Enugala Peddireddy
-
CM KCR: దళితబంధు ఆగదు
అన్ని వర్గాలకూ లబ్ధి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే కొద్దీ వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వస్తున్నాం. అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగేలా చూస్తున్నాం. డైలాగ్‌లు చాలా చెప్పొచ్చు. కానీ వాటిని అమలు చేసి చూపడంలోనే మా నిబద్ధత ఉంది. ఇక్కడి నుంచి దేశాలు కూడా నేర్చుకుని వెళ్తాయి. వారి సంగతి తెలుసు.. తెలంగాణపై అనేక మంది ఉల్టాపల్టాగా మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఎవరెవరు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. ఉద్యమం చివరలో వచ్చినవారు కూడా మేమే తెలంగాణ తెచ్చామని మాట్లాడుతున్నారు. జానా మాట తప్పారు.. నాకు అబద్ధాలు చెప్పడం, గోల్మాల్ చేత కాదు. నన్ను చంపినా అబద్ధాలు ఒప్పుకోను. దేశంలో ఎక్కడా జరగని ఆవిష్కరణలు ఇక్కడ జరుగుతున్నాయి. రెండేళ్లలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తామన్నాం. అదే జరిగితే గులాబీ కండువా కప్పుకుంటానని నాటి ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. మాటతప్పి ఇటీవల నాగార్జునసాగర్ ఎన్నికల్లో పోటీ చేశారు. అదేకాదు కాళేశ్వరం, రైతు బంధు.. ఇలా అనేక విషయాల్లో అనుమానాలు వ్యక్తమైనా అమలు చేసి చూపించాం. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘ఏనుగు పోతుంటే చిన్న చిన్న జంతువులు అరుస్తాయి. ఏనుగులు వాటిని పట్టించుకోవు. అలాగే మేం కూడా చిల్లర అరుపులను పట్టించుకోకుండా కలగన్న తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగుతాం. చిల్లర పంచాయితీలు పట్టించుకోకుండా, పిచ్చి పనులు చేయకుండా అందరి సంక్షేమం, ఆర్థిక బలోపేతం, సంపద పెం చడం, దానిని పంచడం తదితరాల్లో తలమునకలై ఉన్నాం. ఇందులో భాగంగానే దళితబంధును మహాయజ్ఞంలా చేపట్టాం’’ అని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్లో చేరారు. పెద్దిరెడ్డికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. కరోనా మూలంగా ఆలస్యం.. ‘‘తరతరాలుగా వివక్షకు గురైన దళిత జాతి కోసం ఎంతో ఆలోచించి గత ఏడాది బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం. ఏడాది ముందే రావాల్సిన ‘దళిత బంధు’ కరోనా మూలంగా ఆలస్యమైంది. అనువంశిక ఆస్తులు లేకుండా విద్య, వివక్ష, పేదరికాన్ని ఎదుర్కొంటూ.. కాళ్లు, చేతులతో మాత్రమే బతుకుతున్న దళిత కుటుంబాలు లక్షలాదిగా ఉన్నాయి. అలాంటి వారికోసం ఏదో ఒకచోట ‘దళిత బంధు’ ప్రారంభిస్తామంటే కొందరు బాంబులు పడినట్టు భయపడుతున్నారు. విడతల వారీగా ఈ పథకాన్ని వంద శాతం అమలు చేస్తాం. దళితులు 19 శాతం దాకా ఉన్నారు మనిషి చంద్రుడి మీదికి వెళ్లినా దళితులు ఇప్పటికీ కఠిన పేదరికంలో ఉండటం మంచిది కాదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిరుపేదలు దళితులే. గతంలో వారికి దోచిపెట్టామని ఇతరులు అసూయపడేంత ప్రచారం చేశారు. రాష్ట్రంలో దళితులు 15శాతం ఉన్నారనుకుంటే.. వాస్తవంగా 18 నుంచి 19శాతం వరకు ఉన్నట్టు తేలింది. వారికోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటే విపక్ష నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నా దగ్గర ఇలాంటివి రెండు మూడు పథకాలు ఉన్నాయి. అవి అమలైతే ప్రతిపక్షాల పని ఖతమైతుందని గతంలోనే అసెంబ్లీ వేదికగా చెప్పిన. ‘దళిత బీమా’కు కొంత సమయం పడుతుంది రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు కూడా రూ.5లక్షల బీమా సదుపాయం వస్తుంది. అదే తరహాలో దళితులకు కూడా బీమా అమలు చేస్తాం. ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున 3 వేల మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి.. ఏడాది పాటు రైతుల వివరాలను సేకరించాకే రైతు బీమా అమలు చేశాం. వారం పదిరోజుల్లోనే బాధిత కుటుంబానికి పరిహారం అందేలా ఒక వ్యవస్థను రూపొందించాలని చేనేత శాఖను ఆదేశించాం. అదే తరహాలో ఎస్సీ సంక్షేమ శాఖకు కూడా దళితబీమా సదుపాయం కల్పించేందుకు కొంత సమయం పడుతుంది. ఎక్కడా లేనిస్థాయిలో సంక్షేమ పథకాలు తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. కరోనా సమయంలోనూ వ్యవసాయ రంగం జీఎస్డీపీకి 17శాతం సమకూర్చడంతో నిలదొక్కుకున్నాం. ఆర్థికంగా వెనుకబడి, సామాజిక వివక్ష ఎదుర్కొంటూ, ప్రతిఫలాలు అందుకోలేని వారి కోసం పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గీత, చేనేత, మత్స్య, రజక, నాయీ బ్రాహ్మణ తదితర రంగాలకు చెందిన వారికోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఎంబీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాం.’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. పెద్దిరెడ్డి, మరికొందరు నేతలు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డితోపాటు టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ స్వర్గం రవి, హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ పి.కిషన్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటి తదితరులు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, పాడి కౌశిక్‌రెడ్డి, కశ్యప్‌రెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ నన్ను పిసినారి అన్నారు కొత్తలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అయోమయం నెలకొన్న స్థితిలో వెయ్యి రూపాయలు సామాజిక పింఛన్‌గా ఇచ్చాం. సీఎం కార్ల రంగు మార్చడానికి కూడా ఎంతో ఆలోచించాం. అప్పటి గవర్నర్ నరసింహన్ ఈ విషయాన్ని ప్రస్తావించి.. నన్ను పిసినారి అని కూడా అన్నారు. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ జాగ్రత్తగా పాలన చేస్తున్నాం కాబట్టే ఈ రోజు దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగాం. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను చూసి మహారాష్ట్రలోని 45 గ్రామాలు తమను తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానించాయి కూడా. తెలంగాణ మరో కాశ్మీర్ తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు లేవని పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రి ప్రకటించారు. ఎరువులు, విత్తనాలు దొరక్క చిన్నాభిన్నమైన రైతాంగాన్ని ఆదుకునేందుకు రైతుబంధు, ఉచిత విద్యుత్, బీమాతో పాటు అనేక వసతులు కల్పించాం. కోటి ఎకరాల్లో 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి రావడంతో పాఠశాలలు, కాలేజీలను కూడా గోదాములుగా మార్చాం. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కాశ్మీర్ ఖండం అవుతుంది. బట్టకు పొట్టకు చావుండదు. చిల్లర వాదనలకు అతీతంగా అన్ని వర్గాల కోసం జరుగుతున్న ప్రస్థానాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. వారికి కామన్సెన్స్ ఎక్కువ. ఈ ప్రస్థానాన్ని ప్రజలు కాపాడుకుంటారు తల్లిదండ్రులకు సేవ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు కొందరు లక్ష రూపాయల జీతం వచ్చినా తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం. ప్రపంచంలో తల్లిదండ్రులను తప్ప దేన్నయినా కొనుక్కోగలం. మనలోనూ అలాంటి వారు ఉంటే మారాలి. తల్లిదండ్రులకు సేవ చేయనోడు దేశాన్ని బాగు చేస్తాడా? -
Huzurbad Bypoll: రేపు టీఆర్ఎస్లోకి పెద్దిరెడ్డి
సాక్షి, కరీంనగర్: ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం టీఆర్ఎస్లో చేరబోతున్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని గురువారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. తనకు రాజకీయ జీవితం ఇచ్చింది హుజురాబాద్ ప్రజలేనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చినా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా బీజేపీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరికతో గత కొంతకాలంగా పార్టీకి పెద్దిరెడ్డి దూరంగా ఉంటున్నారు. అంతేగాక ఈటల రాకను పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో కొనసాగేందుకు నా మనసు అంగీకరించడం లేదంటూ పేర్కొన్న పెద్దిరెడ్డి ఆ పార్టీలోకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు -
Huzurabad Bypoll: ఇనుగాల పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: బీజేపీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం పెద్దిరెడ్డి సాక్షితో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు దగ్గరై పనిచేయలనుకున్న పరిస్థితులు బీజేపీలో లేవని ఆరోపించారు. ఈటల రాజేందర్ చేరేటప్పుడు తన అవసరం అక్కడ లేదని అన్నారు. ఈటల చేరిక, చేరిన క్రమంపై తనకు చెప్పలేదని విమర్శించారు. ఆయన చేరడం కాదు, చేర్చుకున్న విధానం కరెక్ట్ కాదని తప్పుబట్టారు. ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే..‘నాకు ఆత్మ గౌరవం ఉంది. ఇది నాకు నేను తీసుకున్న నిర్ణయమే. బీజేపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. నేను ఒక్కడినే కాదు. అందులో నేను ఇమడలేను. టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం ఉంది.. నియోజక వర్గ ప్రజల అభివృద్ధి కొసం టీఆర్ఎస్తోనే సాధ్యం. పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉంటారు. నేను పోటి చేయాలా లేదా అనేది టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుంది’. అని పేర్కొన్నారు. కాగా రాజీనామా అనంతరం పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో ఆయన త్వరలోనే టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు స్పష్టమవుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో మరి గులాబీ అధిష్టానం పెద్దిరెడ్డికి టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కుతుందో లేక ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి టికెట్ వస్తుందో వేచి చూడాలి. కాగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరికతో గత కొంతకాలంగా పార్టీకి పెద్దిరెడ్డి దూరంగా ఉంటున్నారు. అంతేగాక ఈటల రాకను పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో కొనసాగేందుకు నా మనసు అంగీకరించడం లేదంటూ పేర్కొన్న పెద్దిరెడ్డి ఆ పార్టీలోకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు -
బీజేపీకి షాక్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా
-
బీజేపీకి షాక్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా
సాక్షి, కరీంనగర్: బీజేపీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరికతో గత కొంతకాలంగా పార్టీకి పెద్దిరెడ్డి దూరంగా ఉంటున్నారు. అంతేగాక ఈటల రాకను పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో కొనసాగేందుకు నా మనసు అంగీకరించడం లేదంటూ పేర్కొన్న పెద్దిరెడ్డి ఆ పార్టీలోకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు కాగా హుజురాబాద్‌లో పెద్దిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయన నిరాశ చెందారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే, తాను మద్దతు ఇవ్వనని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల పార్టీలో చేరడంపై, తనను ఎవరు సంప్రదించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం కరీంనగర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. -
Huzurabad: టార్గెట్ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనుండడంతో టీఆర్ఎస్ అధిష్టానం అందుకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకుంటున్నట్లు సమాచారం. హుజూరాబాద్‌లో బీజేపీకి సంస్థాగతంగా బలం లేకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 వేల లోపు ఓట్లు మాత్రమే పోలవడం వంటి పరిణామాలతో ఆ పార్టీకి చెందిన గ్రామ, మండల స్థాయి నాయకులపై కన్నేసింది. గ్రామ, మండల బీజేపీ నాయకులను గులాబీ గూటికి చేర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈటల బీజేపీలో చేరడాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. అదే సమయంలో గ్రామ, మండల స్థాయిల్లో కాంగ్రెస్ కేడర్‌ను కూడా టీఆర్ఎస్లోకి తీసుకొస్తున్నారు. ఈటల బీజేపీలో చేరడంతో హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలలో గతంలో ఆయనకు మద్దతుగా నిలిచిన మైనార్టీలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వెంటే ఉంటారనే ధీమాతో ఉన్నారు. పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో? ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయమని తేలగా, ప్రస్తుతం అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తే హుజూరాబాద్ నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తా’ అని పేర్కొన్నారు. బీజేపీ వంటి పార్టీలోకి నాయకులు రావడం సహజమేనని, హుజూరాబాద్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈటలను బీజేపీలోకి తీసుకోవడంపై పెద్దిరెడ్డి గతంలో బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయనను పార్టీ నాయకురాలు డీకే అరుణ సముదాయించారు కూడా. అయితే.. బుధవారం ఆయన మీడియా సమావేశంలోచేసిన వ్యాఖ్యల వెనుక పార్టీ మారే ఆలోచన ఉన్నట్లు స్పష్టమవుతోంది. గులాబీ బాస్ పిలిస్తే టీఆర్ఎస్లోకి వెళ్లే అవకాశాలను కొట్టి పారేయలేం. కాంగ్రెస్ నుంచి కౌశిక్ ఇటీవల ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావును కలిసిన పాడి కౌశిక్ రెడ్డి కూడా బుధవారం హుజూరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కాంగ్రెస్ నుంచి టిక్కెట్టు అభ్యర్థించడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన ‘ఈఒక్కసారి కాంగ్రెస్ టికెట్టు ఇస్తే గెలిచి వస్తాను,పనితీరును చూసి వచ్చే సాధారణ ఎన్నికల నాటికిఏ నిర్ణయం తీసుకున్నా, శిరసావహిస్తాను’ అనిచెప్పుకొచ్చారు. ఆయన ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ ఇంచార్జిగా ఉన్న ఆయన కాంగ్రెస్ టికెట్టు కోరడం వెనుక కొత్త లెక్క ఏంటో అర్థం కాకుండా ఉంది. హుజురాబాద్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన రోజు నుంచే టీఆర్ఎస్ అధిష్టానం హుజూరాబాద్‌పై కన్నేసింది. కరీంనగర్ జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు సిద్దిపేటకు చెందిన మంత్రి హరీశ్ రావును, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రంగంలోకి దింపింది. మండలాల వారీగా ఇంచార్జీలను నియమించి రాజకీయ ఆట ప్రారంభించింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతోపాటు వరంగల్‌కు చెందిన ఎమ్మెల్యేలను కూడా హుజూరాబాద్‌లో మోహరించింది. ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. మంత్రి గంగుల కమలాకర్ పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ఓ ఫంక్షన్ హాల్‌ను ప్రత్యేకంగా తీసుకున్నారు. ప్రజలతో ఎన్నికైన సర్పంచి మొదలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నాయకులెవరూ ఈటల వెంట వెళ్లకుండా చూసిన కమలాకర్ ఉప ఎన్నిక బాధ్యతను కూడా భుజాన వేసుకున్నారు. టీఆర్ఎస్లోకి ఎల్. రమణ టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఏర్పడ్డ ‘బీసీ’ గ్యాప్‌ను టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణతో భర్తీ చేయాలని గులాబీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు టీడీఎల్పీ మాజీ నేత, ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రమణతో చర్చలు జరిపారు. రమణ సైతం ‘మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటా’ అని ఇటీవల జగిత్యాలలో తన భవిష్యత్ కార్యాచరణను తెలియజేశారు. ఈనెల 20 తారీఖులోపు రమణ టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్‌లో లెక్కలు మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బీజేపీలో చేరిన ఇద్దరు టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేతలిద్దరు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్‌రెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను ఈ ఇద్దరు నేతలు మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబం ధించిన పలు అంశాలపై రాంమాధవ్ వారితో చర్చించినట్లు తెలిసింది. అనంతరం వీరి చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని రాంమాధవ్ తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో బీజేపీలో వీరి చేరిక ధ్రువీకరించినట్లయింది. -
టీ కేబినెట్లో సమైక్యవాద చాంపియన్లు
* టీటీడీపీ నేత పెద్దిరెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ చూస్తే రాష్ర్టంలో టీడీపీ అధికారంలో ఉన్నట్టు కన్పిస్తోందని, సమైక్యవాద చాంపియన్స్‌గా చెప్పుకున్నవారంతా ఇప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీని బలహీనపరిచేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయోగాలు వృథాప్రయాసేనని అన్నా రు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఊటబావి వంటిదని, ఎప్పటికీ ఖాళీ కాదని అన్నారు. టీడీపీలో ఉన్నవారంతా ద్రోహులే అని మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని, నిన్నటి దాకా ద్రోహులు అని తిట్టిన వారినే ఆయన కేబినెట్లో చేర్చుకున్నారని విమర్శించారు. -
ఎన్టీఆర్ భవన్లో మేడే వేడుకలు
సాక్షి, హైదరాబాద్: కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను ప్రస్తుత ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతంగా పెరుగుతోందని, వారిని పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ భవన్లో మేడే సందర్భంగా గురువారం టీఎన్టీయూసీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈవూరి మృతికి సంతాపం: మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ మృతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు. టీడీపీ బలోపేతానికి ఈవూరి సుబ్బారావు, సీతారావమ్మ దంపతులు కృషి చేశారని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి రామారావు మృతికి బాబు సంతాపం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ వైపు ఇ. పెద్దిరెడ్డి చూపు?
హుజూరాబాద్: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానవర్గం నుంచి ఆయనకు ఆహ్వానం అందగా.. ఆ పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీలో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నెల 16న కరీంనగర్లో జరిగే సోనియాగాంధీ బహిరంగ సభలో పెద్దిరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య కాంగ్రెస్‌లో చేరాలని పట్టుబట్టడంతో ఆయన అంగీకరించినట్లు సమాచారం. తన రాజకీయ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై తన అనుచరులతో చర్చించి నేడోరేపో అధికారికంగా ప్రకటించనున్నారు. టీడీపీలో సరైన గుర్తింపు లేకనే... ఇనుగాల పెద్దిరెడ్డి 1995, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర పర్యాటక, కార్మిక శాఖామంత్రిగా పనిచేశారు. 2004లో ఓటమిపాలయ్యాక టి.దేవేందర్‌గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీలో కీలకభూమిక పోషించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నినాదానికి ఆకర్షితులై నవ తెలంగాణ పార్టీని అందులో విలీనం చేశారు. ప్రజారాజ్యం తీరుపై అసంతృప్తి చెంది మళ్లీ టీడీపీలో చేరారు. 2009లో పెద్దిరెడ్డి పోటీ చేసిన హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేరే వ్యక్తిని ప్రోత్సహించడం, హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయుడు కశ్యప్‌రెడ్డికి సహకరించడంతో చంద్రబాబు తీరుపై అసంతృప్తి చెందారు. ఇటీవలే రామగుండం నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో అక్కడ కూడా పెద్దిరెడ్డికి చుక్కెదురైంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ నుంచి ఆహ్వానం రావడంతో ఆయన అటువైపే మొగ్గుచూపినట్టు సమాచారం.