
సాక్షి,గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం బీఆర్‌ఎస్‌కు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం(జులై3) ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో తనను కలిసిన మేడ్చల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
‘బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఓటమితో దిష్టి తీసినట్టయింది. తిరిగి పునరుత్తేజంతో ప్రజాదరణను కూడగట్టాలి. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటోంది.
కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుసుకుంటున్నరు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ తెలంగాణసమాజాం కోరుకుంటోంది. కేసీఆర్ మీద ద్వేషంతో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ మీద ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది’అని కేసీఆర్ అన్నారు.