రాజకీయాలలో సినిమా వాళ్ల పాత్ర ఏమిటి?.. వాళ్లు ప్రచారం చేసినంత మాత్రాన గెలిచిపోతారా? ప్రతిసారి ఎన్నికల సమయంలో ఇలాంటి చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. తెలుగు సినీ ప్రముఖుడు బ్రహ్మానందం కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయనను చూడడానికి జనం కూడా బాగానే వచ్చారు. కానీ, ఆయన మద్దతు ఇచ్చిన బిజెపి అభ్యర్ధి డాక్టర్ సుధాకర్ మాత్రం పరాజయం చెందారు!. అయితే..
డాక్టర్ సుధాకర్.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగానే ఇక్కడ గెలిచారు. కాని.. ఆ తర్వాత పరిణామాలలో పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికలో పోటీచేసి సుమారు 35 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అంత మెజార్టీ వచ్చింది కదా అనే ధీమాతో.. తాజా అసెంబ్లీ ఎన్నికలో కూడా గెలుస్తాననే భావనలో కూరుకుపోయిన సుధాకర్‌కు చిక్ బళ్లాపూర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. సుమారు 10,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. తెలుగువారు కూడా గణనీయంగా ఉండే ఆ నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం కూడా ఉపయోగపడుతుందని ఆశించారు. దాని వల్ల ఏమనా కాంగ్రెస్ అభ్యర్ధి అయ్యర్ మెజార్టీ కాస్త తగ్గిందేమో తెలియదు కాని, బిజెపి ఓటమి మాత్రం తప్పలేదు.
నిజానికి బ్రహ్మానందం రాజకీయ మిషన్ తో అక్కడ ప్రచారం చేయలేదు. తనకు వ్యక్తిగత సంబంధాలు ఉండడంతో ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసి వచ్చారట. ఇలా కొన్నిసార్లు యాక్టర్ లు సిద్దాంతాలు,పార్టీలతో నిమిత్తం లేకుండా తమకు ఉన్న సంబంధ, బాంధవ్యాల రీత్యా ప్రచారం చేస్తుంటారు. అన్నిసార్లు వాటి వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పలేం కాని, కొన్నిసార్లు కొంత ప్రయోజనం ఉండవచ్చు. అంతమాత్రాన వారే రాజకీయాలు శాసించే పరిస్తితి లేదనే చెప్పాలి. ఇందుకు కొన్ని మినహాయింపులు ఉండవచ్చు.
👉 తమిళనాడులో అన్నాదురై, కరుణానిది, ఎమ్.జి.ఆర్, జయలలిత వంటివారు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. తమకు ఉన్న సినిమా పాపులారిటీతో పాటు పార్టీ సిద్దాంతం కూడా వారికి కలిసి వచ్చింది. ప్రజలలో మమేకం అయ్యే వారి లక్షణం ఉపయోగపడింది. కానీ, అక్కడే మరో నటుడు విజయకాంత్ రాణించలేకపోయారు. కమల్ హసన్‌ది అయితే మరీ దయనీయం. రజినీకాంత్ రాజకీయాలలోకి రావాలో ,వద్దో తేల్చుకోలేక చివరికి ఆ వైపు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు.
👉 ఏపీలో ఎన్‌టీఆర్(దివంగత) వచ్చేవరకు సినిమావారికి విశేష ప్రాధాన్యం లేదనే చెప్పాలి. కళావాచస్పతి కొంగర జగ్గయ్య ఒకసారి లోక్ సభకు మాత్రం కాంగ్రెస్ పక్షాన ఎన్నికయ్యారు. అది 1971 లో ఇందిరాగాంధీ వేవ్ లో అని గుర్తించాలి. ఆ తర్వాత ఆయన ఒకసారి అసెంబ్లీకి పోటీచేసి ఘోరంగా ఓటమి చెందారు. ఆయన ఒక్కరే కాదు. ప్రముఖ నటుడు కృష్ణ, జమున,కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, శారద, మురళీమోహన్, రామానాయుడు ఇలా పలువురు సినిమావారు ఎన్నికల రాజకీయాలలో ఒకసారికే పరిమితం అయ్యారు. విజయనిర్మల ఆ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. మరో నటుడు నరేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కాని సఫలం కాలేదు.
👉 తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్.టి.రామారావు 1983లో రెండు చోట్ల, 1985లో మూడు చోట్ల పోటీచేసి విజయం సాధించి రికార్డు సృష్టించారు. కాని 1989 లో ఆయన రెండు చోట్ల పోటీచేసి ఆశ్చర్యంగా ఒకచోట ఓటమి చెందారు. మళ్లీ 1994లో రెండు చోట్ల పోటీచేసి గెలిచారు. తొమ్మిది చోట్ల పోటీచేసి ఎనిమిదింట గెలవడం ఒక రికార్డే అయినా, ఒకసారి ఓటమి మాత్రం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. ఆయన ఒక సిద్దాంతంతో ప్రజల ముందుకు రావడం, అప్పట్లో రాజకీయ శూన్యత ఉండడం కలిసి వచ్చింది. అయితే ఎన్.టి.ఆర్.ను 1989లో ఓడించడంలో కొంతమంది సినిమావారి ప్రచార ప్రభావం కూడా కొంత ఉపయోగపడింది. అంటే జనంలో ప్రభుత్వంపై, లేదా ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకత ఏర్పడినప్పుడు సినిమావారి ప్రచారాలు అదనంగా కలిసి వస్తాయని అనుకోవచ్చు. అదే ప్రభుత్వంపై లేదా రాజకీయ పార్టీ పై వ్యతిరేకత లేనప్పుడు ఎంత పెద్ద సినీ నటుడు ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని అనుభవం చెబుతుంది.
