అధికార సాధనకు సర్వశక్తులూ ఒడ్డుతున్న బీజేపీ
పథకాలపైనే అధికార జేఎంఎం కూటమి భారం
గిరిజన రాష్ట్రం జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరుతోంది. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణం ప్రయతి్నస్తోంది. ఆ కూటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి జార్ఖండ్‌లో కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు ఇతర నేతల అవినీతినే ప్రధాన ఎజెండాగా మలచుకుని ప్రజల్లోకి వెళ్తోంది. అయితే పుంఖానుపుంఖాలుగా ప్రకటించిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గట్టెక్కిస్తాయని అ«ధికార కూటమి విశ్వసిస్తోంది. రాష్ట్రంలో నవంబర్ 13, 20ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు 23న వెల్లడవుతాయి. ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో జార్ఖండ్‌లో విజయం కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో జేఎంఎం–కాంగ్రెస్, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటముల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే...
బీజేపీ దూకుడు మంత్రం
దూకుడైన ప్రచారమే మంత్రంగా జార్ఖండ్ ప్రచార పర్వంలో బీజేపీ దూసుకెళ్తోంది. ఎప్పట్లాగే ప్రధాని మోదీ కరిజ్మాపైనే పార్టీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తదితర నేతలు కూడా రాష్ట్రంలో కాలికి బలపం పట్టుకుని తిరుగుతున్నారు. పలు అంశాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తూ ప్రజలను ఆలోచింపజేయడమే గాక అధికార కూటమిని ఇరుకున పెట్టేందుకు ప్రయతి్నస్తున్నారు. 2014లో బీజేపీ 31.8 శాతం ఓట్లతో 37 అసెంబ్లీ స్థానాలు ఒడిసిపట్టి విజయం సాధించింది. 2019లో ఓట్ల శాతం 33.8కి పెరిగినా 25 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎక్కడా చిన్న అవకాశం కూడా వదలరాదని పార్టీ అధిష్టానం పట్టుదలగా ఉంది.
⇒ బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్‌లోకి చొరబాట్లపై బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. వారివల్ల స్థానికుల అవకాశాలన్నింటికీ భారీగా గండి పడుతుందని జోరుగా ప్రచారం చేస్తోంది.
⇒ సీఎం హేమంత్‌తో పాటు జేఎంఎం, కాంగ్రెస్ నేతల్లో పలువురిపై ఈడీ, సీబీఐ దాడులను ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తోంది.
⇒ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత లేదని ఆరోపిస్తోంది.
⇒ మోదీ సర్కారు అభివృద్ధి నినాదాన్ని వల్లెవేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేతలు ప్రచారం చేస్తున్నారు.
⇒ గత కొద్ది నెలల్లో జార్ఖండ్‌లో వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
పార్టీలో వలసల జోష్: గిరిజనుల్లో గట్టి ఆదరణ ఉన్న మాజీ సీఎం చంపయ్ సోరెన్ జేఎంఎంను వీడి బీజేపీలో చేరడం కమలనాథులకు మరింత ఊపునిచి్చంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకైక ఎంపీ గీతా కోరా కూడా అదే బాట పట్టారు. అంతేగాక సీతా సోరెన్, అమిత్ కుమార్ యాదవ్, కమలేశ్ సింగ్ రూపంలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జేఎంఎం సంక్షేమ మంత్రం
అధికార జేంఎంఎ, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు తెర తీసింది.
⇒ మయ్యా సమ్మాన్ యోజన పేరిట 18–50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఏటా నేరుగా రూ.12 వేల నుంచి రూ.30 వేల దాకా ఆర్థిక సాయం అందిస్తోంది.
⇒ ఆప్‌కీ యోజనా, ఆప్‌కీ సర్కార్, ఆప్‌కే ద్వార్, అబువా ఆవాస్, సార్వత్రిక పెన్షన్‌కు తోడు ఆహార భద్రత, క్రీడలు–విద్యా పథకాలను అమలు చేస్తోంది.
⇒ గిరిజన సెంటిమెంట్‌కు ఇవన్నీ తోడై తమను మరోసారి విజయ తీరాలకు చేరుస్తాయని నమ్ముతోంది.
కల్పన ఫ్యాక్టర్
సీఎం హేమంత్ సోరెన్ కల్పన ప్రచార సభలకు లభిస్తున్న భారీ ఆదరణ కమలనాథుల్లో గుబులు రేపుతోంది. భర్తపై బీజేపీ చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆమె గట్టిగా తిప్పికొడుతున్నారు. ఇటీవల జేఎంఎంలో చేరి ఉప ఎన్నికలో గండే అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో నెగ్గడం అధికార కూటమిలో జోష్ పెంచింది.
గిరిజన సీట్లే నిర్ణాయకం
జార్ఖండ్‌లో ఏకంగా 28 ఎస్టీ రిజర్వుడు స్థానాలున్నాయి. మొత్తం సీట్లలో ఇవి మూడో వంతు కంటే అధికం! అధికార, విపక్ష కూటముల భాగ్యరేఖలను ఇవే నిర్దేశించనున్నాయి.
⇒ ఈ నేపథ్యంలో గిరిజనుడైన తనను మోదీ ప్రభుత్వం వేధిస్తోందంటూ హేమంత్ చేస్తున్న ప్రచారం ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనన్న భయాందోళనలు బీజేపీలో లేకపోలేదు.
⇒ అధికార కూటమి గిరిజన సెంటిమెంట్‌ను గట్టిగా నమ్ముకుంది.
⇒ గిరిజనులు పాటించే సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ జేఎంఎం, కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది.
ఇరు కూటముల్లోనూ లుకలుకలు
అధికార, విపక్ష కూటములు రెండూ ఇంటి పోరుతో సతమతమవుతుండటం విశేషం. ముఖ్యంగా బీజేపీని నేతల విభేదాలు బాగా కలవరపెడుతున్నాయి. ముఖ్య నేతల మధ్య సమన్వయం బాగా కొరవడిందంటూ వార్తలు వస్తున్నాయి. అధికార కూటమిలోనూ లుకలుకలు లేకపోలేదు. పలువురు కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేల సిగపట్ల వివాదం ఎన్నోసార్లు హస్తిన దాకా వెళ్లింది. చాలా అసెంబ్లీ స్థానాల్లో సమన్వయంతో కలిసి పని చేసేందుకు కూడా ఇష్టపడనంతగా ఇరు పార్టీల ముఖ్య నేతల మధ్య విభేదాలు పొడసూపాయి.
Comments
Please login to add a commentAdd a comment