KSR Comments On Eenadu Fake Propaganda - Sakshi
Sakshi News home page

భారీ ప్రాజెక్టులపై నమ్మకమే లేని  బాబు.. దాన్ని దాచిపెట్టి మరీ..!

Published Fri, Aug 18 2023 10:27 AM | Last Updated on Fri, Aug 18 2023 11:24 AM

KSR Comment On Eenadu Fake Propaganda - Sakshi

ఏపీలో వర్షాలు కురవకపోతే ఈనాడు మీడియాకు ఎంత ఆనందం! ఈనాడు అధినేత రామోజీరావు ఇంతలా పైశాచిక ఆనందం పొందుతారని నేనైతే ఎన్నడూ ఊహించలేదు. ఈనాడు కు పైత్యం ఇంతగా ప్రకోపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కాని ఈ కధనం చూశాక ప్రదాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కన్నా, ఈనాడు మీడియాకు ఎంత పైశాచికత్వంతో ఉందో అర్ధం అవుతుంది. పట్టిసీమ నాపై పగబట్టిందే అని ముఖ్యమంత్రి జగన్  మదనపడుతున్నారట. ఇన్నాళ్లు పక్కనబెట్టినా అదే దిక్కయిందే అని ఆయన అనుకుంటున్నారట. పట్టిసీమ ఎత్తిపోత ప్రాజెక్టు ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబు సొంతమా? లేక రామోజీరావు సొంతమా? అవసరమైనప్పుడు ఆ లిఫ్ట్ను వాడతారు కానీ, ఈనాడు వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వినియోగించరు కదా! అసలు ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని ఈనాడు ఎంతగా సంతోషపడుతోందో వారు ఆగస్టు పదమూడున రాసిన ఈ స్టోరీ చదివితే తెలిసిపోతుంది. 

2014లో టీడీపీ అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలయ్యేలా చూడాలి.ఎందుకంటే దానిని కేంద్రం జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించింది కనుక.  కాని చంద్రబాబు నాయుడు దానిని పక్కనపారేసి, కొత్తగా పట్టిసీమ అంటూ లిప్ట్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. అంటే ఈనాడు రాసిన విశ్లేషణను అన్వయించుకుంటే పోలవరం ప్రాజెక్టు  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి కనుక, దాని కోసం ప్రయత్నిస్తే పేరు ఆయనకు వెళుతుందని చంద్రబాబు అనుకున్నారని భావించాలన్నమాట. టీడీపీ హయాంలో ఏర్పాటైన పట్టిసీమ లిప్ట్ను వాడడం ఇష్టం లేక గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ దానిని ఆపరేట్ చేయించలేదని దిక్కుమాలిన రాతలకు పాల్పడింది.

ఆ అవసరం రాలేదని విషయాన్ని ఈనాడు దాచిపెట్టి మరీ..
పట్టిసీమ నుంచి నీటిని తరలిస్తున్నారని సాధారణ వార్త ఇవ్వడం తప్పు కాదు. కాని ఆ లిప్ట్ ను వాడడం జగన్కు ఇష్టం లేదన్నట్లు చిత్రీకిరించడమే తప్పు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడిన సంగతి, నదులలో నీరు ప్రవహించిన సంగతిని ,వాటిని ఉపయోగించడం వల్ల లిప్ట్ ఆపరేషన్ అవసరం రాకపోయిందన్న సంగతిని ఈనాడు దాచిపెడుతోంది. ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువ అవడం వల్ల ఇంకా రిజర్వాయిర్ లలోకి ఇంకా పూర్తి స్థాయిలో  నీరు రాలేదు. ఆయా వాగుల ద్వారా వచ్చిన నీటిని పులిచింతలలో నిల్వ చేశారు. గోదావరికి వరద రావడానికి ముందు పులిచింతల నీటిని కృష్ణ ఆయకట్టుకు విడుదల చేశారు. తదుపరి గోదావరికి వరదలు వచ్చాయి. ఆ దశలో పులిచింతల నుంచి నీటిని విడుదల చేయకుండా ఆపి,పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు.దీనికి కూడా వక్రభాష్యం చెబుతూ వ్యంగ్య వ్యాఖ్యానాన్ని ఈనాడు మీడియా ఇచ్చింది. పట్టిసీమకు పెట్టే వ్యయంతో ఆ రోజులలో పోలవరం ప్రాజెక్టు కొంత పూర్తి చేయవచ్చని చాలామంది సూచించారు. పోలవరం పూర్తి అయితే దీని అవసరం పెద్దగా  రాదు. అప్పుడు ఈ ఖ ర్చు అంతా వృధా అవుతుంది కదా! నిజానికి పోలవరం ప్రాజెక్టును కేంద్రం కట్టవలసి ఉంది. 

పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన లేకుండానే..
దానిని చంద్రబాబు ప్రభుత్వం తీసుకుని తనకు కావల్సినవారికి కాంట్రాక్టులు ఇప్పించుకుందన్నది ఆరోపణ. ఇందులో కూడా సుమారు రెండేళ్లు ఆలస్యం చేశారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని అప్పట్లో చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు పలుమార్లు చెప్పేవారు.  కాని అలా చేయలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు అప్పటికే పూర్తి అయి ఉంటే పట్టిసీమ అవసరం ఏమి ఉంటుంది?తదుపరి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ,అన్నిటిని రివ్యూ చేసి మరో  కాంట్రాక్టర్ కు ఈ ప్రాజెక్టును అప్పగించింది. ఆ తరుణంలో కరోనా సమస్య వచ్చి రెండేళ్లపాటు పనులు మందగించే పరిస్థితి ఏర్పడింది.  చంద్రబాబు ప్రభుత్వం కాఫర్ డామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్ల 2019 లో వచ్చిన భారీ వరదలకు అది దెబ్బతినిపోయింది. దాంతో మరింత జాప్యం అయింది. 

లేకుంటే ఈ పాటికి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డామ్ నిర్మించి ఉంటే ప్రాజెక్టు ఆపరేషన్లోకి వచ్చేది. జగన్ ప్రభుత్వం స్పిల్ వే నిర్మాణం పూర్తి చేసి 48 గేట్లను అమర్చింది. కాఫర్ డామ్ లను పటిష్టపరచింది. డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి సి.డబ్ల్యు.సి. ,పోలవరం అధారిటీ సూచనల మేరకే ముందుకు వెళ్లాలి కనుక జాప్యం అవుతోంది. ఈ విషయాన్ని పక్కనపెట్టి ,అసలు పోలవరం ప్రాజెక్టు ప్రస్తావనే లేకుండా పట్టిసీమ ఎంతో గొప్పదైనట్లు ఈనాడు రాసి, జగన్ పై  విషం కక్కే యత్నం చేసిందంటేనే ఆ మీడియా ఎంతగా పొల్యూట్ అయింది అర్ధం చేసుకోవచ్చు. అందుకే నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు తన ముడుపుల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఉత్తపుణ్యానికి పట్టిసీమ కాంట్రాక్టర్ కు 250 కోట్లు అదనంగా ఇవ్వడంలో మతలబు కమిషన్ ల కక్కుర్తి తప్ప ఇంకొకటి కాదని రాంబాబు ఆరోపించారు. 

ఆయన చెప్పిన మరో విషయం వాస్తవం. అదేమిటంటే పోలవరం నిర్మాణం చేసి, అక్కడ నుంచి కాల్వద్వారా నీటిని కృష్ణానదిలో కలపాలన్న ఆలోచన చేసిందే రాజశేఖరరెడ్డి. అందుకోసం కాల్వలు తవ్విస్తుంటే,ఇదే తెలుగుదేశం, ఇదే ఈనాడు వంటి టీడీపీ మీడియా పలు ఆరోపణలు చేసి అడ్డుకునే యత్నం చేశాయి. భూ సేకరణకు అడుగడుగునా అడ్డం పడ్డాయి. కొందరు తమ మద్దతుదారులతో కోర్టులలో కేసులు వేయించారు. అయినా వైఎస్ ఆర్ టైమ్ లో ఎనభై శాతం కాల్వలు పూర్తి చేశారు. అప్పట్లో ప్రాజెక్టు పూర్తి కాకుండా కాల్వలెందుకు అని ఇదే మీడియా విమర్శలు చేసింది.చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తమకు కావల్సినవారికి భారీగా భూసేకరణ పరిహారం ఇప్పించి మిగిలిన కాల్వ తవ్వకం పూర్తి చేయించారని రాంబాబు వివరించారు. మరి రాజశేఖరరెడ్డి ఆ కాల్వ తవ్వించి ఉండకపోతే ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఎక్కడికి నీరు ఇచ్చేవారు? ఈ లెక్కన గమనిస్తే, గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడి,పట్టిసీమ అవసరం రాలేదని ఈనాడు చాలా బాద పడిందన్నమాట. అంబటి ఒక మాట అన్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర చేపట్టగానే వర్షాలు ఆగిపోయి, కృష్ణా నది కింద ఉన్న రిజర్వాయిర్ లలోకి నీళ్లు రావడం ఆగిపోయిందని అన్నారు.

భారీ ప్రాజెక్టులపై నమ్మకమే లేని  బాబు.. ఇప్పుడు ఇలా
మరి ఆ సెంటిమెంటును ఈనాడు అంగీకరిస్తుందా? చంద్రబాబు టైమ్ లో  ఎటు చూసినా కరువు విలయతాండవం చేస్తే ,జగన్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. పులిచింతల ప్రాజెక్టును కూడా వైఎస్ రాజశేఖరరెడ్డే ఆరంభించి, దాదాపు పూర్తి చేశారు. తదుపరి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన భాగం పూర్తి చేసింది. చంద్రబాబు టైమ్ లో ఆ ప్రాజెక్టును వాడుకున్నారా?లేదా?చంద్రబాబు తీరుకాని, ఈనాడు,తదితర ఈనాడు మీడియా తీరు గమనిస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. తమ ప్రత్యర్ధులు ఏ ప్రాజెక్టు ను ప్రతిపాదించి పనులు ఆరంభించినా దానిని ఎలా అడ్డుకోవాలా అని చూస్తుంటారు. తాము అధికారంలో ఉంటే వాటిని చేపట్టింది తామేనని ప్రచారం చేసుకుంటారు. భారీ ప్రాజెక్టులపై నమ్మకమే లేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోలవరం తన కల అని అసత్య ప్రచారం చేసినంతమాత్రాన ఎవరూ నమ్మరు. పోలవరం టెండర్ల సమయంలో చంద్రబాబు ఎన్నిరకాల విమర్శలు చేశారో తెలియదా?వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో ఉమ్మడి ఏపీలో 46 ప్రాజెక్టులు చేపడితే అదంతా అవినీతి కోసమే అని చంద్రబాబు ప్రచారం చేశారు. అప్పుడు వైఎస్ ప్రతిపక్షం అడిగే ఏ ప్రశ్నకైనా జవాబు ఇవ్వండని, ప్రత్యేక సమావేశాలు పెట్టి సీతాపతిరావు అనే సలహాదారును అందుకోసం నియోగించారు. 

ఆరోజు వైఎస్  ఆ ప్రాజెక్టులు ముందుకు తీసుకుని వెళ్లకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా నష్టం జరిగి ఉండేది. ఎన్.టి.రామారావు తెలుగు గంగ ప్రాజెక్టును  ఆరంభించినప్పుడు స్వయంగా ఇందిరాగాందీ వచ్చి శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఆ టైమ్ లో కాంగ్రెస్ ప్రాజెక్టును వ్యతిరేకించలేదు.కాకపోతే తెలుగు గంగకు నికర జలాలు ఇవ్వాలని డిమాండ్ చేసేది.పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును వైఎస్ విస్తరించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు బృందం దానికి వ్యతిరేకంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నాలు చేసింది. అయినా ఇప్పుడు తాను రాయలసీమకు నీరు ఇచ్చానని ప్రచారం చేసుకుంటారు. ఉమ్మడి ఏపీ ఏర్పడిన రోజులలో చంద్రబాబు వంటి నేతలు ఆనాడు లేకపోబట్టి సరిపోయింది కాని,లేకుంటే శ్రీశైలం, నాగార్జునసాగర్,పోచం పాడు వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా ఏదో విధంగా అడ్డుపడేవారేమో!ఈనాడు వంటి పత్రికలు లేవు కనుక అప్పట్లో ప్రాజెక్టులు చేపట్టగలిగారని అనుకోవాలి. 

మరి ఈనాడు ఎన్నడైనా ఒక్క ముక్క రాసిందా?
ఎందుకంటే చంద్రబాబు టైమ్ లో పులిచింతల, పోలవరం,వెలిగొండ వంటి ప్రాజెక్టులు కట్టాలని ఎన్నడైనా రామోజీరావు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారా?వారం,వారం రామోజీ ఇంటికి వెళ్లి చంద్రబాబు కూర్చుని డిక్టేషన్ తీసుకునేవారు కదా?పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు ఈ ప్రాజెక్టులను నిర్మించలేకపోయారో ఈనాడు ఎన్నడైనా ఒక్క ముక్క రాసిందా? ఎంతసేపు జన్మభూమి అని, ఇంకుడు గుంతలు అని,చెక్ డామ్ లు అంటూ తాత్కాలిక పనులకే ప్రధాన్యం ఇచ్చి,అవే గ్రేట్ అని   ప్రచారం చేసుకున్నారే కాని ఒక్క ప్రాజెక్టును కూడా చిత్తశుద్దితో చేపట్టలేదు.పూర్తి చేయలేదు. 

అయినా చంద్రబాబు పట్టిసీమ లిప్ట్ పెట్టారు కనుక గొప్పవారని రామోజీ ప్రచారం చేస్తున్నారు. పట్టిసీమకే ఇంత మురిసిపోతే, పోలవరం,,పులిచింతలతో సహా నలభైకి పైగా శాశ్వత ప్రాజెక్టులను తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత గొప్పవారవుతారు?ఈనాడు మీడియావారు ఏపీకి మేలు చేయకపోయినా పర్వాలేదు.. వర్షాలు కురిస్తే ఏడవడం, వర్షాలు కురవకపోతే ఆనంద తాండవం చేస్తూ ఇలాంటి చెత్తవార్తలు రాయడం మానుకుంటే మంచిది. అది జరిగే పనిలా లేదు. వచ్చే ఏడాది మే లో ఎన్నికలు జరిగే లోగా  ఇంకెన్ని ఇలాంటి చెత్త కధనాలు ఇస్తారో చూడాల్సి ఉంది.ఎందుకంటే ఈనాడు మీడియా ఏపీపై పగబట్టి గత నాలుగేళ్లుగా విషం వెదజల్లుతోంది. ఈ మీడియా ఇలా తయారు కావడం ప్రజల ఖర్మ అనుకోవాలి.


--కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement