AP: ఇవన్నీ కౌరవసేన పన్నాగాలు కావా? | Kommineni Srinivasa Rao Analysis Of Chandrababu Lies And Politics | Sakshi
Sakshi News home page

ఇవన్నీ కౌరవసేన పన్నాగాలు కావా.. చంద్రబాబూ?

Published Thu, Jan 11 2024 6:06 PM | Last Updated on Sun, Feb 4 2024 12:00 PM

Kommineni Srinivasa Rao Analysis Of Chandrababu Lies And Politics - Sakshi

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా మాట్లాడడంలో తనకు తానే సాటి. ఏపీలో కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం అయిందని ఆయన చెబుతున్నారు. కనిగిరి, తదితర చోట్ల  జరిగిన సభలలో ఆయన మాట్లాడుతూ ఏవేవో అబద్దాలు వల్లె వేశారు. 2024  ఎన్నికలలో పాండవులదే గెలుపు అని  అన్నారు. ఆయన తనకు తెలియకుండానే ఒక విషయాన్ని అంగీకరిస్తున్నారన్నమాట. 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వారు గెలిచారు కాబట్టి వారిని పాండవులు అనవచ్చా! ఇప్పుడు కూడా ఆయన కనిపించిన వారినందరిని బతిమలాడుకుని పొత్తులు పెట్టుకుని కౌరవ సేనను తయారు చేస్తున్నారు.

✍️వైఎస్సార్‌ కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి జగన్ భారతంలో అర్జునుడు మాదిరి ఒక్కడే పోరాడుతున్నారు. కాని అదే చంద్రబాబు జనసేన అధినేత పవన్  కళ్యాణ్‌తో పాటు, బీజేపీని కలుపుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మరో వైపు శకుని మామ మాదిరి కాంగ్రెస్‌తో కూడా రహస్య సంబంధాలు నెరపుతున్నారు. ఇవన్ని కౌరవసేన పన్నాగాలు కావా! తన దిక్కుమాలిన రాజకీయం కోసం భార్య పేరుతో సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటివి నిజంగా జరిగినా పదే, పదే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అన్యాయంగా తన భార్యపై నిందలు మోపుతారా అని బాధపడతారు. కాని చంద్రబాబుకుమాత్రం ఇది కూడా రాజకీయ వ్యూహమే.

✍️నిజానికి శాసనసభలో ఆయన భార్యను ఎవరూ ఏమీ అనేలేదు. టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, లోకేష్‌కు మధ్య వివాదంలో ఈ ప్రస్తావన వచ్చింది. ఒకవైపు లోకేష్ తన సోషల్ మీడియా టీమ్ ద్వారా వంశి భార్యను, కుటుంబ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయించారట. దాంతో ఆయనకు మండి ఏవో  వ్యాఖ్యలు చేశారు. అసలు ముందుగా తన కుమారుడికి ఇలా వ్యాఖ్యలు చేయవద్దని సలహా ఇవ్వవలసింది పోయి తాను కూడా ఆ గొడవలోకి రావడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించడం శోచనీయం.

✍️చంద్రబాబు అధికార రాజకీయం కోసం ఎంతకైనా దిగజారతారని అంటారు. కాని ఇందులో కూడా ఆయన కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నారనుకోవాలి. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు ఒక్క శ్రీకృష్ణుడి సాయం మాత్రమే తీసుకుంటారు. కౌరవులు మాత్రం పద్దెనిమిది అక్షోహినిల సేనలతో యుద్దానికి వెళతారు. ఆ విషయం తెలియదో, ఏమో కాని చంద్రబాబు తనను పాండవులతో పోల్చుకోవడం చిత్రంగా ఉంటుంది. చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని నేరుగాను, సీపీఐ, సీపీఎం వంటి పక్షాలను పరోక్షంగాను మేనేజ్ చేస్తూ, బీజేపీలోని టీడీపీ నేతలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. అంటే వీరంతా కౌరవులమాదిరి తయారై పాండవులుగా ఉన్న జగన్‌పై యుద్దానికి దిగుతున్నారన్నమాట.

✍️తెలుగుజాతికి స్వర్ణయుగం తెచ్చే బాధ్యత ఆయన తీసుకుంటారట. పేదవారిని ఆర్ధికంగా అభివృద్ది చేస్తారట. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన ఇప్పుడు పేదలనుపైకి తీసుకువస్తానంటే నమ్మడానికి జనం ఏమైనా చెవిలో పూలుపెట్టుకున్నారా?. రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఆయన అంటున్నారు.అసలు ఏమైంది రాష్ట్రానికి? కేవలం ఆయనకు, ఆయన కుమారుడికి అధికారం లేకపోతే  తెలుగు జాతి అంతా కష్టాలలో ఉన్నట్లుగా ప్రచారం చేస్తుంటారు. దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు డప్పు కొడుతుంటాయి. రాష్ట్ర  చరిత్రలో పేదలను ఇంతగా ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఒకప్పుడు చంద్రబాబు ఏది ఫ్రీగా దొరకదు అని అనేవారు.ఇప్పుడేమో  అన్నీ ఫ్రీ అంటున్నారు. తద్వారా రాష్ట్రాన్ని బాగు చేస్తారట.

✍️అధికారంలోకి వచ్చాక సొంత తల్లిని, చెల్లిని గెంటేశారని చంద్రబాబు అనడం ఏమిటి? జగన్ ఎక్కడా వారిపట్ల అనుచితంగా వ్యవహరించలేదు. తల్లి కొద్ది రోజుల క్రితం  కూడా ఇడుపులపాయలో జగన్‌తో కలిసి ముద్దుపెట్టుకున్న సంగతి చంద్రబాబుకు తెలియదా! కాని అదే చంద్రబాబు నాయుడు తన సొంత మామ ఎన్.టి.రామారావు నుంచి ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి అన్నిటిని లాగేసుకుని ఇప్పుడు నీతులు చెబుతున్నారు. చంద్రబాబులో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన ఎంత చండాలపు పనిచేసినా, దానిని ఒక మహోన్నతమైన విషయంగా ప్రచారం చేసుకుంటారు. ఎదుటివారి మీద తట్టెడు బురద వేస్తుంటారు..

✍️జగన్ పిడి గుద్దులు గుద్దుతున్నారట. పేదలకు నేరుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా స్కీములు అమలు చేయడం పిడిగుద్దులు ఎలా అవుతాయో ఆయనకే తెలియాలి. ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను మార్చుతున్నారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. మరి టీడీపీలో ఆయన చేసిన మార్పులు, చేర్పుల గురించి ఏమంటారు. ఓటమి భయంతోనే తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి కుప్పంకు ఆయన వెళ్లారని ఒప్పుకుంటున్నారా? వైసీపీ ఎమ్మెల్యేల సీట్ల మార్పుపై అక్కడ పనికిరాని చెత్త మరోచోట పనికి వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. అదే సిద్దాంతం టీడీపీకి కూడా వర్తిస్తుంది కదా!

✍️చంద్రబాబు చంద్రగిరిలో పనికిరాకపోయినా, కుప్పంలో ఎలా పనికి వచ్చారు? తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న  పిల్లలందరికి పదిహేను వేలచొప్పున ఇస్తారట. దీని కోసం ప్రతివారు ముగ్గురు పిల్లలను కనీసం కనాలట. ఏ మాత్రం విజ్ఞత ఉన్న  సీనియర్ నేత అయినా ఇంత అసంబద్దంగా మాట్లాడతారా! ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమట. ఆర్టీసీ బస్‌లలో మహిళలకు ఉచితప్రయాణమట. సూపర్ సిక్స్ అంటూ ఇలా లక్షల కోట్ల వ్యయం అయ్యే స్కీములను ప్రచారం చేస్తున్న తీరును  జనం నమ్ముతారా!.

✍️ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న స్కీములతోనే రాష్ట్రం నాశనం అయిందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు ఒక పక్క ప్రచారం చేస్తుంటారు. కాని చిత్రం ఏమిటంటే, మరో పక్క  ఆయా సంక్షేమ స్కీములకు గాను జగన్ వ్యయం చేసేదానికన్నా  ఐదురెట్లు డబ్బు ఖర్చు చేస్తానని  చంద్రబాబు అంటున్నారు. అంటే అన్ని రెట్లు  నాశనం చేస్తానని చంద్రబాబు స్వయంగా చెబుతున్నారా! నిజానికి చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎన్ని రెట్లు  నాశనం అవుతుందో ప్రజలు  గమనించవలసిన తరుణం ఆసన్నమైంది. చంద్రబాబు మరోసారి జనాన్ని మోసం చేయడానికి సన్నద్దం అవుతున్నారు. లేదా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి సిద్దమవుతున్నారనుకోవాలి.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement