
హైదరాబాద్: హుజురాబాద్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వంద శాతం గెలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో తమదే విజయమని స్పష్టం చేసిన కేటీఆర్.. అసలు అక్కడ కాంగ్రెస్ ఎక్కడుందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో చిట్‌చాట్ చేస్తూ.. హుజురాబాద్ సీటును వంద శాతం గెలుస్తామనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చిలక జోస్యం చెబుతున్నాడని విమర్శించారు. అసలు హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ ఉన్నట్లే కనబడటం లేదన్న కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఇక ఈటల రాజేందర్ గురించి మాట్లాడిన కేటీఆర్.. ‘ఈటల రాజేందర్.. జానారెడ్డి కంటే పెద్దనాయకుడా?, ఈటెల రాజేందర్‌కు టీఆర్‌ఎస్ అన్యాయం చేసిందా?, టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటి నుంచి ఈటల పదవిలోనే ఉన్నారు కదా.. మరి ఎక్కడ అన్యాయం చేసింది. హుజురాబాద్‌లో ఈటలకు ఓటేస్తే గ్యాస్ ధర తగ్గిస్తారా?, ఈటల రాజీనామా చేస్తే దళితబంధు రాలేదు..ఈటల క్యాబినెట్‌లో ఉన్నప్పుడే దళిత బంధుకు శ్రీకారం చుట్టాం’ అని తెలిపారు.