👉 ప్రముఖ నటుడు చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీచేసి ఒకచోట మాత్రమే గెలవగలిగారు. ఆ తర్వాత ఎక్కువకాలం ఆయన పార్టీని నడపలేకపోయారు. చిరంజీవి సభలకు జనం పోటెత్తినా ఆశించిన ఓట్లు రాలేదు. ఆయనకు రాజకీయ వ్యూహం కొరవడడమే కారణం అని చెప్పాలి. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారు. టీడీపీ గెలుపునకు ఆయనే కారణమని అభిమానులు భావించేవారు. అదే పవన్ కళ్యాణ్ 2019లో మరో రాజకీయ కూటమి ఏర్పాటు చేసి పోటీలో దిగి రెండు చోట్ల పోటీచేస్తే , ఆ రెండిట ఓడిపోవడం విశేషం. ఆయన ఫెయిర్ రాజకీయాలు చేయకపోవడం, తెలుగుదేశంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంటకాగడం, ఆయనను నమ్ముకున్న అబిమానులు, కాపు సామాజికవర్గ నేతల అబిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఆయన రాజకీయంగా సఫలం కాలేకపోయారు. తిరిగి 2024లో కూడా టిడిపికి తోక పార్టీగానే ఉండాలని ఆయన నిర్ణయించుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాలం ఆయనను సి.ఎమ్.,సి.ఎమ్.అంటూ నినదించిన అభిమానులకు ఆశాభంగం కలిగిస్తూ చంద్రబాబుకు ఆయన ఆ విషయంలో సరెండర్ అయిపోయి తనకు బలం లేదని చెప్పేసుకుని దెబ్బతిన్నారు. ఒక్క ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న ఆయన కోరిక 2024లో నెరవేరుతుందా?లేదా? అన్నది చూడాల్సి ఉంది.
👉 వైఎస్సార్‌సీపీ పక్షాన పోటీచేసి మరో ప్రముఖ నటి రోజా మంత్రి కాగలిగారు. ఆమె ఇప్పటికి రెండుసార్లు విజయం సాధించారు. ఒక ప్రముఖ పార్టీలో కొనసాగి,నాయకుడి పట్ల విధేయతతో ఉండడం , ఒక సిద్దాంతానికి కట్టుబడి ఉండడం వంటి కారణాలు ఆమె రాజకీయ సాఫల్యానికి కారణాలుగా కనిపిస్తాయి. మరో ప్రముఖ నటి జయప్రద ఏపీ నుంచి తొలుత రాజ్యసభ సభ్యురాలైనా, ఆ తర్వాతకాలంలో ఆమె యూపీ నుంచి రెండుసార్లు లోక్ సభ కు ఎన్నికై సంచలనం సృష్టించారు. యుపిలో మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ యాదవ్ తో పాటు , ఆయన పార్టీలోని కొందరి అండ ఉండడంతోనే అది సాద్యమైంది.
👉👉జాతీయ రాజకీయాలలోకాని, ఆయా రాష్ట్రాలలో కాని సినీ ప్రముఖులు పూర్తి స్థాయిలో రాణించిన సందర్భాలు తక్కువేనని చెప్పాలి. కాకపోతే యాక్టర్ లకు ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే వారు తమ సినిమాల ద్వారా ప్రజలను కొంత ప్రభావితం చేస్తారు. జనంలోకి వస్తే వారిని తేలికగా గుర్తు పడతారు. వారి గ్లామర్ ఆ రకంగా ఉపయోగపడుతుంది. అందుకే ఏదైనా వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి కూడా సినీ నటులను అతిధులుగా ఆహ్వానిస్తుంటారు. అంతమాత్రాన ఆ వ్యాపారాలు సక్సెస్ అయిపోతాయని కాదు. వారి వ్యూహంతో పాటు, ప్రజలలో తేలికగా బ్రాండ్ ఇమేజీ తెచ్చుకోవడానికి సినీ నటులు ఉపయోగపడతారని భావించడమే. అలాగే రాజకీయాలలో కూడా వీరు కొంత బ్రాండ్ ఇమేజీకి పనికి వస్తారు కాని, సిద్దాంత పునాది, పెద్ద రాజకీయ పార్టీ మద్దతు లేకుండా వీరు రాణిస్తారని, వీరి ప్రచారంతోనే అభ్యర్ధులు గెలిచిపోతారని అనుకుంటే అది భ్రమేనని పలు అనుభవాలు తెలియచేస్తున్నాయి.
::: కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment