
సాక్షి , వరంగల్ : అధికార టీఆర్‌ఎస్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తానం ముగిసినట్లయింది. ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే కాగా ఈనెల 14న ముహూర్తం ఖరారైంది. భూఆక్రమణల వివాదంలో చిక్కుకున్న ఈటల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన విషయం తెలిసిందే. గతనెల 1వ తేదీ నుంచి మొదలైన ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో ఆయన రాజకీయ భవితవ్యంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అన్ని పార్టీల నాయకులు, జేఏసీ నేతలను రాజేందర్ కలిసిన సందర్భంగా కొత్తగా పార్టీ పెడతారా.. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారా అన్న చర్చ సాగింది.
చివరకు బీజేపీ కీలక నేతలతో భేటీ అయిన ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ ఆయన స్వగ్రామం కాగా.. ఇక్కడి నుంచే తన కొత్త ప్రస్తానాన్ని తాజాగా మొదలుపెట్టారు. దీనికి తోడు టీఆర్‌ఎస్ అగ్రనేతలు సైతం కమలాపూర్ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటూ ఎవరు కూడా రాజేందర్ వెంట వెళ్లకుండా కట్టడి చేస్తుండడంతో ఉప ఎన్నికలు వస్తే కనక ఈ మండల కేంద్రమే కార్యక్షేతంగా మారనుందని చెప్పొచ్చు.
ఎమ్మెల్యే పదవికి గుడ్ బై
టీఆర్‌ఎస్‌తో 19 ఏళ్ల అనుబంధానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా బీజేపీ కేంద్ర నాయకులతో భేటీ అయిన ఆయన ఆ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈనెల 14 న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో రాజేందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారని వెల్లడించాయి.
అందరి దృష్టి కమలాపూర్‌పైనే...
మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనప్పటి నుంచే ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ అధిష్టానం నజర్ పెట్టింది. మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్ కమలాపూర్ నుంచే ‘ఆపరేషన్’ మొదలెట్టారు. కమలాపూర్‌కు చెందిన ముఖ్య అనుచరులైన జెడ్పీటీసీ మొదలు సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు ఎవరూ ఆయన వెంట వెళ్లకుండా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.
చదవండి: ‘స్వార్థం కోసమే ఈటల రాజీనామా చేశారు’
Huzurabad: ఈటలను దెబ్బకొట్టేందుకు టీఆర్‌ఎస్ రోడ్‌మ్యాప్