ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అదరగొట్టారు. పలాసలో జరిగిన సభలో ఆయన దంచేశారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేనతో పాటు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థల ఏడుపుపై తనదైన శైలిలో దుమ్ము దులిపారు. పలాసలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. దశాబ్దాలుగా ఉన్న కిడ్నీ వ్యాధి సమస్యకు ఒక పరిష్కారం మార్గం చూపుతూ నిర్మించిన 200 పడకల సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, పరిశోధన కేంద్రం, ఒక భారీ రక్షిత నీటి పథకానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఒక ప్రభుత్వం స్కీమును చేపట్టి దానిని పూర్తి చేయడం అంటే తేలికైన పని కాదు. దానికి ఎంతో చిత్తశుద్ది ఉండాలి.హృదయం ఉండాలి. ప్రణాళిక ఉండాలి. ఈ విషయంలో జగన్ సఫలం అయ్యారని చెప్పాలి.
✍️ఉద్దాన ప్రాంతంగా పిలుచుకునే ఈ ప్రాంతంలో ఉద్యాన వనాలతో పాటు కిడ్నీ వ్యాధి వంటి ప్రమాదకరమైన జబ్బులు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. ఒకసారి మాత్రం మాచ్ ఫిక్సింగ్ గేమ్‌లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి హడావుడి చేయడం, దానిపై స్పందించినట్లు చంద్రబాబు వ్యవహరించడం జరిగింది కాని అసలు సమస్యను పరిష్కరించే దిశగా ఆనాటి ప్రభుత్వం కదలలేదు. తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కిడ్నీ బాధితుల దీన గాధలను స్వయంగా తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని, పరిశోధన కేంద్రాన్ని, నీటి స్కీమును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
✍️ప్రభుత్వం రాగానే ఆయన తొలి రోజుల్లోనే దీనికి శ్రీకారం చుట్టారు. నాలుగేళ్లలో దానిని పూర్తి చేసి చూపించారు. ఒక కమిట్‌మెంట్‌తో ఆయన ఈ పనిని పూర్తి చేశారు. చాలా గ్రామాలకు తాగునీటిని అందుబాటులోకి తెచ్చారు. మరికొన్ని గ్రామాలకు కూడా నీరివ్వబోతున్నారు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నా ఈనాడు తదితర ఎల్లో మీడియా మాత్రం తన ఏడుపు ఆపలేదు. ఏవేవో వంకలు పెడుతూ వార్తలు ప్రచారం చేశాయి. అందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతో సహా రామోజీరావు, రాధాకృష్ణ తదితరులు కొందరు ఏపీపై ఏడుస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఆ సందర్భంలో ప్రజలు కూడా వారిని ఉద్దేశించి ఏడుపే, ఏడుపు అంటూ ముఖ్యమంత్రితో శృతి కలపడంతో సభ ప్రాంగణం అంతా హోరెత్తింది.
✍️జగన్ ఒక ప్రశ్న వేశారు. తాను చేసిన ఈ పనిని నలభై ఐదేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు చేయలేదని ఆయన అడిగారు. నిజంగానే దానికి సమాధానం దొరకదు. అందుకే చంద్రబాబు ఇలాంటి విషయాలు చెప్పకుండా ఏదేదో డ్రామా నడుపుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తుంటారు. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ది ఉండి ఉంటే, ప్రభుత్వం అమలు చేసిన ఈ స్కీమ్‌ను అభినందించి ఉండేవారు. ఆ పని ఆయన చేయలేకపోయారు. ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం తాను పని చేస్తుంటే ప్రతిపక్షం సహించలేకపోతోందని, ఏది చేస్తున్నా ఏడుస్తున్నారని జగన్ వ్యాఖ్యానిస్తూ విశాఖను పరిపాలన రాజధాని కానివ్వకుండా వీరు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
✍️తాను చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ పేదల కోసం ఇంగ్లీష్ మీడియం తెచ్చినా వీరు ఏడుస్తారు.. పేదలకు రెండున్నర లక్షల కోట్ల ఆర్దిక సాయం చేసినా వీరు ఏడుస్తారు.. అంటూ ప్రతిపక్షాలను ఉతికి ఆరేశారు. ఈ క్రమంలో ఎక్కడా ఒక్క అభ్యంతరకర వ్యాఖ్య చేయకపోవడం కూడా గమనించదగ్గ అంశమే. అదే చంద్రబాబో, ఆయన కుమారుడో, లేక దత్తపుత్రుడుగా పేరొందిన పవన్ కళ్యాణ్‌లు రెచ్చిపోతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున ఈ స్కీమును పూర్తి చేయడం ఉత్తరాంధ్ర ప్రాంతం అంతటికే కాక రాష్ట్రం అంతటికి ఒక మెస్సేజ్ ఇచ్చినట్లయింది.
✍️జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అన్న నానుడిని నిజం చేసినట్లయింది. జగన్ తాను ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చింది వివరిస్తూ, గతంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలలో పది శాతం పూర్తి చేయలేకపోతే, తాను ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేశానని ధీమాగా చెప్పారు. ప్రజల మద్దతు తనకు ఉండడంతో, మోసం చేయడం కోసం ప్రజలకు ఆచరణ సాధ్యంకాని హామీలను ఇస్తున్నారని, ఇంటింటికి ఒక బెంచ్ కారు, కిలో బంగారం ఇస్తామని అంటారని, వాటిని నమ్మవద్దని ఆయన కోరారు. ఇది కూడా వాస్తవమే. జగన్ నవ రత్నాల ద్వారా ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అందచేస్తే రాష్ట్రం నాశనమైపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరుతో జగన్ ఇచ్చినదానికన్నా ఐదు రెట్లు అధికంగా ఇస్తానని నమ్మబలుకుతున్నారు. దానిని ఎవరైనా విశ్వసిస్తారా!
✍️పవన్ కళ్యాణ్, చంద్రబాబుల పొత్తును కూడా జగన్ ఎద్దేవా చేస్తూ తెలంగాణ ఎన్నికలలో జనసేనకు డిపాజిట్లు రాలేదని, చివరికి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని అన్నప్పుడు జనంలో ఒకటే నవ్వులు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ తాను ఎందుకు తెలంగాణలో పుట్టలేదని బాదపడుతుంటానని అన్న ప్రకటనను కూడా జగన్ శుభ్రంగా వాడుకున్నారు. ఏపీలో పుట్టడమే ఇష్టం లేని వారు ఇక్కడ పెత్తనం చేయడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్‌తో పాటు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ.. వీరెవ్వరూ ఏపీలో నివసించరని, వీరంతా నాన్ లోకల్స్ అని ప్రజలలో ఆలోచన లేవనెత్తారు. ఒక నాయకుడి సమర్ధత తెలుసుకోవాలంటే ఇలాంటి స్కీముల అమలును పరిశీలించాలి.
✍️పలాస, ఇచ్చాపురం, మరికొన్ని ఇతర నియోజకవర్గాలలోని గ్రామాలలో కిడ్నీ బాధితులు అధికంగా ఉన్నారు. వారికి గతంలో 2500 రూపాయల పెన్షన్ ఇస్తుండేవారు. దానిని జగన్ పదివేల రూపాయలకు పెంచి ఆదుకునే యత్నం చేశారు. కిడ్నీ వ్యాధికి మూల కారణం కనిపెట్టడం సమస్యగా ఉంది. అందుకే రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. నేను కూడా కొద్దినెలల క్రితం స్వయంగా పలాస వెళ్లి ఈ సెంటర్ భవనాన్ని చూసి వచ్చాను. అది చూసిన తర్వాత జగన్ మీద గౌరవం మరింత పెరిగింది. పలాసలోని ప్రభుత్వ ఆస్పత్రిలో యువ డాక్టర్లు అత్యంత శ్రద్దతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలిసిస్ నిర్వహించడం కూడా చూశాను. వారితో మాట్లాడితే జగన్ ప్రభుత్వం ఈ సమస్యపై ఎంత శ్రద్ద తీసుకుంది అర్దం అయింది.
✍️ఇలాంటి పనే ఏ కాస్త అయినా చంద్రబాబు ప్రభుత్వం చేసి ఉంటే ఈనాడు, జ్యోతి వంటి ఎల్లో మీడియా తెగ రెచ్చిపోయి శరభ, శరభ అంటూ ఊగిపోయే ప్రచారం చేసేవి. కాని ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తుంటే ఓర్వ లేకపోతున్నారు. అందుకే ఏదో ఒక వంకర, టింకర వార్త రాసి ప్రభుత్వానికి ప్రతిష్ట రాకూడదని ఎల్లో మీడియా యత్నించింది. అయినా జగన్ పాల్గొన్న సభలో ప్రజల స్పందన చూసిన తర్వాత వీరికి గుండెలు జారిపోయి ఉంటాయి. ఇకనైనా ప్రభుత్వం మీద, ఏపీ ప్రజల మీద పడి ఏడవడం మానుకుంటే మంచిది. కాని అలా చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. దానిని దృష్టిలో ఉంచుకునే జగన్ వీరి ఏడుపును మరో మూడు నెలలు భరించక తప్పదని అన్నారు.
✍️ఏపీలో అభివృద్ది లేదని, అంతా విధ్వంసమే అని దుష్ప్రచారం చేసేవారికి పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్,సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, సురక్షిత నీటి స్కీమ్ ఒక సమాధానం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. విపక్షం, ఎల్లో మీడియా ఎంత ఏడ్చినా జగన్ ఈ అభివృద్దిని నిర్విరామంగా కొనసాగించాల్సిందే. తద్వారా ప్రజల ఆదరణ పొందాల్సిందే. ఉత్తరాంధ్ర ప్రయోజనాలను పరిరక్షించే ఏకైక హీరోగా జగన్ ఇప్పుడు ప్రజల ముందు నిలబడ్డారు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment