సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ-జనసేన పొత్తులపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది. ఎన్నికలకు పట్టుమని 60 రోజులు కూడా లేదు. అయినా ఇంకా టిక్కెట్లు ఖరారు కాలేదు. ఈ తరుణంలో కేడర్ చేజారిపోకుండా ఉండేందుకు ఎన్ని డ్రామాలు ఆడాలో.. అన్నీ ఆడేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అందుకే మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన తీసుకొచ్చారు.
‘రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్తా..’ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటన గురించి జనసేన అధికారిక సమాచారం ఇచ్చింది కాదు. విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో చర్చల సందర్భంగా కార్యకర్తలతో పవన్ చేసిన వ్యాఖ్యలివి. ఆ వ్యాఖ్యలే మీడియాకు లీకయ్యాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన వ్యవహారంగానే అర్థమవుతోంది.
టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చలు జరిపినా సీట్ల పంపకంపై ఎటూ తేల్చలేకపోయారు. ఓవైపు టీడీపీ ఏమో ఏకపక్షంగా పలు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతోంది. మరోవైపు టీడీపీ నేతలు పవన్‌ను కలిసి తమ స్థానాల వైపు రావొద్దంటూ కోరుతున్నారు. ఇంకోవైపు.. జనసేన ఆశిస్తున్న స్థానాల్లోనూ టీడీపీ(అదనంగా అందులో వర్గపోరు కూడా) ముందుకొస్తోంది. ఈ తరుణంలో.. బాబు-పవన్‌లు వెనువెనుకే ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. కానీ..
ఫలితం లేనట్లు కనిపిస్తోంది. అందుకే ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాతే ఇరు పార్టీల ఉమ్మడి సమావేశాలు రద్దు అయ్యాయి. పవన్ తన టూర్లు రద్దు చేసుకుని.. మంగళగిరి ఆఫీస్‌కే పరిమితం అయ్యారు. ఇప్పుడు ‘‘వ్యక్తిగత గెలుపు కోసం కాదు.. సమష్టి గెలుపు కోసమే తన వ్యూహాలు, అడుగులు ఉంటాయి. జనసేన కోసం తపించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత నాది’’ అంటూ త్యాగాలకి సిద్దం కావాలనే అర్థం వచ్చేలా పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేన నేతల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అందుకే ఢిల్లీ పర్యటన అని చెప్పినా.. పెదవి విరిచేస్తున్నారు.
పవన్ వ్యాఖ్యలతో.. టీడీపీలో కలకలం
టీడీపీతో కలవడం బీజేపీకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నేనే ఒప్పించా.. అని కార్యకర్తలతో పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తు రాజకీయంపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో టీడీపీ కేడర్ నొచ్చుకుంది. ఈ క్రమంలోనే.. సోమవారం రాత్రి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో కనీసం పవన్‌కు ఆహ్వానం పలికేందుకు కూడా టీడీపీ నేతలు రాలేదని స్పష్టమవుతోంది.
గత నెలలోనూ ఇదే విధంగా లీకులు
పవన్ ఢిల్లీ ఎపిసోడ్‌లో కొసమెరుపు ఏంటంటే.. ఇప్పటివరకు ఆయనకు బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ దొరక్కపోవడం!. ఇవాళో, రేపో అపాయింట్‌మెంట్ ఖరారు అవుతుందని జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే.. గత నెలలోనూ ఇదే విధంగా పవన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి లీకులు ఇచ్చాడు. అప్పుడూ ఇదే తరహాలో అపాయింట్‌మెంట్ దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment