
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ సెషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ‍్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆందోళన జీవి’ అని చెప్పుకునేందుకు తాను గర్విస్తానంటూ ప్రకటించారు. అలాగే మహాత్మాగాంధీ అత్యుత్తమ ఆందోళన జీవి అని పేర్కొన్నారు. ప్రతి నిరసనలోనూ, దేశానికి పరాన్నజీవులుగా ఉంటున్న ఆందోళన జీవులు వాలిపోతారంటూ విమర్శలు గుప్పించిన మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చిదంబరం బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు.
కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఉద్యమకారులకు మద్దతిస్తున్న వారిపై సెటైర్లు వేశారు. మనుషుల్లో రకరకాల జీవులు ఉన్నట్లే, మన దేశంలో కొత్త రకమైన జీవులు ‘ఆందోళన జీవులు’ తయారయ్యారంటూ వ్యంగ్యోక్తులు విసారు. లాయర్లు, విద్యార్థులు, కార్మికులు, దేశంలో ఎవరు,ఎక్కడ, నిరసన చేపట్టినా, ఈ ఆందోళన జీవులు అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. వాళ్లు పరాన్న జీవులు, ఆందోళన లేకుండా ఉండలేరన్నారు. ఇలాంటి ఆందోళన జీవులు, విదేశీ విధ్వంసక సిద్ధాంతకారులు (ఎఫ్‌డీఐ)ల గుర్తించి, వారినుంచి దేశాన్ని రక్షించుకోవాలంటూ ప్రధాని ఉద్యమకారులపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
I am a proud andolan jeevi. The quintessential andolan jeevi was Mahatma Gandhi.#iamanandolanjeevi
— P. Chidambaram (@PChidambaram_IN) February 10, 2021