సామాన్యులు.. శక్తిమంతమైన ప్రభుత్వాలను సైతం గడగడలాడించిన ఘటనలు చరిత్రలో కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిణామాలు తాజా నిదర్శనం. ఎందుకంటే.. ఇప్పుడు ఇంటూరి రవికిరణ్ అనే పేరు రాష్ట్రమంతటా మార్మోగిపోతోంది. చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రభుత్వం అతడిపై అకారణంగా విరుచుకుపడుతూండటం ఇందుకు కారణం. సామాజిక మీడియా కార్యకర్తగా ప్రజలందరికీ చిరపరిచితుడైన ఇంటూరి రవికిరణ్‌పై అక్రమ కేసులు పెట్టి రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారంటే.. ఆయనంటే బాబుగారికి, లోకేశ్, పవన్ కల్యాణ్‌లకు ఎంత భయమో ఇట్టే అర్థమవుతోంది.
తన వైఫల్యాలలను ఎవరూ ప్రశ్నించరాదన్న చందంగా చంద్రబాబు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను భయపెట్టేందుకు విఫలయత్నం చేస్తున్నారు. అయితే రవికిరణ్‌సహా కార్యకర్తలు ఎవరూ పోలీసుల ఒత్తిళకు తలొగ్గలేదు సరికదా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూండటంతో ప్రభుత్వ డొల్లతనం, పిరికితనం క్షణక్షణం బయటపడిపోతున్నాయి.
అసమర్థత, చేతకానితనం, వైఫల్యాలు, అసత్యాలు చెప్పడానికి అలవాటుపడడం వంటి లక్షణాలన్న ప్రభుత్వాలే సామాన్యుల గొంతును నొక్కివేయాలని ప్రయత్నిస్తాయని నానుడి. సామాన్యుల ప్రశ్నలకు జవాబులు లేనప్పుడే ఏదో ఒక రకంగా ప్రశ్నిస్తున్న ఆ గొంతుకలను నొక్కేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. చంద్రబాబు ప్రభుత్వమిప్పుడు ఈ రెండింటినీ అక్షర సత్యం చేస్తోంది. అయితే.. రవికిరణ్ వంటి వారి నుంచి ప్రతిఘటన కూడా ఎదుర్కొంటూంటారు కూడా. తమతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని, పోలీసులు అధికార పార్టీకి అమ్ముడుపోయారని పోలీసుల సమక్షంలోనే చెప్పడం రవికిరణ్ ధీమా, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ రవికిరణ్ నిజంగానే తప్పు చేసి ఉంటే...
.. పోలీసులు అతడిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదు? వేర్వేరు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఇలా చేయడం ద్వారా పోలీసులు చట్టాలను ఉల్లంఘించడం లేదా? కుటుంబ సభ్యులకు వివరాలు కూడా ఇవ్వకపోవడం ఎంత వరకూ సబబు?. తిరుగుబాటును అణచివేయడం అంత తేలికకాదని ఎన్నోసార్లు రుజువైంది. అమెరికా వంటి అగ్రరాజ్యంలోనూ ఇంతే. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ ఆందోళన ఇందుకు ఒక ఉదాహరణ నల్లజాతీయుడు ఒకరిని ట్రాఫిక్ కేసులో పట్టుకున్న పోలీసులు గొంతుపై కాలుపెట్టి కూర్చోవడంతో అతడు మరణించిన ఘటనపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున స్పందించింది. ఆ అకృత్యానికి పాల్పడ్డ పోలీసుకు శిక్ష పడేంతవరకూ పలు రూపాల్లో ఆందోళన కూడా చెలరేగింది.
అంతెందుకు మధ్యప్రాచ్య దేశాలైన ఈజిప్ట్, లిబియా, యెమెన్, సిరియా, బహ్రెయిన్లలో ప్రభుత్వాలపై ప్రజల తిరుగుబాటు వెనుక సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించిన విషయమూ ఇటీవలి పరిణామమే.. ‘అరబ్ స్ప్రింగ్’ అని పిలిచే ఈ ఉద్యమం ధాటికి పలు దేశాల ప్రభుత్వాలు ప్రజల డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చింది. దేశంలో వచ్చిన తిరుగుబాటుతో లిబియా నియంత గఢాఫీ ఒక చిన్న కల్వర్టుల్లో నక్కి,నక్కి దాక్కున్నా ఫలితం దక్కలేదు. శ్రీలంకలో వచ్చిన ప్రజా తిరుగుబాటుకు భయపడి ఆ దేశాధ్యక్షుడు పాలెస్ వదలి పారిపోయాడు. బంగ్లాదేశ్ సంక్షోభంలో ఆ దేశ ప్రధాని హసీనాను దేశం విడిచి పోయేలా చేసింది.
భారత్‌లోనూ సోషల్ మీడియా చాలాసార్లు తన సత్తా చాటింది. 2013కు ముందు దేశానికి పెద్దగా పరిచయం లేని అరవింద్ కేజ్రీవాల్ లోక్‌పాల్ ఉద్యమం నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా పాప్యులర్ అయ్యాడు. తరువాతి కాలంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించడం, ఢిల్లీతోపాటు పంజాబ్‌లోనూ అధికారం చేపట్టడం తెలిసిన విషయాలే. నిన్నమొన్నటివరకూ ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగానూ పనిచేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. దేశంలో అత్యాయిక పరిస్థితిని విధించినప్పుడు సోషల్‌మీడియా లేదు కానీ..
అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరిగాంధీ ప్రతిపక్షనేతలు కార్యకర్తలు వేలాది మందిని జైలులో పెట్టించారు. మీడియాపై ఆంక్షులు విధించారు. అయినా సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారు పార్లమెంటులో ఆకస్మికంగా ప్రత్యక్షమై తమ నిరసన గళం విప్పడం అప్పట్లో సంచలనం. అణచివేతపై గొంతెత్తే పోరాట యోధులు అన్నిచోట్లా ఉంటారు. సమయం, సందర్భం కుదరితే చాలు.వెలుగులోకి వస్తారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు. ఏపీలో తలెత్తుతున్న తిరుగుబాట్లు ఇప్పటికిప్పుడు జరిగిపోతాయని చెప్పలేము. కాని తెగేదాకా లాగకూడదనడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి.
ఇన్ని అనుభవాలు ఉన్నా, కొందరు నేతలు తమ అధికార అహంకారంతో ప్రవర్తించి తమను ప్రశ్నించే వారి స్వరాన్ని నులిమి వేయాలని చూస్తుంటారు. కొన్నిసార్లు వారి ప్రయత్నాలు ఫలించవచ్చు. ఒక వర్గం మీడియాను మాఫియాగా మార్చి ప్రజలను ఏమార్చవచ్చు. కాని అంతిమంగా ఏదో ఒక రోజు వాస్తవాలు బయట పడతాయన్న సంగతి గుర్తుంచుకోవాలి.
ఇంటూరి రవికిరణ్ చేసిన తప్పేమిటి? ఆయన ఏమైనా అసభ్య పోస్టులు పెట్టారా? లేదే? చంద్రబాబు ఐదు నెలల పాలనలో జరిగిన హింసాకాండ, అత్యాచారాలు, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయని అంశాలపై కామెంట్లు పెట్టి ఉండవచ్చు. కార్టూన్లో, బొమ్మలో వేసి ఉండవచ్చు. అంతమాత్రాన అతనిని పోలీసుల ద్వారా ఇంతగా వేధిస్తారా? ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్.. అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ పని చేయడం మానివేసి ఉండవచ్చు. మిగిలిన వారెవ్వరూ ప్రశ్నించరాదని అనుకుంటే ఎలా?.
.. ఆ మాటకు వస్తే కూటమి ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని చెప్పింది పవన్ కళ్యాణ్ కాదా? పోలీసులను అవమానించేలా మాట్లాడింది ఆయనే కదా? ఆ తర్వాత కారణం ఏమైనా కాని రాజీలో భాగంగా మాట మార్చి తన కుమార్తెలపై ఏదో పోస్టు పెట్టారని కోపం వచ్చి మాట్లాడానని అన్నారట. అది నిజమే అయితే ఆ పోస్టు పెట్టినవారిపై కేసులు పెట్టాలి కదా? ఆ పని ఎందుకు చేయలేదు? దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరా? రాంబాబు కుమార్తెలపై ఎంత నీచమైన కామెంట్ లు పెట్టిన తెలుగుదేశం సోషల్ మీడియాను ఆయన ఎలా సమర్థిస్తారో అర్ధం కాదు. ఆ పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్య తీసుకుంటారా? ఇక్కడే ఇంకో సంగతి కూడా చెప్పాలి.
తెలుగుదేశం మీడియాగా పూర్తిగా బట్టలు విప్పేసి తిరుగుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్ పాలన కాలంలో ఎంత అరాచకంగా, ఎంత అసభ్యకరంగా వార్తలు రాశాయో, ఫోటోలు వేశాయో చూడలేదా? అప్పట్లో టీడీపీ సోషల్ మీడియా దారుణమైన బూతులతో వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతల కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టినా వారికి కొమ్ము కాసింది. ఇప్పుడేమో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సైకోలు అంటూ ప్రభుత్వ అకృత్యాలకు మద్దతుగా నిస్సిగ్గుగా వార్తలు రాస్తోంది. పోలీసులు ఈ కేసుల్లో వేగంగా చర్యలు తీసుకోవడం లేదని తెగ వాపోయింది. అంటే ఎల్లో మీడియా ఏమి చెబితే పోలీసులు అది చేయాలన్నమాట. లేకుంటే వీరు పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తారన్నమాట.
ఎవరు అసభ్యకర పోస్టులు పెట్టినా తప్పే.వారిపై చర్య తీసుకోవల్సిందే.చట్టబద్దంగా అరెస్టు చేయాలి కాని వారిని హింసించే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు? వర్రా రవీంద్ర రెడ్డి తనను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్‌కు తెలిపారు. అలాగే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను సైతం నాలుగు రోజులపాటు పోలీసులు హింసించి తిప్పారట. ఆమె కూడా తనను ఎలా హింసించింది ఆమె న్యాయస్థానానికి వివరించారు. ఇదేనా అడబిడ్డలకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే గౌరవం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా కూడా సమాజానికి అవసరం. లేకుంటే అధికారంలో ఉన్నవారు చెలరేగిపోతుంటారు.అలా ప్రశ్నిస్తే వారి గొంతులను నొక్కే ప్రయత్నం కూడా గట్టిగానే జరుగుతుంది. అయినా రవికిరణ్ వంటివారు ఇలాంటి సమస్యలను ఎదుర్కుని నిలబడుతున్నారు. వారిని చూసి చంద్రబాబు ప్రభుత్వమే భయపడే పరిస్థితి తెచ్చారు.
2014-19 లో కూడా రవికిరణ్ పై అప్పటి టీడీపీ ప్రభుత్వం దాడి చేసింది. ఈ వేధింపులు అప్పటికన్నా ఇప్పుడు మరింత పెరిగాయి. ఈయన మీదే కాదు. వందమందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారంటేనే వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ప్రభుత్వం వణికిపోతోందన్న భావన కలుగుతుంది. ఉదాహరణకు అమ్మ ఒడి కింద జగన్ టైమ్ లో పిల్లలను స్కూల్ కు పంపిన ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చేవారు. టీడీపీ, జనసేన వారు ఏమి చెప్పారు? ప్రతి విద్యార్ధికి రూ.పదిహేను వేలు ఇస్తామని అన్నారు. కాని ఇప్పుడు అమలు చేయడం లేదు. ఎప్పటి నుంచి చేస్తారో చెప్పడం లేదు. దీని గురించి ప్రత్యర్ధి పార్టీ కాని, సోషల్ మీడియా కాని ప్రశ్నించకుండా ఎలా ఉంటుంది?.
ఇలాంటి అనేక అంశాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా? వీటిలో ఏమైనా అసత్యాలు ఉంటే వాటిని ప్రకటించాలి. అంతే తప్ప నిజాలు చెబితే ఊరుకోం అని పోలీసుల ద్వారా బెదిరించడమే ప్రజాస్వామ్యమా? ఏపీలో జరుగుతున్న, హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు, అరాచకాల నిందితులను పట్టుకోవడం మాని పోలీసులు అచ్చంగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాను అణచి వేయడమే పనిగా పెట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదంతా డైవర్షన్ రాజకీయమే!.
టీడీపీ సోషల్ మీడియా వారు కొందరు పరమ నీచంగా పోస్టులు పెట్టిన విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఆధారాలతో సహా చూపుతున్నారు కదా! వారిపై కూడా చర్య తీసుకుంటే అప్పుడు ప్రభుత్వం, పోలీసులు నిష్పక్షపాతంగా ఉన్నారని చెప్పగలుగుతాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా ఎంత నీచమైన పోస్టింగ్‌లు పెట్టినా వారిపై చర్యే తీసుకోరాదని టీడీపీ గొడవ చేసిందే. చివరికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ను పట్టుకుని దూషించిన వ్యక్తిని సమర్థించిందే. అంతేకాదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తమ స్పీచ్‌లలో అభ్యంతరకర పదాలు వాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడేమో తమ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తేనే నేరం అంటూ కొత్త రాజ్యాంగం..అదే రెడ్ బుక్ రాజ్యంగాన్ని తీసుకు వచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకరిని అణచివేస్తే వేలమంది గొంతు విప్పుతారన్న సంగతిని పాలకులు గుర్తు పెట్టుకుంటే మంచిది.
::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment