సాక్షి, హైదరాబాద్: నల్లగొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు నెల ముందు వరకు రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే వదిలేశానని.. పార్టీ పదవులు ఎంత అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో హైపవర్ కమిటీలు చాలా ఉన్నాయన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యమన్నారు.
కాగా తెలంగాణ పీసీసీకి చెందిన కొత్త కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి చైర్మన్‌గా 40 మందితో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మాణిక్యం ఠాకూర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో రాజకీయ వ్యవహారాల కమిటీలను విడుదల చేసింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు.
ఈ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు. పీసీసీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రెండు కమిటీల్లోనూ చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిప్‌గా మారింది. ఈ విషయమై ఆదివారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
కొన్నాళ్లుగా పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉండటం, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రచారానికి దూరంగా ఉండటం నేపథ్యంలో వెంకట్ రెడ్డికి కొత్త కమిటీల్లో చోటు దక్కలేదని తెలుస్తోంది. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం కూడా కారణమనే చర్చ జరుగుతోంది.
చదవండి: సీబీఐ ఛాయ్ బిస్కెట్ తినడానికి రాలేదు.. కవితపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment