ధర్మపురి మున్సిపాలిటీతో పాటు, గొల్లపల్లి మండల ఓటర్ల తీర్పు కీలకం కాబోతున్నాయి. ధర్మపురి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రస్తుత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కమార్‌పై 441 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే మంత్రి కొప్పుల గెలుపుపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని తన ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరుగుతోంది. ఈసారి జరుగనున్న ఎన్నికల్లో బీఅర్ఏస్ పార్టీ నుండి ప్రస్తుత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసే అవకాశం ఉంది.
త్రిముఖ పోటీ:
కాంగ్రెస్ పార్టీ నుండి డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. అలాగే గజ్జెల స్వామి, మద్దెల రవీందర్లు కూడా కాంగ్రెస్ నుండి టికెట్ ఆశిస్తూ.. నియోజకవర్గంలో వ్యక్తిగతంగా తమ అనుచరులతో కలసి పర్యటిస్తున్నారు. బిజేపి నుండి గతంలో కన్నం అంజన్న పోటీ చేశారు. ఐతే గత కొద్దికాలంగా అయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ధర్మపురి నుండి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిన్నరగా వివేక్ నియోజకవర్గంలో అడపాదడపా పర్యటిస్తున్న.. ధర్మపురి నుండి పోటీపై ఇప్పటికీ క్యాడర్కు ఏలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ధర్మపురి నుండి వివేక్ పోటీచేస్తే మాత్రం ఎన్నికల్లో మూడు ప్రముఖ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండవచ్చు.
పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత:
వివేక్ కాకుండా బిజేపి నుండి కన్నం అంజన్న లేదా.. మరో కొత్త అభ్యర్థి పోటీ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ద్విముఖ పోటీ ఉంటుంది. ధర్మపురి మున్సిపాలిటీలో మంచినీటి సమస్య, కరెంట్ కోతలతో పాటు, లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేటాయించకపోవడంతో అధికార పార్టీ పని తీరుపై ధర్మపురి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తుండగా.. ఇథనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు, కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్ భూసేకరణతో వెల్గటూర్,పెగడపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు మంత్రి కొప్పులకు తలనొప్పిగా మారాయి. గడిచిన నాలుగున్నర ఏళ్ళలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు మరోసారి పట్టం కడతారని కొప్పుల ఈశ్వర్ ధీమాతో ఉన్నారు. ఓడిపోయిన గత నాలుగున్నర ఏళ్లుగా ప్రజల మధ్య వుండడంతో పాటు, ప్రజల్లో సానుభూతి లక్ష్మణ్ కుమార్కు కలసి వచ్చే అంశం.
నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు:
ధర్మపురి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు, పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహిస్తుంది. అలాగే శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యవసాయరంగంతో పాటు, జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment