
కర్నాటకలో జరగబోతున్న శాసనసభ ఎన్నికలలో మతపరమైన అంశాలకు అధిక ప్రాధాన్యత లభిస్తుండడం దురదృష్టకరం. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఫెర్ ఫార్మెన్స్ , బీజేపీ, కాంగ్రెస్ , జేడీఎస్ వంటి ప్రధాన పార్టీల మానిఫెస్టోలలోని హామీలు మొదలైనవాటిపై చర్చ జరగకుండా శ్రీరాముడి గురించి హనుమంతుడు గురించి చర్చించడం, దానిని ప్రధాన ఎజెండాగా మార్చడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఉండదు. అయినా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం వీటికి అతీతంగా ఉండలేకపోతున్నారు.
శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న తపనతో ఆయన జై భజరంగ బళి అని నినాదాలు ఇవ్వడం, కాంగ్రెస్పై ఈ విషయంలో విరుచుకుపడుతుండడం గమనించదగ్గ అంశమే. గతంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో రాముడు, కృష్ణుడు అవతారాలలో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్లను ఎన్నికల ప్రచారంలో వినియోగించారు. ఎన్నికల కమిషన్ దానిపై వారికి నోటీసులు ఇవ్వడమే కాదు. కోర్టులో విచారణ జరిగి వారిపై అనర్హత వేటు పడింది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు కర్నాటకలో ఏకంగా జై శ్రీరామ్ అన్న నినాదాన్ని తరచుగా వాడుతున్నారు.
భజరంగబళిపై నిషేధం అంటే హనుమంతుడిని అడ్డుకోవడం ఎలా అవుతుందో అర్ధం కాదు. కాంగ్రెస్ పార్టీ అతి తెలివితేటలో, లేక తెలివి తక్కువతనమో కాని, విశ్వహిందూ పరిషత్ అనుబంధ సంస్థ భజరంగ బళిని తాము అధికారంలోకి వస్తే నిషేధిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించింది. అంతే!బీజేపీ నాయకత్వం రంగంలోకి దుమికింది. కర్నాటక ప్రజలను అటువైపు మళ్లించింది. హనుమంతుడి ముందు కుప్పి గంతులా అన్నట్లుగా ప్రధాని మోదీ వ్యూహం ముందు కాంగ్రెస్ పార్టీ బిత్తరపోవలసి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భజరంగభళి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మోదీ సైతం ఆయా సభలలో గతంలో రాముడిని అడ్డుకున్నారు. ఇప్పుడు హనుమంతుడికి అడ్డుపడుతున్నారు అంటూ కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఈ రకంగా మతపరమైన పోలరైజేషన్‌కు ఆయన పరోక్షంగా యత్నించారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ లు తొలగించి వక్కలిగ, లింగాయత్ లకు చెరో రెండు శాతం కేటాయించింది. ఇది కూడా మతపరమైన విభజనకు యత్నించడమే అవుతుంది. ముస్లిం ఓట్లు ఎటూ రావన్న భావనతో బీజేపీ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరించిందని వేరే చెప్పనవసరం లేదు.ఇదే మాదిరి బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా ముస్లింల రిజర్వేషన్ లు తీసివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించి వెళ్లారు. దేశవ్యాప్తంగా బీజేపీ వారు ఇదే వ్యూహంలోకి వెళ్లబోతున్నారన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది.
గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ మతపరమైన అంశాలతో అవన్ని వెనుకబడిపోయినట్లుగా భావిస్తున్నారు. సెంటిమెంట్ రాజకీయాలతో దెబ్బకొట్టడానికి కాంగ్రెస్,బీజేపీలు చేసే యత్నంలో బీజేపీదే పై చేయి అయింది. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ నేత వీరప మొయిలీ బజరంగ బళీని నిషేదిస్తామని అనలేదని సర్దుకునే యత్నం చేశారు. అయినా అప్పటికే జరగవలసిన డామేజీ జరిగింది. ఆయా సర్వేలలో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉందన్న అంచనా వచ్చింది. దానిని తలకిందులు చేయడానికి బీజేపీ నాయకత్వం ఈ అంశాన్ని గట్టిగా వాడుకుంటోంది.
మరి ప్రజలు మత పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తారా?లేక ఇతర సమస్యలకు ప్రాముఖ్యత ఇస్తారా అన్నది చూడవలసి ఉంది. ప్రదాని మోదీకాని, బీజేపీ ఇతర అగ్రనేతలు కాని ప్రజాకర్షక పధకాలను విమర్శిస్తుంటారు. కాని అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి వారు కూడా అదే పాటపాడుతుంటారు. కర్నాటలో పేదలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అరలీటర్ నందినీ పాలు సరఫరా చేస్తామని ఎన్నికల హామీలలో తెలిపారు. కామన్ సివిల్ కోడ్, ఎన్.ఆర్.సి హామీలు ఇచ్చినా వాటి ప్రభావం పెద్దగా కనిపించడం లేదట. గతంలో రుణమాఫీ హామీలను బీజేపీ విమర్శించేది. కాని యుపి శాసనసభ ఎన్నికలలో రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరచింది.
బీజేపీ ఒక్కటే కాదు. ఇతర జాతీయ పార్టీలది అదే వరస. మామూలుగా ప్రాంతీయ పార్టీలను ఈ జాతీయ పార్టీలు విమర్శిస్తుంటాయి.ప్రజలకు తాయిలాలు ఇవ్వడానికి యత్నిస్తున్నాయని జాతీయ పార్టీలు ద్వజమెత్తేవి. కాని ఇటీవలి కాలంలో అవి కూడా ప్రాంతీయ పార్టీలతో పోటీ పడి ప్రజాకర్షక హామీలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఐదు ప్రధాన హామీలను ప్రకటించింది. వాటిలో ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటు సరఫరా, గృహలక్ష్మీ స్కీమ్ కింద ప్రతి కుటుంబంలోని హెడ్ గా ఉండే ప్రతి మహిళకు రెండువేల రూపాయల చొప్పున ఆర్దిక సాయం, ప్రతి నెల పేదరికంలో ఉన్నవారికి పది కిలోల బియ్యం, రాగి వంటి వాటిని ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది.
నిరుద్యోగులైన యువకులు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్నవారికి నిరుద్యోగ భృతి కింద గ్రాడ్యుయేట్లు అయితే మూడువేలు, డిప్లమా వారైతే 1500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది. మరో ప్రధాన పార్టీ అయిన జెడి ఎస్ తన హామీలలో ముస్లిం రిజర్వేషన్ లను పునరుద్దరిస్తామని ప్రకటించింది. పంచరత్నాల పేరుతో ప్రకటించిన కార్యక్రమాల కింద ఏభై వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తామని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఈ రకంగా పోటాపోటీ వాగ్దానాలతో కర్నాటకలో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రజలు మతాన్ని ,రాజకీయాన్ని వేర్వేరుగా చూస్తారని ఆశిద్దాం.
కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment