సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని తెలిపారు.
వివరాల ప్రకారం.. విజయవాడలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేశినేని శ్వేత టీడీపీకి రాజీనామా చేయనున్నారు. కాగా, శ్వేత ప్రస్తుతం విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. అయితే, కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో తన కూతురు శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శ్వేత తన రాజీనామా లేఖను అందజేస్తుందన్నారు. కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తుందని ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు.
అందరికీ నమస్కారం 🙏🏼
— Kesineni Nani (@kesineni_nani) January 7, 2024
ఈ రోజు శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది . pic.twitter.com/gANCVCKrZJ
కేశినేని నాని ఫైర్..
ఇదిలా ఉండగా.. కేశినేని నాని తన పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ జెండాలను పీకేసినట్లు స్వయంగా ఆయనే తెలిపారు. దీంతో ఆయన టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకొన్నట్లుగా అర్థం అవుతోంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం రాత్రి కేశినేని నానితో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. తిరువూరు సభకు రావాలని అధిష్టానం దూతగా కోరినట్లు తెలిసింది. అయితే ఆయన ససేమిరా అంటూ తిరస్కరించారని సమాచారం. ఆదివారం సైతం తన రాజీనామాపై స్పందించారు. రాజీనామా చేస్తామని చెప్పాక కచ్చితంగా చేసేస్తానని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యతో రాజీనామా ఆలస్యం అవుతుందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. దీనిని బట్టి ఎంపీ కేశినేని నాని పూర్తిగా టీడీపీ నుంచి వెళ్లిపోవటానికి, తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
తిరువూరు సభలో సీటు కేటాయించినా..
తిరువూరు సభలో టీడీపీ నేతలు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. తిరువూరు సభలో ముందు వరుసలో ఎంపీ కేశినేని నానికి సీటు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో సైతం ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ ఫొటోలు వేశారు. ఈ విషయం ఎంపీ కేశినేని నాని దృష్టికి మీడియా తీసుకెళ్తే.. ‘నాకు ప్రొటోకాల్ ఇచ్చామని, పాటిస్తున్నామని చెప్పుకోవటానికి బ్యానర్లలో ఫొటోలు వేశారు. గతంలో ప్రొటోకాల్ పాటించలేదే’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment