సిద్ధం సభలో మాట్లాడుతున్న కొడాలి నాని. చిత్రంలో పేర్నినాని, మార్గాని భరత్
ఇద్దరు గుంటనక్కల మధ్య ప్రయాణం చేస్తున్నాడు: కొడాలి నాని
3 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గానికి 30 సీట్లిచ్చిన బాబు
20 శాతం ఉన్న కాపు సామాజికవర్గానికి 24 సీట్లు మాత్రమే ఇచ్చాడు
డబ్బున్న వాళ్లకే టీడీపీలో టికెట్లు: పేర్ని నాని
రాజకీయ వ్యాపారం చేసే బాబు, పవన్ రాష్ట్రానికి అవసరం లేదు: భరత్‌రామ్
రాజమహేంద్రవరంలో సిద్ధం సభ
సాక్షి, రాజమహేంద్రవరం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించేది టీడీపీ నేతలేనని, ఈ విషయంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ వంటి గుంటనక్కలతో పవన్ ప్రయాణం చేస్తున్నాడని చెప్పారు. ఎవరు ఎప్పుడు ఎలా పొడుస్తారో చెప్పలేని పరిస్థితి అని అన్నారు. పవన్‌ను కాపాడుకోవాల్సిన అవసరం జనసైనికులు, అభిమానులకు ఉందన్నారు. అది జరగాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పాతాళానికి తొక్కి, టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
రాజమహేంద్రవరంలో సోమవారం ‘ఎన్నికలకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం సిద్ధం’ పేరిట స్థానిక ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో కొడాలి నాని మాట్లాడుతూ, పవన్‌ను ఓడించేందుకు సీఎం వైఎస్ జగన్ వ్యూహం పన్నుతున్నారంటూ బాబు, ఆయన అనుకూల మీడియా డప్పు కొడుతున్నారని.. రాష్ట్రంలోని 175 సీట్లలోనూ వైఎస్సార్ సీపీ గెలవాలన్నది సీఎం జగన్ ఉద్దేశమని, ఓడే వాళ్లలో బాబు, పవన్, లోకేశ్ కూడా ఉండవచ్చని అన్నారు.
ఒక్కడే ఎన్నికల బరిలో వస్తే గెలవలేడని భావించిన చంద్రబాబు.. దత్తపుత్రుడు పవన్, డ్రామోజీ, టీవీ–5, పౌడర్ డబ్బా వంటి వారిని వెంట వేసుకుని వస్తున్నాడని ధ్వజమెత్తారు. 3 శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 30 స్థానాలిచ్చిన చంద్రబాబు.. 20 శాతం ఉన్న కాపులకు మాత్రం 24 సీట్లే ఇచ్చాడని దుయ్యబట్టారు. ఇవ్వడానికి చంద్రబాబుకు.. తీసుకునేందుకు పవన్‌కు సిగ్గుండాలని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీలోనే ప్రాధాన్యం: పేర్ని నాని
రాజకీయ చరిత్రలో పార్టీ కార్యకర్తలకు అత్యంత విలువ, ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కార్యకర్తలు తమకు ఎమ్మెల్యే అభ్యర్థి వద్దంటే మార్చే పరిస్థితులు మరే పార్టీలోనైనా ఉంటాయా? అని ప్రశ్నించారు. టీడీపీలో డబ్బుంటేనే టికెట్ ఇస్తున్నారని ఆరోపించారు. సంక్షేమానికి డబ్బులు ఇస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని విమర్శిస్తున్న చంద్రబాబు.. ఆయన ప్రకటించిన పథకాలకు డబ్బులు ఏవిధంగా ఇస్తారని దుయ్యబట్టారు.
బాబుకు బుద్ధి చెప్పాలి: భరత్‌రామ్
మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటూ, ఏపీలో రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దగాకోరు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన నేతల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఒక మహిళా వలంటీర్‌ను ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుపై ఎంపీ భరత్‌తో పాటు మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆడపిల్లకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం మగతనం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత్ కిశోర్ ఓ చిల్లర మనిషి
గుడివాడ టౌన్: డబ్బులు తీసుకుని చిల్లర వాగుడు వాగే ప్రశాంత్ కిశోర్ వంటి వారిని పట్టించుకోవలసిన అవసరం లేదని కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంత్ కిశోర్‌ను ప్రస్తుతం ఏరాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలేదన్నారు. ఐప్యాక్ నుంచి తన్ని తరిమేసిన తర్వాత ఏపార్టీ అతన్ని చేరదీయక పోతే తీసేసిన తహసీల్దార్‌లాగా బిహార్‌లో సొంత పార్టీ పెట్టి ఫలితం లేక డిజాస్టర్ అయిపోయాడన్నారు. చంద్రబాబు లాంటి పనికి మాలిన వ్యక్తుల వద్ద ప్యాకేజ్ తీసుకుని జ్యోతిష్యం చెపుతున్నాడన్నారు. ఐప్యాక్ టీమ్ ఇప్పటికీ వైఎస్సార్‌సీపీకి పని చేస్తోందన్నారు. లగడపాటి రాజగోపాల్‌లాగా జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించిన పీకే చెపితే రెండు, మూడు శాతం ఓట్లు మారి తనకు పడతాయనేది చంద్రబాబు ఆశ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment