పాడిందే పాడరా.. పాచిపళ్ల దాసుడా అని ఒక నానుడి ఉంది. ప్రస్తుతం సరిగ్గా ఈనాడు మీడియాకు అది వర్తిస్తుంది. రాసిందే, రాసి, చూపిందే చూపి ఈనాడు మీడియా వారి పాఠకులను, ప్రేక్షకులను నానా విధాలుగా హింసిస్తోంది. ఈనాడు రామోజీరావు దశకంఠుడుగా అంటే రావణాసురుడిగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చెరబట్టాలని తీవ్రంగా యత్నిస్తున్నారు. ఏపీ అప్పులపై అనునిత్యం వార్తలు రాసి ప్రజలకు బోరు కొట్టిస్తున్నారు. పదే, పదే ఒక వార్తను ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నది అభినవ గోబెల్స్ గా మారిన రామోజీరావు నమ్మకం.
✍️టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు ఆయన గురువుగా ఉండేవారు. ఇప్పుడు ఆయన బానిస పాత్రకు మారినట్లు అనిపిస్తుంది. అందుకే టీడీపీ కరపత్రం కన్నా హీనంగా ఈనాడు పత్రికను మార్చేశారు. ఈటివిని టీడీపీ యూట్యూబ్ ఛానల్ కన్నా అధ్వాన్నంగా మార్చారు. డిసెంబర్ 19వ తేదీన ఈనాడు దినపత్రికలో రాసిన బానర్ చూస్తే, ఛీ.. ఈనాడు ఇంతగా దిగజారిందేమిటా అనిపిస్తుంది. ఇప్పటికి ఈ నాలుగేళ్లలో ఒక వంద సార్లు ఈ వార్త రాసి ఉంటారు. అయినా వారికి తృప్తి కలగలేదు. ఎన్నికలలోగా ఇంకెన్ని సార్లు రాస్తారో! ముఖ్యమంత్రి జగన్ కారికేచర్ వేసి తొమ్మిది తలలు తగిలించి రుణకంఠుడు అని ఒక చెత్త కథనం వండారు.
✍️నిజానికి పది తలలు ఉన్న దశకంఠుడు రామోజీరావే. రావణాసురుడుగా మారింది ఆయనే. రోజూ ఒక పది పేజీలలో పచ్చి అబద్దాలు రాస్తూ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది రామోజీరావే. ఏ మాత్రం జర్నలిజం విలువలతో నిమిత్తం లేకుండా పత్రికలు కూడా వ్యభిచారం చేయవచ్చని ఈనాడు మీడియా నిరూపిస్తోంది. రాష్ట్ర విభజన నాటి ఉన్న అప్పులన్నీ జగన్ ప్రభుత్వం అప్పులన్నట్లుగా ప్రచారం చేస్తున్న ఈనాడు మీడియా, ఇంత అప్పులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఇస్తున్న భవిష్యత్తుకు గ్యారంటీ హామీలు ఆచరణ సాధ్యం కావని, అది ప్రజలను మోసంచేయడమేనని చెప్పగలదా?
✍️చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దానాలను అమలు చేయరని మాజీ ఐఎఎస్ జయప్రకాష్ నారాయణ చెప్పినదానితో ఈనాడు మీడియా ఏకీభవిస్తుందా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మితి మీరి అప్పులు చేయాలని ఎవరూ చెప్పరు. కాని ఈనాడు రాసిన వైనం చూస్తే జగన్ ప్రభుత్వమే అప్పులు తీసుకువచ్చినట్లు, వాటిని ఎక్కడా ఉపయోగించకుండా వృధా చేశారన్న భావన కలిగించేట్లు దిక్కుమాలిన వార్తను వండింది. రాష్ట్రం అప్పులు సుమారు నాలుగున్నర లక్షల కోట్లు అని కేంద్రం ఎన్నిసార్లు పార్లమెంటులో చెప్పినా, వీరు మాత్రం వినిపించుకోరు. పది లక్షల కోట్లపైనే అప్పులని దుష్ప్రచారం చేస్తారు. పోనీ దానిని అయినా పద్దతిగా రాస్తారా అంటే అదీ ఉండదు. చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో అప్పులు ఎన్ని ఉన్నాయన్నది రాయకుండా, మొత్తం అప్పు అంతా జగన్ ప్రభుత్వమే చేసినట్లు పిక్చర్ ఇస్తుంటారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా?
✍️చంద్రబాబు ప్రభుత్వం సుమారు రెండు లక్షలకు కోట్లకు పైగా అప్పు ఎందుకు తెచ్చిందో చెప్పమనండి. అప్పట్లో వివిధ కార్పొరేషన్‌ల ద్వారా ఎన్ని లక్షల కోట్ల అప్పు తీసుకున్నారో వివరించమనండి. ఆ డబ్బు దేనికి వాడారో ఎన్నడైనా రాశారా? ఊహూ.. వాటికి జోలికే వెళ్లరు. ఎంతసేపు జగన్ ప్రభుత్వంపైనే పడి ఏడుపు. పోనీ జగన్ ప్రభుత్వం ఏ, ఏ కార్యక్రమాలకు అప్పులు చేసిందో చెబుతారా?అంటే అదీ ఉండదు. చంద్రబాబు టైమ్‌లో సివిల్ సప్లైస్ కార్పొరేష్ ద్వారా అప్పులు తీసుకుని ఆ డబ్బును పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికల ముందు పంచిపెడితే అప్పుడు ఈనాడు, తదితర ఎల్లో మీడియా కు అందులో ఎంతో విజన్ కనిపించింది. జనం మాత్రం అది విజన్ కాదు.. వికృతం అని గమనించి టీడీపీ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టారు.
✍️టీడీపీ హయాంలో 1.60 లక్షల కోట్ల మేర అసెంబ్లీ అనుమతి లేకుండా అప్పులు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్‌లో అప్పుల శాతం 15 శాతం అయితే, జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల శాతం 12.4 మాత్రమే. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్యుతూ ప్రభుత్వంపై బురద చల్లుతుంది. చంద్రబాబు పెట్టిన వేల కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం తీర్చవలసి వచ్చింది. చంద్రబాబు దిగిపోతూ వంద కోట్లే మిగిల్చారని అప్పట్లో ఈనాడు మీడియా రాయలేదా! అసలు జగన్ ముఖం చూసి అప్పులు ఎవరు ఇస్తారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానిస్తే ఆనందంగా ప్రచురించింది కూడా ఈ మీడియానే. ఈ సంగతిని పక్కనబెడితే రామోజీరావుకు ఒక సవాల్ విసరదలిచాను.
✍️రాష్ట్ర విభజన నాటి నుంచి ఉన్న అప్పులన్నీ జగన్ ప్రభుత్వానికి అంటగట్టి బదనాం చేయాలని అనుకుంటున్నారు కదా! వీరు రాసిన లెక్క ప్రకారం జగన్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే, ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వస్తే ఆయన ఇచ్చిన హామీలకు ఎన్ని లక్షల కోట్ల వ్యయం అవుతుంది? ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. చంద్రబాబు కేవలం ప్రజలను మోసం చేయడానికే అంతటి భారీ వాగ్దానాలు ఇస్తున్నారని ఈనాడు రాయగలదా?. తెలుగుదేశం అధికారంలోకి రాలేదని తెలిసే, ఈనాడు మీడియా ఆ పార్టీని జాకీలు పెట్టి లేపడానికే ఇలాంటి చెత్త కథనాలు ఇస్తోంది. జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు ఏడాదికి నలభైఐదు వేల కోట్లు వ్యయం చేస్తోంది. దీనికే ఇంత భారీగా అప్పులు అయ్యాయని రాశారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్,లోకేష్ లు కలిసి ఇస్తున్న హామీలకు ఎన్ని లక్షల కోట్లు కావాలి?
✍️చంద్రబాబు ఇచ్చిన ఆరు హామీలకే ఏడాదికి లక్షన్నర కోట్లకు పైగానే నిధులు అవసరం అవుతాయి. వాటిని సమకూర్చుకోవడం అసాధ్యం కాబట్టి యథా ప్రకారం చంద్రబాబు మళ్లీ మోసం చేయడానికే ఈ హామీలన్ని ఇచ్చారని ఈనాడు రాస్తే అప్పుడు ఆ పత్రికను నమ్మవచ్చు. లేకుంటే టీడీపీకి అమ్ముడు పోయి ఇలాంటి దారుణమైన నీచ కథనాలను ఇస్తోందని ప్రజలు అనుకోరా! ఒకపక్క ఆయా స్కీములలో కోత పెడుతున్నారని రాసేది వీరే. వాటికి నిధులు తెచ్చి అమలు చేస్తుంటే, అప్పులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసేది వీరే.
✍️అదే చంద్రబాబు టైమ్‌లో బాండ్ల ద్వారా అప్పులు తీసుకున్నా, ఆహా.. చంద్రబాబు కాబట్టి అప్పులు వచ్చాయని భాజా వాయించారు. ఈనాడు మీడియాకు ఏపీ ప్రజలపై ఎలాంటి మమకారం లేదు. చిత్తశుద్ది అసలే లేదు. వారిది వ్యాపార, రాజకీయ ప్రయోజనమే. రామోజీ ఎప్పుడో ఏపీతో సంబంధం వదలుకున్నారన్నది వాస్తవం. చంద్రబాబు కోసం ఆయన ఏపీ ప్రజలను చెరబట్టాలని చూస్తున్నారు. పోనీ ఆయన అంత నిపుణుడైతే తన గ్రూపు సంస్థలు ఎందుకు నష్టాలు పాలవుతున్నాయి?. మార్గదర్శి వ్యవహారంలో అప్పులు తీర్చడానికి ఆయన తన టివీ చానళ్లను ఎందుకు అమ్ముకున్నారు?. న్యూస్ టైమ్, సోమా తదితర కంపెనీలను ఎందుకు మూసివేశారు?
✍️మార్గదర్శిలో ఎందుకు అక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలను ఎదుర్కుంటున్నారు? అందులో నల్లధనం తిప్పుతున్నారన్న విమర్శలకు ఎందుకు గురి అవుతున్నారు?. మార్గదర్శి చిట్స్ సంస్థ లెక్కలను పారదర్శకంగా ఎందుకు చూపించడం లేదు? ఈయనేమో తన సంస్థల కోసం ఎంత అప్పు అయినా డిపాజిట్ల రూపంలో తీసుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం నిర్ణీత నిబంధనల ప్రకారం అప్పులు చేస్తే మాత్రం చండాలపు స్టోరీలు రాస్తుంటారు. ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగబోతున్నాయి. అంతవరకు ఈనాడు మీడియా అరాచకపు దాడిని జగన్ ఎదుర్కోవలసిందే.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment