ఎలాగైతేనేమీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాత్కాలికంగా అయినా జైలు నుంచి బయటపడ్డారు. ఆయన లాయర్లు కోర్టులో చేసిన వాదనకు, జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి చాలా తేడా కనిపించింది. కోర్టులలో లాయర్లు చెప్పింది వింటే చంద్రబాబుకు ఏదో చాలా సీరియస్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుకోవాల్సి వచ్చేది. ఆయన వృద్దుడు అయినందున జైలులో అనేక బాధలు పడుతున్నారేమో అన్న అనుమానం కల్పించగలిగారు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదితర టీడీపీ మీడియా సంస్థలైతే అమ్మో.. చంద్రబాబుకు అలా.. అయ్యో చంద్రబాబుకు ఇలా .. అంటూ సానుభూతి కధనాలు రోజూ ప్రచారం చేసి జనాన్ని గందరగోళానికి గురి చేయడానికి యత్నించారు.
మానవత్వంతో దయతలచి..
పాపం.. న్యాయమూర్తి కూడా మానవత్వంతో జాలి తలిచి కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ ఇవ్వడానికే మొగ్గు చూపారు. ఏవో కొన్ని కండిషన్‌లు పెట్టి బెయిల్ ఇచ్చి, ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొంది, తిరిగి నవంబర్ 28న జైలుకు రమ్మని చెప్పారు. ఆ వెంటనే చకచకా విడుదల ప్రక్రియ జరిగి చంద్రబాబు జైలు బయట ఉన్న టీడీపీ కార్యకర్తలను, నేతలను కలుసుకున్నారు.
అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా..
ఆ సందర్భంగా ఆయన కొద్దిసేపు మాట్లాడినప్పుడు, జనంలో ఉన్నప్పుడు అసలు బలహీనంగానే కనిపించలేదు. ఎప్పటి మాదిరే తనదైన శైలిలో మైకు కూడా పుచ్చుకున్నారు. తనకు మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపి, తాను తప్పు చేయలేదని మరోసారి తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అంత అనారోగ్యం ఉందని చెప్పిన వ్యక్తి అర్ధరాత్రి వరకు ఊరేగింపులో పాల్గొనగలగడం అంటే ఏమని అనుకోవాలి? జైలులో ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ప్రచారం చేశారు. చంద్రబాబు కుటుంబం, వారి లాయర్లు, చంద్రబాబు ఆరోగ్యం ఏదో బాగా క్షీణించిపోయిందేమోనన్న అనుమానాలు రేకెత్తించారు.
అబద్దాలేనని తేలిపోయింది..
లోకేష్ సైతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పైన, భదత్రపైన చెప్పినవన్ని అబద్దాలేనని తేలిపోయింది. న్యాయ వ్యవస్థలో అబద్దాలు ఆడి తాత్కాలిక బెయిల్ పొందవచ్చని రుజువు చేసిన ఘనత మాత్రం తెలుగుదేశంకే దక్కింది. మామూలుగా అయితే ఇలాంటి కేసులలో న్యాయమూర్తులు మెడికల్ బోర్డులకు రిఫర్ చేస్తుంటారు. కాని ఇక్కడ చంద్రబాబు సీనియారిటీ, ఆయన చేసిన పదవులు ఉపయోగపడ్డాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం చంద్రబాబు కోరుకున్నట్లుగా టెంపరరీ బెయిల్ ఇచ్చి ఉండవచ్చు.
వ్యవస్థలను ప్రభావితం చేయడానికి
అదే సమయంలో పూర్తి స్థాయి కండిషన్‌లు పెట్టకపోవడం కూడా కొంత ఆశ్చర్యం కలిగించింది. మళ్లీ సీఐడీ చంద్రబాబు ర్యాలీలు చేయకుండా, రాజకీయ ప్రసంగాలు చేయకుండా, మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరవలసి వచ్చింది. దానికి కొంతమేర అనుమతించి, మళ్లీ విచారణ చేపడతామని అన్నారు. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌లు ఎప్పటికప్పుడు న్యాయస్థానాలలో విచారణకు రావడానికి ఒక రోజు ముందు టీడీపీ ఏదో ఒక కార్యక్రమం పెట్టి వ్యవస్థలను ప్రభావితం చేయడానికి కూడా పరోక్షంగా గట్టి యత్నమే చేశారు. ఆ విషయంలో కొంత మేర సఫలం అయినట్లే అనిపిస్తుంది.
బెయిల్‌ను కూడా దుర్వినియోగం చేసిన టీడీపీ
లోకేష్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేశారని ఇంతకాలం ఆరోపించేవారు. మరి ఏ వ్యవస్థను ఆయన మేనేజ్ చేసి తండ్రికి తాత్కాలిక బెయిల్ తెప్పించారో చెప్పాలి. కేవలం మానవత్వ రీత్యా ఇచ్చిన బెయిల్‌ను కూడా టీడీపీ దుర్వినియోగం చేసింది. అదేదో మొత్తం కేసును కొట్టివేసినట్లు హడావుడి చేశారు. టపాసులు పేల్చేశారు. న్యాయం గెలిచిందని, నిజం గెలిచిందని ప్రచారం చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రాజమండ్రి జైలు వద్ద మళ్లీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి బూతులు మాట్లాడారు.
ఈ ఒక్క ఉదంతం చాలు
ఇంకో సంగతి చెప్పాలి. జైలు వెలుపల చంద్రబాబు మనుమడు దేవాన్ష్ కూడా కలిశాడు. మరి ఆయనకు ఇప్పుడైనా నిజం చెప్పారో లేదో. తాత జైలులో నుంచి బయటకు వచ్చారని చెప్పారో లేక ఏదో విదేశం నుంచి అక్కడకు వచ్చారని చెప్పారో తెలియదు. అన్నం మెతుకు పట్టుకుంటే చాలు అది ఉడికిందో, లేదో చెప్పడానికి, టీడీపీని అబద్దాల పార్టీగా మార్చేశారని చెప్పడానికి ఈ ఒక్క ఉదంతం చాలు. ఈ ఏభై రెండు రోజులు టీడీపీకాని, చంద్రబాబు కాని చేసిన విన్యాసాలు గమనిస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరైనా పరిశోధన చేయదలిస్తే మంచి సబ్జెక్ట్ అవుతుంది. వారికి పీహెచ్‌డీ రావడం ఖాయం.
ఒక్కటే గగ్గోలు..
న్యాయ వ్యవస్థను డబ్బు ఉంటే ఎలా వాడుకోవచ్చో, ఎన్ని రకాల పిటిషన్‌లు వేయవచ్చో, ఎలా వాదనలు చేయవచ్చో తెలుసుకోవాలంటే చంద్రబాబు జైలు ఉదంతం ఒక పర్‌ఫెక్ట్ సబ్జెక్టు అని భావించవచ్చు. నిజానికి జైలుకు వెళ్లడానికిముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్ని బీరాలు పలికేవారు. నన్నుఏమి పీకలేవని పదే, పదే సవాల్ చేస్తుండేవారు. తన ఆరోగ్యం ఫిట్, తనకు వయసు ఒక సంఖ్య మాత్రమేనని గొప్పలు చెప్పేవారు. తీరా అన్ని ఆధారాలతో సహా ఆయనను అరెస్టు చేశాక ఒక్కటేగగ్గోలు.
ఉన్నవి లేనివి అబద్ధాలు వల్లించి..
చివరికి తన భార్యను సైతం రోడ్డు ఎక్కించి ఉన్నవి, లేనివి అబద్దాలు చెప్పించారు. ఆయా కోర్టులలో చంద్రబాబు తరపున వేసిన పిటిషన్‌లు ఒక రికార్డు అవుతుందని అనుభవజ్ఞులైన లాయర్లు చెబుతున్నారు. ఒకసారి అసలు కేసుమొత్తం కొట్టివేయాలని అంటారు. ఇంకోసారి ముందస్తు బెయిల్అం టారు. మరోసారి మద్యంతర బెయిల్ అంటారు. అసలు కేసు మెరిట్స్ చర్చకు రాకుండా ఎన్ని జాగ్రత్తలు అయినా తీసుకుంటారు. తొలుత వెకేషన్ బెంచ్‌లో టీడీపీ లాయర్లు చేసిన నాట్ బిఫోర్ మి విన్యాసం కూడా ఒక చరిత్రే.
మానిప్యులేషన్స్‌లో చంద్రబాబు దిట్ట
జైలు నుంచి బయటపడడానికి ఎన్ని ట్రిక్కులు ప్లే చేశారో! ఇవన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే.. ఇలాంటి వ్యక్తా.. ఉమ్మడి ఏపీని, విభజిత ఏపీ పదమూడున్నరేళ్లు పాలించింది అని విస్తుపోవల్సిందే. మానిప్యులేషన్స్ చంద్రబాబు దిట్ట అని అంతా భావిస్తారు. ఒకవైపు కేసు కొట్టివేయడానికి కోట్లు వెచ్చించి లాయర్లను రంగంలో దించారు. మరో వైపు ఎలాగొలా మధ్యంతర బెయిల్‌పై బయటకు రావలని కొత్త ,కొత్త ఎత్తుగడలు వేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఒక్కోసారి ఒక్కో మాట చెప్పారు. భద్రత గురించి ఎన్ని కల్పితాలు అయినా చెప్పడానికి వెనుకకాడ లేదు.
అప్పుడేమో సేఫ్.. ఇప్పుడు అన్‌సేఫా?
నకిలీ లేఖలు సృష్టించారంటే ఏమని అనుకోవాలి. కోర్టువారికి కొద్ది రోజుల క్రితం చంద్రబాబు రాసిన ఒక లేఖ చూడండి. ఎన్ని అబద్దాలు, అడ్డగోలు ఆరోపణలు చేశారో ఇట్టే తెలిసిపోతుంది. రాజమండ్రి జైలులో ఆయనకు భయమేస్తున్నదట. ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని, తీవ్రవాదులు వచ్చి తనపై దాడి చేస్తారేమోనని. మరి అంత భద్రతా సమస్య ఉన్న వ్యక్తి ఇంతకాలం జనం మధ్యలో రోడ్ల మీద ఎలా తిరగగలిగారు! అప్పుడేమో సేఫ్. జైలులో భధ్రతావలయంలో ఉంటేనేమో అన్ సేఫ్..చిత్రమే. జైలు నుంచి విడుదల అయిన తర్వాత అంతమంది జనంలో ఎలాంటి జంకు లేకుండా నిలబడి మాట్లాడారు. మరి దీనిని ఏమనాలి? ఆయన భద్రత ఏమైపోయింది. ఆయన అనారోగ్యం ఏమైపోయింది?
దొంగ బుద్ది తెలిసిపోయింది.
తనకు కంటి ఆపరేషన్ చేయాలట.. వీటిలో ఏ ఒక్కటి నిజమైనా తప్పు లేదు. కానీ అత్యధికం అబద్దాలే అవుతుండడమే బాధాకరం. చంద్రబాబు ఆరోగ్యం గురించి భువనేశ్వరి మాట్లాడుతూ చాలా ధైర్యంగా ఉన్నారు. మానసికంగా ఆయనను ఎవరూ దెబ్బతీయలేరని అంటారు. ఆయన ఆరోగ్యం ఏమైపోతుందోనని ఇంకోసారి అంటారు. అధికారులు వీటన్నిటికి జవాబు ఇస్తే దానిని మాత్రం పట్టించుకోరు. ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి మీడియాలు ఆ వివరాలను దాచేయాలని విశ్వయత్నం చేశాయి. చంద్రబాబు రాసిన లేఖ వివరాలను మొదటి పేజీలో ప్రచురించిన ఈ పత్రికలు, జైళ్ల శాఖ డీఐజీ ఇచ్చిన కౌంటర్‌ను మాత్రం కప్పిపుచ్చే యత్నం చేశాయి. అక్కడే వీరి దొంగ బుద్ది తెలిసిపోయింది.
ఉగ్రవాదం కన్నా, ఆర్ధిక ఉగ్రవాదమే ప్రమాదరకమని బాబే చెప్పారు
జైలులోకి ఎవరో గంజాయి విసిరారట. ఆ విషయాన్ని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? జైలులో చాలా తీవ్రమైన నేరాలు చేసినవారు ఉన్నారట. జైళ్లకు వెళ్లేది నేరాలు చేశారన్న అభియోగాలపైనే కదా! ఆయన కోసం మంచి వారెవరో వెతుక్కొచ్చి జైలులో పెట్టలేరు కదా అని ఒక విశ్లేషకుడు చమత్కరించారు. పోనీ ఆయన చేసింది మంచి పనా! ప్రభుత్వ సొమ్మును స్వాహా చేయడం చాలా పెద్ద నేరమని, ఉగ్రవాదం కన్నా, ఆర్ధిక ఉగ్రవాదమే ప్రమాదరకమని, హత్యల కన్నా ఘోరమని చంద్రబాబే కదా గతంలో లెక్చర్లు ఇచ్చింది. ఆ విషయం మర్చిపోయి ఉంటారు! అయినా జైలు అధికారులు చెప్పినదాని ప్రకారం చంద్రబాబుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అసలు ఆయన స్నేహ బ్లాక్‌లో ఏ గదిలో ఉన్నది కూడా రహస్యంగానే ఉంచారట. చిత్రమేమంటే ముఖ్యమంత్రి సీఎ జగన్ ఒకసారి చంద్రబాబును ఉద్దేశించి ముసలాయన అని అన్నారు. అంతే ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. నేను ముసలివాడిని కాదు. జగన్ కంటే ఫిట్, ఇరవైనాలుగు గంటలు పని చేస్తానని బహిరంగ సభలలో సమాధానం చెప్పేవారు. తీరా జైలులో పడ్డాక, అమ్మో నా వయసు 73 ఏళ్లు.. ఈ ఏజ్‌లో ఇలా నిర్బంధిస్తారా? నాకు ఆ జబ్బు ఉంది.. ఈ జబ్బు ఉంది.. కంటి శుక్లాలు ఆపరేషన్ జరగాలి... అని బెయిల్ వచ్చిందాకా గోలగోల చేశారు.
ఇకపై రాజకీయ యాత్రలు చేయబోనని చెప్పగలరా!
తెలుగుదేశం నేతలు, ఆయన కుటుంబ సభ్యులు, వారి లాయర్లే చంద్రబాబును ముసలాయన అని చెబుతున్నారు. కోర్టులో కూడా అదే వాదన వినిపిస్తున్నారు. వీటన్నిటిని పరిశీలిస్తే నిజంగానే ఆయనకు భద్రత సమస్య ఉంటే ఆయన ఇకపై రాజకీయ యాత్రలు చేయబోనని చెప్పగలరా! అనారోగ్య సమస్య ఉంటే రాజకీయం కోసం ఎండలు, దుమ్ము,ధూళిలోకి వెళ్లకుండా ఉంటానని అనగలరా! అనలేరు. ఎందుకంటే కోర్టులకు ,ప్రజా కోర్టులకు ఆయన అన్నీ అబద్దాలు చెబుతున్నారు కనుక. యధాప్రకారం ఇక భువనేశ్వరి కూడా ఆయన బాటలోనే ఉన్నవి, లేనివి కల్పించి చెబుతూ యాత్రలు చేస్తున్నారు. టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి, బండ్ల గణేష్ వంటివారు అతిగా ఏడ్చేస్తున్నట్లు మాట్లాడిన తీరు మరీ ఏహ్యంగా ఉంది.
నిత్యం అసత్యాలతో ప్రజలలో సానుభూతి
రాజకుమారి తన నటనతో భువనేశ్వరిని మెప్పించాలని చూశారు. భువనేశ్వరి చక్కగా నవ్వుతూ కనిపిస్తుంటే, ఈమె మాత్రం తెచ్చిపెట్టుకున్న గద్గద స్వరంతో దేవాన్ష్ తాతగారు ఎక్కడున్నారని అడుగుతున్నాడా? అని ప్రశ్నించారు. దానికి కొద్దిగా తడుముకున్న భువనేశ్వరి వెంటనే ఓ అబద్దం చెప్పేశారు. చంద్రబాబు విదేశాలకు వెళ్లారని అతనికి చెబుతున్నారట. ఇప్పుడు స్వయంగా దేవాన్ష్‌ను జైలు వద్దకే తీసుకు వచ్చి తాతకు స్వాగతం పలికించారు. మరి దీనిని ఏమనాలి. ఇలా ఒకటికాదు.. నిత్యం అసత్యాలతో ప్రజలలో సానుభూతి సంపాదించాలని వీరు చేస్తున్న ప్రయత్నాలు వెగటు పుట్టిస్తున్నాయి.
జైలు నుంచి బయటకు వచ్చాక దగ్గరదారి వదలి, దూర మార్గం గుండా, గంటల తరబడి వాహనాలలో రోడ్డు మార్గంలో ప్రయాణించడాన్ని ఏమనాలి? న్యాయ వ్యవస్థను ఎలాగైనా మాయ చేయగలిగామన్న ధైర్యంతోనే ఇలా చేస్తున్నారా! సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఆసక్తికర కామెంట్ గురించి చెప్పాలి. చంద్రబాబు కుటుంబంలోని ఆ నలుగురు అయినా నిజాలు మాట్లాడుకుంటారా? లేదా? అన్నది ఆ కామెంట్! దీనికి ఎవరు జవాబిస్తారు! టీడీపీ నేతలు కొందరు సత్యమేవ జయతే అంటూ ప్రకటనలు చేశారు. అది సత్యమేవ జయతేనా?అసత్యమేవ జయతేనా అన్నది వారికి తెలియదా!
Comments
Please login to add a commentAdd a comment