ప్రసంగిస్తున్న కమల్‌హాసన్
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు మక్కల్ నీది మయ్యం నేత, నటుడు కమలహాసన్ ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం అనే విషయం త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కమల్ మదురై వేదికగా ఆదివారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రెండో రోజు అలగర్ కోయిల్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సభలకు పోలీసులు అనుమతి ఇవ్వని దృష్ట్యా ప్రచారం రోడ్ షో రూపంలో సాగించాల్సిన పరిస్థితి. అలాగే ప్రైవేటు స్థలాల్లో విద్యార్థులు, యువతతో చర్చకార్యక్రమాలు, వ్యాపారులు, రైతులతో సమావేశాలతో ముందుకెళుతున్నారు. మదురై పర్యటనతో తేని, దిండుగల్ వైపుగా ప్రచారానికి వెళ్తూ మీడియాతో కమల్ మాట్లాడారు. చదవండి: (గర్భగుడిలో గుప్తనిధి.. రంగంలోకి అధికారులు..)
పోటీ తథ్యం....
అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పోటీ చేస్తుందని, తాను కూడా బరిలో ఉంటానని ప్రకటించారు. నిజాయితీ, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళతామని తెలిపారు. రాష్ట్రంలో మూడో ఫ్రంట్ సాధ్యమేనని, త్వరలో ఇందుకు తగ్గ ప్రకటన వెలువడుతుందన్నారు. రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూద్దామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రజనీని తాను తప్పకుండా కలుస్తానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మార్పు నినాదంతో మక్కల్ నీది మయ్యం ముందుకు సాగుతుందన్నారు.
తాము అధికారంలోకి వస్తే మదురై కేంద్రంగా రెండో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనుమతులు ఇవ్వడం లేదని పేర్కొంటూ, తాము చట్టానికి, నిబంధనలకు కట్టుబడి ప్రచారం చేసుకుంటున్నామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలను గెలిచి ఊపు మీదున్న హైదరాబాద్‌కు చెందిన ఏఐఎంఐఎం పార్టీ మక్కల్ నీది మయ్యంతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వెలువడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment