సాక్షి, అమరావతి : పొత్తులతో సహా అనేక అంశాల్లో జనసేన పార్టీ నేతలెవరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశంలేకుండా ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ వారి నోళ్లకు తాళం వేశారు. ‘పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడకండి. ఈ విషయంలో మేలుచేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా. మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాల్లోని చిన్నాచితక నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైన విమర్శలుగా భావించండి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించొద్దు’.. అంటూ పవన్ తమ పార్టీ నేతలకు స్పష్టమైన సూచన చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ మీడియా విభాగం సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.
పార్టీ దృష్టికి తీసుకొచ్చాకే ఎవరిపైన అయినా ఆ విమర్శలు చేయండి..
జనసేన పార్టీ భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయని, వాటిని అర్థంచేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు నడవాలని పవన్ సూచించారు. జనసేనకు సానుకూలంగా ఉండే పార్టీలు, రాజకీయ నాయకులకు మన పార్టీపట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బ తీసే కల్పిత సమాచారాన్ని మన శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్లు పార్టీ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ఆ ప్రకటనలో తెలిపారు.
అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, తీవ్రమైన ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకురావాలని.. పార్టీ సూచనలు, సలహా మేరకే నేతలెవరైనా మాట్లాడాలంటూ ఆదేశించారు. పార్టీ నేతలు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుందని, కనుక నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థాయి, తీవ్రత హద్దులు దాటని విధంగా మన మాటలు ఉండాలని.. ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దని సూచించారు. ‘సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చెయ్యొద్దని.. నేతలకు స్పష్టమైన సూచన చేశారు. ఇక టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న పార్టీ నేతల కోరిక ఎప్పటికీ నెరవేరే అవకాశం ఉండదంటూ మాజీ మంత్రి హరిరామజోగయ్య వంటి వారు ఇటీవల పలు సందర్భాల్లో మాట్లాడుతున్న నేపథ్యంలోనే పవన్ ఈ ప్రకటన జారీచేసి ఉండొచ్చని జనసేనలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment