలేదుగానీ.. తనను ఓడగొట్టడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ప్రజల గొంతుకగా అసెంబ్లీలో అడుగుపెడతానని అన్నారు.
ఈటల గెలిస్తే ప«థకాలు వెనక్కిపోతాయని అంటున్నారని, ఏ ఒక్క పథకం కూడా పోదని పేర్కొన్నారు. దళితబంధు పథకం దళితులందరికీ షరతులు లేకుండా ఇవ్వాలని, అలాగే బీసీబంధు కూడా ఇవ్వాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బాబూమోహన్, జూజుల శ్రీనివాస్, బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ, హక్కులను కాలరాస్తున్నారు..
ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కులను టీఆర్‌ఎస్ కాలరాస్తోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ లో ఆరు నెలలుగా లిక్కర్ బాటిళ్లు, నోట్ల కట్టలు, కుట్రలు, కుతంత్రాల పర్వం కొనసాగుతోం దన్నారు.
టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేయకపోయినా, ఓటు వేయకపోయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని, పర్మనెంట్ ఉద్యోగులను బదిలీ చేస్తున్నారని.. ఇన్ని ప్రతిబంధకాల మధ్య హుజూరాబాద్ ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ గుండెలో ఉన్న ఈటలకే ఈనెల 30న ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment