ఒకప్పుడు సొంత కుటుంబ సభ్యులే సరిగా గౌరవించడం లేదన్న ఆవేదన. ఇప్పుడు స్వయంగా కేంద్ర హోం మంత్రే ఆహ్వానించి సత్కరించడం. ఎంత తేడా.. రాజకీయాలు , కాలం ఎప్పుడూ ఒకేరకంగా ఉండవని అనడానికి ఇలాంటి ఘట్టాలన్నీ ఉదాహరణలే. ఇది ఎవరి గురించో అర్దం అయ్యే ఉంటుంది. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్.గురించే. ఆయనను అమిత్ షా స్వయంగా విందుకు ఆహ్వానించారు. ఒక దేశ స్థాయి నేత, అందులోను కేంద్రంలో నెంబర్ రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఎన్.టి.ఆర్.ను ఆహ్వానించడం దేనికి సంకేతం?
గతంలో దేశ రాజకీయాలలో చక్రం తిప్పానని చెప్పుకునే టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలవడానికి తంటాలు పడుతున్నారు. చివరికి ఒక అధికారిక సమావేశంలో మోదీ అందరితో పాటు ఆయనను కూడా పలకరించి ,కొద్ది నిమిషాలపాటు ముచ్చటిస్తే తనకు మద్దతు ఇచ్చే మీడియాలో అదేదో అద్భుతం జరిగిపోయిందన్నంతగా బిల్డప్ ఇచ్చుకునే పరిస్తితి. అమత్ షా అయితే ఇంకా ఆ అవకాశం కూడా ఇచ్చినట్లు లేరు.
అక్కడికి చంద్రబాబు తన పార్టీ ఎమ్.పిలను నలుగురిని బీజేపీలోకి పంపించినా పెద్దగా ఆశించిన ఫలితం దక్కలేదు. బీజేపీపై నోరు విప్పడానికే ఆయన భయపడుతున్నారు. అలాంటి తరుణంలో తన వయసులోకాని , సీనియారిటీలో కాని సగం కూడా లేని జూనియర్ ఎన్.టి.ఆర్.తో అంతటి అమిత్ షా పిలుపించుకుని మాట్లాడడం చంద్రబాబుకు చెప్పరానంత అవమానంగానే అనిపించవచ్చు.ఎన్నికల ముందు , బీజేపీని విడాకులు ఇచ్చాక, మోదీ, అమిత్ షా లపై నోటికి వచ్చినట్లు దూషించిన ఫలితమే టీడీపీ అదినేతకు పట్టిన ఈ దురవస్థ అన్న సంగతి తెలిసిందే.
ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు ధైర్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండగలిగి ఉంటే అదో రకమైన గుర్తింపు తెచ్చుకునేవారు. కాని ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో సిద్దహస్తుడైన చంద్రబాబునాయుడు ఎన్నికలలో ఓటమి తర్వాత ప్లేట్ పిరాయించేశారు. దాంతో ఆయనపై బీజేపీలో మరింత చులకన భావం ఏర్పడింది. గతంలో జూనియర్ ఎన్.టి.ఆర్.ను కూడా చంద్రబాబు ఇలాగే వాడుకుని వదలివేశారు. 2009 ఎన్నికల సమయంలో ఎన్.టి.ఆర్.టీడీపీ పక్షాన ప్రచారం చేశారు. ఆ క్రమంలో ఒక రోడ్డు ప్రమాదంలో కూడా చిక్కుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాని ఆ తర్వాత కాలంలో ఆయనను చంద్రబాబు పక్కనపెట్టేశారు.
మహానాడుకు ఆహ్వానించడమే మానేశారు. మహానాడు వద్ద ఆయన ప్లెక్సీలు కనపడకుండా చేశారు. తన కుమారుడు లోకేష్కు ఎన్.టి.ఆర్. పోటీ అవుతారని భయపడి ఇలా చేశారని చెబుతారు. ఎన్.టి.ఆర్.సినీ నటుడుగా మంచి గుర్తింపు పొందడం, ప్రసంగాలలో ఆకట్టుకునే లక్షణం ఉండడం తో లోకేష్ తట్టుకోలేడని గుర్తించినట్లు భావించవచ్చు. అందుకే ఇటీవలికాలంలో కుప్పంతో సహా పలు చోట్ల చంద్రబాబు పర్యటనలలో జూనియర్ ఎన్.టి.ఆర్.ను తీసుకురండన్న ప్లెక్సీలు వెలుస్తున్నాయి. ఎన్.టి.ఆర్.కు రాజకీయాలపై ఆసక్తి ఉంది. కాకపోతే పరిస్థితి తనకు అనుకూలంగా లేదని భావించి ఆయన మౌనంగా ఉంటున్నారు. తన శ్రేయోభిషాలు ఎవరైనా ఈ విషయాన్ని ప్రస్తావించినా 2029 వరకు రాజకీయాలకు రానని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంటుంది.
కాని ఈలోగానే అమిత్ షా ఆయనను పిలవడం ఆసక్తికర పరిణామం. త్రిబుల్ ఆర్ సినిమా లో ఎన్.టి.ఆర్. నటనకు ముగ్దుడై షా పిలిచారని చెబుతున్నప్పటికీ, అది అంత నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజను, స్టార్ డైరెక్టర్ రాజమౌళిని కూడా పిలిచి సినిమా గురించి అభినందించి ఉంటే అది వేరే విషయం.అలాకాకుండా ఎన్.టి.ఆర్.ను ఒక్కరినే పిలవడం, ఏకాంతంగా చర్చించడం చూస్తే ఏదో మాస్టర్ ప్లాన్ తోనే అమిత్ షా ఇలా చేసి ఉండవచ్చని పిస్తుంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలుగా ఉన్నాయి. ఎలాగైనా టీఆర్‌ఎస్ ను ఓడించి అదికారంలోకి రావాలన్న తాపత్రయంలో ఉంది. దానికి తోడు దుబ్బాక, హుజూరాబాద్ లలో , హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయాలు వారికి గొప్ప ఆశను క ల్పించాయి. దాంతో ఈ వరవడిని కల్పించడానికి పలువురు ప్రముఖులను ఆకర్షించే పనిలో బీజేపీ పడింది. అందులో భాగంగానే జూనియర్ ఎన్.టి.ఆర్.ను, అలాగే ప్రముఖ పత్రికాధిపతి రామోజీరావును షా కలిసి ఉండవచ్చు. జూనియర్ ను అయితే బీజేపీలో చేరాలని కోరడమో, లేకపోతే ప్రచారానికి అయినా రావాలని కోరితే కోరి ఉండవచ్చు. తద్వారా బీజేపీకి సినీ స్టార్ల తళుకులు జతకలపడానికి యత్నించారు. ఇందుకు జూనియర్ ఎన్.టి.ఆర్. ఒప్పుకున్నారా?లేదా అన్నది అప్పుడే బయటపడకపోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇవి ఒక కొలిక్కి రావచ్చు. ఇప్పటికే తెలుగు స్టార్లు పలువురు బీజేపీలో ఉన్నారు.
అయితే వారిలో చాలామంది పాతపడి పడిపోయారు. కొత్త స్టార్ ప్రచారం బీజేపీకి ఉపయోగపడుతుందని భావించి ఉండవచ్చు. అదే సమయంలో జూనియర్ ఎన్.టి.ఆర్ .భవిష్యత్తు లో ఏపీ రాజకీయాలకు ప్రయోజనకారిగా ఉంటారని అంచనాకు వచ్చి ఉండవచ్చు. చంద్రబాబు నాయకత్వం ఉండగా , టీడీపీని తన కంట్రోల్ లోకి తీసుకునే ప్రయత్నం ఈయన చేయకపోవచ్చు. వచ్చే ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే, ఆ తర్వాత ఎన్.టి.ఆర్. ఆ పార్టీపై తన పట్టు పెంచుకునే యత్నం చేసే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని గమనంలోకి తీసుకునే అమిత్ షా ఈయనతో మాట్లాడి ఉండే అవకాశం ఉంది. ఒకప్పుడు జూనియర్ ఎన్.టి.ఆర్ ను చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ వారు కాని, సీనియర్ ఎన్.టి.ఆర్. కుటుంబీకులే పలు అవమానాలకు గురిచేశారన్న అబిప్రాయం ఉంది. చివరికి ఒక దశలో ఎన్.టి.ఆర్.సినిమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపధ్యంలో అమిత్ షా ను జూనియర్ ఎన్.టి.ఆర్.కలవడం సర్వత్రా చర్చనీయాంశం అయిందటే ఆశ్చర్యం కాదు. ఇదంతా సినీ నటులపై ప్రజలలో ఉండే క్రేజ్ వల్లేనని చెప్పనవసరం లేదు. ఇక రామోజీరావును అమిత్ షా ఎందుకు కలిశారు.తెలంగాణలో సెటిల్ అయిన ఆంద్ర ఓటర్లను ,ప్రత్యేకించి ఒక సామాజికవర్గం వారిని ప్రభావితం చేసే దిశగా కూడా ఈ ప్రయత్నం జరిగి ఉండవచ్చని విశ్లేషణలు వచ్చాయి.
ఏపీ వరకు రామోజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్రకటిత యుద్దం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై విద్వేషపూరిత ప్రాచారాన్ని తన మీడియా ద్వారా చేస్తున్నారు.అక్కడ చంద్రబాబును ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో ఆయన ఉన్నారు. అందువల్ల రామోజీ అక్కడ టీడీపీకి బీజేపీ మద్దతు ఇవ్వాలని కోరితే కోరి ఉండవచ్చు. చంద్రబాబు తప్పులను ఈసారికి కాయాలని కోరితే కోరి ఉండవచ్చు. అది జరిగిందా?లేదా అన్నది చెప్పలేం. కాని తెలంగాణకు సంబంధించినంతవరకు బీజేపీ వచ్చే ఎన్నికలను బాగా సీరియస్ గా తీసుకుంది. రామోజీ అటు టీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో సత్సంబందాలు కొనసాగిస్తున్నారు.
జగన్‌పై చేసినట్లు తెలంగాణలో ద్వేషపూరిత వార్తలు ఇవ్వడం లేదు. పైగా కేసీఆర్ అంటే కొంత భయం కూడా ఉందని ఎక్కువ మంది నమ్ముతారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వవలసిందిగా రామోజీని అమిత్ షా గట్టిగా కోరి ఉండవచ్చన్నదే ఎక్కువ మంది భావనగా ఉంది. ఇద్దరు ప్రముఖులు వారు మాత్రమే కూర్చుని మాట్లాడుకున్న విషయాలు వారిలో ఎవరో ఒకరు చెబితే తప్ప బయటకు రావు. అందుకు కొంత సమయం పట్టవచ్చు. రామోజీ అటు టీఆర్‌ఎస్ ను కాదనలేక, ఇటు బీజేపీతో తగాదా పెట్టుకోలేక సతమతమవుతుండవచ్చు. మొత్తం మీద అమిత్ షా మునుగోడు బహిరంగ సభతో పాటు పలు ఇతర కార్యక్రమాలలో పాల్గొని, చివరిగా రామోజీ, జూనియర్ ఎన్.టి.ఆర్ లతో భేటీ అయిన సన్నివేశాలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment