సాక్షి, హైదరాబాద్: కన్నడ ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై బీజేపీలో ఉత్కంఠ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ గద్దెనెక్కని సాంప్రదాయం, ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గడం వంటి అంశాల నేపథ్యంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
అయినా కర్ణాటకలో బీజేపీ విజయఢంకా మోగించడం తథ్యమని కమల నాథులు చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని అంటున్నారు. కర్ణాటకలో గెలిస్తే.. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు, తెలంగాణలో కాషాయజెండా ఎగురవేసేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్‌తో అంతర్మథనం..
ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్‌పోల్ అంచనాల్లో ఒకట్రెండు మినహా దాదాపు అన్నీ కాంగ్రెస్‌కు ఆధిక్యం వస్తుందనే పేర్కొన్నాయి. ఇది బీజేపీ వర్గాల్లో కొంత అంతర్మథనానికి దారితీసినా.. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై రాష్ట్ర నేతలు మాత్రం పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తప్పుతాయని, బీజేపీయే అధికారంలోకి వస్తుందని వాదిస్తున్నారు.
ఇక కర్ణాటకలో తెలుగు మాట్లాడే ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలతోపాటు ఇతర చోట్ల కూడా తెలంగాణ ముఖ్యనేతలు పలువురు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఇతర నేతలు దాదాపు నెలరోజుల పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు మూడు, నాలుగు రోజులపాటు వివిధ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతలు వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో సమన్వయ, ప్రచార బాధ్యతలు నిర్వహించిన చోట్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.
మేం పీపుల్ పోల్స్ నమ్ముకున్నాం: కె.లక్ష్మణ్
తాము ఎగ్జిట్ పోల్స్‌ను తప్పుబట్టడం లేదని, అవి ఎలా ఉన్నా తాము పీపుల్ పోల్స్‌ను నమ్ముకున్నామని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగ్జిట్‌పోల్స్ అధికశాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది కదా అన్న మీడియా ప్రశ్నలపై స్పందించారు.
కర్ణాటకలో తాను నెలరోజుల పాటు ఉన్నానని, బళ్లారి జిల్లా ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. యడ్యూరప్ప, బసవరాజు బొమ్మై ప్రభుత్వాలు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కర్ణాటకకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ‘మోదీ ఫాక్టర్’అనేది కచ్చి తంగా ప్రభావం చూపుతుందని తెలిపారు.
సామాజిక న్యాయ సాధన దిశలో ఎస్సీ, ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ల పెంపు, అదనంగా లింగాయత్‌లు, ఒక్కలిగలకు రెండేసి శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు వంటివి ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కచ్చి తంగా తిరిగి అధికారానికి రావడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment