కోల్‌కతా: మహిళా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఇటీవల పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకొని.. సువేందు అధికారిని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న తరుణంలో మహిళా పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మహిళా అధికారి. నన్ను టచ్ చేయొద్దు.. పురుష సిబ్బందిని పిలవండి’ అని వారించారు.
తాజాగా సువేందు అధికారి వ్యాఖ్యలకు టీఎంసీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. టీఎంసీ శాసన సభ్యుడు ఇద్రిస్ అలీ ‘ఈడీ, సీబీఐ నా శరీరాన్ని తాకలేవు.. నేను మగవాడిని’ అని రాసి ఉన్న కుర్తా ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లాడు. టీఎంసీ ఎమ్మెల్యే ఇలాంటి డ్రెస్ ధరించి అసెంబ్లీకి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. ‘తనను సీబీఐ, ఈడీ తాకలేవని భావించే ఓ బీజేపీ నేత ఉన్నారు’ అంటూ సువేందు అధికారిని ఉద్ధేశిస్తూ చురకలంటించారు.
చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం
కాగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘నబానా ఛలో’ పేరుతో బీజేపీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఓ మహిళా పోలీస్ తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
కొంతమంది మహిళా పోలీసులు అతన్ని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న తరుణంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను టచ్ చేయొద్దు’ అని వారించారు. అనంతరం ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళా కళ్లల్లో దుర్గామాతను చూస్తానని, మహిళలంటే ఎంతో గౌరవమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment