ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త సూపర్ సిక్స్! ఇక అభివృద్ధే అభివృద్ధి! ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి మాత్రం అస్సలు మాట్లాడొద్దు! ఇదీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తీరు! తాజా మంత్రివర్గ సమావేశంలో కొత్త సూపర్ సిక్స్‌కు ఆమోదం తెలిపినట్లు వార్తలొచ్చాయి. అన్నీ గేమ్ ఛేంజర్లని బాబు గారు ప్రకటించడం.. అవును అవును అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతులు బాకాలూదడం మొదలైపోయింది.
బాబు గారి కొత్త మాట నిజంగానే గేమ్‌ఛేంజర్లతే తప్పమీ లేదు. రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కానీ గతానుభవాలను చూస్తే, తెలుగుదేశం హయాంలో కాగితాలకే పరిమితమైన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను పరిశీలించినా కొత్త సూపర్ సిక్స్ భవిష్యత్తు ఇట్టే అర్థమైపోతుంది. ఇంతకీ ఈ కొత్త సూపర్ సిక్స్‌లో ఉన్న అంశాలేమిటి?
1. పారిశ్రామిక అభివృద్ధి 2. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఎంట్రప్రన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, 3. ఆహార శుద్ధి 4. ఎలక్ట్రానిక్స్ 5. ప్రైవేట్ పార్క్‌ల విధానం 6. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ.!! వీటిల్లో కొత్తదేమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించి చూడండి మీకే అర్థమైపోతుంది. ఎలాగంటే.. పారిశ్రామిక అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వమేదైనా ఎంతో కొంత కృషి జరుగుతుంది. ఈ ప్రక్రియకు బాబు తన ప్రచారాన్ని మాత్రమే ఇప్పుడు తాజాగా జోడిస్తున్నారు.
2019 - 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు వచ్చినా.. అసలేమీ అభివృద్ధి జరగలేదని, ఉన్నవి కూడా తరలివెళుతున్నాయని ప్రతిపక్షాలు, పచ్చ మీడియా దుష్ప్రచారం చేశాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే.. జగన్ హయాంలో వచ్చిన 16 పరిశ్రమలనే మరోసారి ప్రారంభించి అంతా తమ ఘనతని డప్పు కొట్టుకునే ప్రయత్నం జరిగింది. ఇప్పుడిక.. ప్రతి కుటుంబంలోను పారిశ్రామికవేత్తను, వ్యాపారవేత్తను తయారు చేస్తారట. అప్పట్లో ఇంటికో ఉద్యోగమిస్తామని ఇచ్చిన బూటకపు హామీ మాదిరిగా ఇప్పుడు పారిశ్రామికవేత్తల తయారీ చేపడతారన్నమాట!!
రెండో అంశం...చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి. ముఖ్యమంత్రిగా ఉండగా.. జగన్ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టి ఈ రంగం అభివృద్ధికి కృషి చేశారు. ఈ క్రమంలోనే జగన్ 2014-19 టర్మ్‌లో బాబు పెట్టిన బాకీ పడ్డ వేయి కోట్ల రూపాయిలను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. మూడో అంశంగా ఆహార శుద్ధి పేరు చెబుతున్నారుగానీ, చంద్రబాబు 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే ఇలాంటి పరిశ్రమలు ఎన్ని వచ్చాయో ఆయన చెప్పగలిగివుంటే బాగుండేది. ఎలక్ట్రానిక్స్‌ను నాలుగో అంశంగా చెబుతున్నారు. కొత్తదనం మాత్రం ఏమీ లేదు.
వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఉన్న ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌ను అమరావతికి తరలించడం ఎలాంటి అభివృద్ధో తెలియడం లేదు. ఇంతకు ముందు ఈయన ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఎందుకు తేలేకపోయారో తెలియదు. ఐదో అంశం... ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ విధానం తెస్తారట. బహుశా ఇది గతంలో ఆయన వ్యతిరేకించిన ఎస్ఈజెడ్ లాంటివేమో చూడాలి.
చివరగా... ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ అని అదేదో కొత్తగా కనిపెట్టినట్టు ప్రకటించారు. జగన్ హయాంలో రూ.3.5 లక్షల కోట్లు పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రంగంలో వస్తుంటే అప్పట్లో ఈనాడు మీడియా ఎన్నిరకాలుగా అడ్డుపడిందో చూశాం.
అదానీ కంపెనీ వస్తుంటే మొత్తం అదానీకి రాసి ఇచ్చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి గగ్గోలు పెట్టింది. అసలు అన్ని లక్షల మెగావాట్ల ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించారు. ఆయా పరిశ్రలకు వేల ఎకరాల భూములు ఎందుకు ఇవ్వాలని యాగీ చేశారు. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమకు రాయితీల వర్షం కురిపించబోతున్నారని ఈనాడు మీడియా చెబుతోంది. జగన్ టైమ్ లో రాయితీలు, భూమి వంటివి సమకూర్చితే దోపిడీ అని నీచంగా రాసిన ఈనాడు మీడియా ఇప్పుడు రాయితీలు ఇస్తే వర్షం కురిపించి వారిని సంతోషపెట్టినట్లు చెబుతోంది. ఆ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.
2047 నాటికి రూ.30 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తారట. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు అమరావతిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరికొన్ని ఇన్నోవేషన్ జోన్లు వస్తాయని అన్నారు. నిజంగానే ఈ జోన్లు వచ్చి కొత్త పరిశ్రమలు వస్తే ఎవరూ కాదనరు. కానీ చంద్రబాబు మాటలు కోటలు దాటుతుంటాయి. చేతలు గడప దాటతాయని చెప్పలేం. తాజాగా జాబ్ ఫస్ట్ అనే నినాదం కూడా ఆయన ఇచ్చారు. కొత్త కొత్త విధానాలు, నినాదాలు ఇచ్చేస్తే మొత్తం గేమ్ ఛేంజెర్ అవుతుందని జనాన్ని నమ్మించాలని ఆయన భావిస్తున్నట్టు వుంది.
ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కూడా అదే బాటలో ఉంటుంటారు. కానీ ఈసారి జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టీడీపీ డొల్లతనమేంటో తెలిసిపోయింది. వీరి పెట్టుబడుల బాగోతం బయటపడిపోయింది. టైమ్స్ నౌ ఆంగ్ల మీడియా ఛానెల్ నిర్వహించిన ఫ్రాంక్లీ స్పీకింగ్ కార్యక్రమంలో యాంకర్ ఒక ప్రశ్న వేశారు. అది టెస్లా కార్ల ప్లాంట్లకు సంబంధించినది. 2024 ఏప్రిల్లో లోకేష్ ఒక ట్వీట్ చేస్తూ ''2017లో అప్పటి సీఎం చంద్రబాబుతో కలిసి మీతో (టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో) చర్చలు చేశామని మీరు ఇండియాకు వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మా బృందంలో దీనిపై చర్చించుకున్నామని పెట్టుబడులు ఏపీ ఒక ముఖద్వారమ''ని ఎలాన్ మస్క్‌కు ట్యాగ్ చేస్తూ పేర్కొన్నారు.
అంతే కాకుండా రెండు నెలల్లో టెస్లా ఏపీ నుంచి ఉత్పత్తి చేస్తుందని కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని యాంకర్ గుర్తు చేస్తూ ఎలాన్ మస్క్‌తో సంప్రదింపులు చేశారా అని లోకేష్‌ను అడిగారు. దీంతో షాక్ తిన్న లోకేష్ తేరుకొని ఆయన ఎప్పుడు ఇండియాకు వస్తే అప్పుడు చర్చలు చేస్తామని సమాధానం చెప్పారు. అలా అయితే టెస్లాను ఎప్పటికి సాధిస్తారు? అన్నట్టుగా యాంకర్ ప్రశ్నించగా తాము 2015 నుంచే ఎలాన్ మస్క్‌తో చర్చలు జరుపుతున్నామని అన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చి వంద రోజులు అయిపోయింది కదా మీరేమైనా చర్చలు జరిపారా? లేదా? అని యాంకర్ మరోసారి అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా లోకేష్ దాట వేశారు.
సో చంద్రబాబు, లోకేష్ ల మాటలు ఇలా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. పైగా టీసీఎస్ ఏపీకి వచ్చేసిందని, లులూ కంపెనీ వచ్చేస్తుందని, ఇంకా అనేక రకాల పరిశ్రమలు రాబోతున్నాయని ఆయన చెప్పేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన ప్రకటించిన సూపర్ సిక్స్ గురించి ఒక ముక్క ప్రస్తావించకపోవడం. ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు మళ్లీ చెబుతున్నారు.
2014-19 మధ్యకాలంలోనూ ఇలాగే ప్రచారం చేసుకున్నారుగానీ ఆ పెట్టుబడులు ఎవరికీ కనిపించలేదు. పరిశ్రమల సంగతేమోగానీ ఉద్యోగాలు వచ్చేంత వరకూ నిరుద్యోగులకు రూ.మూడు వేల చొప్పున భృతి ఇస్తామన్న హామీ ఏమైందో ఎవరికీ తెలియదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలు అమలైపోతాయని ఆశించజాలం. కానీ చంద్రబాబు పవన్ కల్యాణ్‌లు ఎన్నికలు అవ్వడమే ఆలస్యం తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, ప్రతి రైతుకు రూ. 20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, నిరుద్యోగ భృతి మూడు వేలు మొదలైన వాటిని బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీగా ప్రకటించారు.
ఇదీ చదవండి: బాబు మాటలు నేతి బీర చందమే!
ఇప్పటికైతే ఈ ఆరు అమలు కాలేదు. ఎప్పటికి ఆరంభిస్తారో చెప్పడం లేదు. దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అంటున్నారు. ఇవికాక సుమారు 200 ఇతర వాగ్ధానాలున్నాయి. మరి వాటిని అన్నిటినీ జనం మరిచిపోవాలా? మరోసారి చెబుతారా? అప్పుడు సూపర్ సిక్స్ అని ఇప్పుడు సూపర్ సిక్స్ అంటే జనం ఎట్లా నమ్మాలి? ఇవి అసలు గేమ్ ఛేంజెర్ ఎలా అవుతాయి? ఒక్క రూ.200 కోట్ల పరిశ్రమ పెట్టాలంటేనే రెండు మూడేళ్లు పడుతుంది. అలాంటిది ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అని చెబుతున్నారు.
ఇన్ని లక్షల ఉద్యోగాల సంగతేమోగానీ లక్షన్నర వాలంటీర్ల ఉద్యోగాలు ఇప్పటికే పోయాయి. ప్రభుత్వ మద్యం షాపుల్లో పని చేసిన 15 వేల మంది ఉద్యోగాలు ఊడాయి. కాకపోతే ఇంకో ఏడాది నుంచే అన్ని లక్షలు వచ్చాయని, ఇన్ని లక్షలు వచ్చాయని ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రకంగా ఏపీ ప్రజలతో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం గేమ్ ఆడుకుంటున్నదన్నమాట.ఈ నేపథ్యంలోనే పాత సూపర్ సిక్స్ మాటేమిటని జనం అడుగుతున్నారని, దాన్ని కవర్ చేయడానికి ఆంధ్రజ్యోతి పాత సూపర్ సిక్స్ లోని రెండు అంశాలు తల్లికి వందనం, రైతు భరోసాలు వచ్చే ఏడాది ఇస్తారని ఊరించింది.
మరి ఈ ఏడాది సంగతేమిటో చెప్పలేదు. అప్పట్లో పీ4 విధానమని పేదరికం పోవడానికి ధనికులంతా దత్తత తీసుకోవాలని చంద్రబాబు ఏవేవో ప్రకటించారు. అసలు పీ4 విధానంతో ఏపీ మారిపోతుందని చెప్పేవారు. ఇప్పుడా విధానం ఏమైందో తెలియదు. తాజాగా సూపర్ సిక్స్ గేమ్ చేంజర్ అంటున్నారు. ఏడాదికి ఒకరకంగా కొత్త కొత్త విధానాలు తీసుకొస్తూ ఐదేళ్లు గడిపేస్తే సరిపోతుందేమో.
- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment