
కర్నాటకలో శాసనసభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక పెద్ద గుణపాఠం అని చెప్పాలి. తాము ఏమి చేసినా ప్రజలు అంగీకరిస్తారన్న అహంకారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో పాటు, మత రాజకీయాలకు ప్రాదాన్యత ఇచ్చిన బీజేపీకి గట్టి షాక్‌నే ప్రజలు ఇచ్చారు. తొలుత ఏర్పడిన జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన వైనం ప్రజలలో వ్యతిరేకత తెచ్చిందని అనుకోవచ్చు. తదుపరి సీనియర్ నేత యడియూరప్పను తప్పించి బసవరాజ్ బొమ్మైని కొత్త సీఎంగా చేసినా, అప్పటికే బీజేపీ ప్రజల దృష్టిలో పలచన అయిపోయింది.
ఉప ఎన్నికలలో అత్యధిక సీట్లను సాధించిన బీజేపీ సాదారణ ఎన్నికలలో చతికిలపడడం కూడా గమనించాలి. అంతర్గత గొడవలు, నలభై శాతం కమిషన్ అంటూ అవినీతి ఆరోపణలు రావడం బీజేపీకి చాలా నష్టం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వంలో అవినీతి నలభై శాతం అని కాంట్రాక్టర్లు కొందరు ప్రకటించడం ఆ పార్టీ కొంప ముంచింది. కాంగ్రెస్ పార్టీ దానిని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లింది. గత నాలుగు దశాబ్దాలుగా కర్నాటకలో ఒకసారి గెలిచిన పార్టీ ఆ తర్వాత టరమ్ లో ఓటమి చెందే సంప్రదాయం కూడా కాంగ్రెస్ కు పనికి వచ్చిందని చెబుతున్నారు. ముస్లిం రిజర్వేషన్ లు తొలగించి లింగాయత్ , వక్కలిగలకు చెరో రెండుశాతం ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం చేసిన యత్నం ఫలితం ఇవ్వలేదు. ఎస్సి,ఎస్టిలకు రిజర్వేషన్ లు పెంచినా ఆ వర్గాలు కూడా విశ్వాసంలోకి తీసుకోలేదు.ముస్లింలు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. పేదలకు నంది పాలు అరలీటర్ చొప్పున సరఫరా చేస్తామని, నిరుద్యోగ భృతి నాలుగువేలు ఇస్తామని చెప్పినా ఓటర్లు బీజేపీని కరుణించలేదు.
డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్ని జనం పట్టించుకోలేదు. కాంగ్రెస్ మానిఫెస్టోలో భజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న హామీని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ప్రధానిమోదీతో సహా బీజేపీ నేతలంతా కృషి చేశారు. మోదీ అయితే తన సభలలో జై భజరంగబళి అంటూ నినాదాలు చేశారు. హనుమంతుడిని కూడా రంగంలోకి తీసుకువచ్చారు. దేశ ప్రధాని అయి ఉండి ఆయన ఇలా వ్యవహరించి ఉండాల్సింది కాదు. కాంగ్రెస్ నేతలు ఈ దశలో కొంత ఆత్మరక్షణలో పడ్డారు. దానివల్ల నష్టం జరుగుతుందని భయపడ్డారు.
అయినా ఓటర్లు చాలాకాలం తర్వాత స్పష్టమైన తీర్పు ఇచ్చారు. పేకాటలో జోకర్ మాదిరి ఎప్పటికప్పుడు రెండు జాతీయ పార్టీల మధ్య గేమ్ ఆడుతూ వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామికి కూడా ఈ ఎన్నిక ఒక లెస్సన్ చెప్పినట్లయింది. స్పష్టైమైన మెజార్టీ ఇవ్వడంతో ఆయన బేరసారాలకు అవకాశం లేకుండాపోయింది. గతసారి బీజేపీకి 104 సీట్లు వచ్చినా ,పూర్తి మెజార్టీ 113 సీట్లు సాధించడంలో విఫలం అవడంతో కాంగ్రెస్ , జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కాని ఆ ప్రభుత్వాన్ని బీజేపీ స్థిరంగా నిలవనివ్వలేదు. అనైతిక రాజకీయాలకు పాల్పడిందన్న విమర్శను బీజేపీ ఎదుర్కోంది.
ఇవన్ని ప్రభావితం చేసి ఆ పార్టీ ప్రభుత్వం ఓటమికి దారి తీసిందని అనుకోవాలి. ఇక కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోతో పాటు ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను నమ్ముకుంది. మహిళలకు నెలకు రెండువేల చొప్పున ఇస్తామని, 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా సరఫరా చేస్తామని, నిరుద్యోగ బృతి, విద్యార్ధినులకు స్కూటీలు మొదలైన ఐదు హామీలను బాగా ప్రచారం చేసింది. ప్రాంతీయ పార్టీలు ఇలాంటి హామీలు ఇస్తే ఓటర్లను ఆకర్షించడానికి అనుత్పాదక హామీలు ఇస్తున్నాయని విమర్శించే కాంగ్రెస్,బీజేపీలు ఎన్నికలు వచ్చేసరికి అదే బాట పడుతున్నాయి. ఈ హామీలను అమలు చేయడం కాంగ్రెస్ కు ఒకరకంగా సవాలే అని చెప్పాలి. పిసిసి అద్యక్షుడు డి.కె.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తదితర నేతలు సవాల్ గా తీసుకుని ప్రచారం నిర్వహించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఈ రాష్ట్రానికే చెందినవారు కావడం కూడా కలిసి వచ్చింది. ఈ మొత్తం విజయాన్ని రాహుల్ గాంధీ ఖాతాలో వేస్తున్నా, ఆయన జోడో యాత్ర వల్లే విజయం అని చెబుతున్నా, వాస్తవానికి ఆ ప్రభావం అంత ఉందా అన్నది అనుమానమే. రాష్ట్ర సమస్యలే ప్రధానం గా పనిచేసినట్లు అనిపిస్తుంది. అయితే రాజధాని బెంగుళూరు నగరంలో బీజేపీ తన పట్టు నిలబెట్టుకోవడం గమనించదగ్గ విషయమే.పాత మైసూరు ప్రాంతంలో బీజేపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. బీజేపీ, జేడీఎస్ ల మధ్య ఓట్ల చీలిక కాంగ్రెస్ కు ప్రయోజనం కలిగించిందని విశ్లేషణలు చెబుతున్నాయి.
అక్కడ బలంగా ఉండే జేడీఎస్‌కు ఈసారి పెద్ద దెబ్బే తగిలింది. యథా ప్రకారం ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని అంచనా వేసుకున్న కుమారస్వామి బేరసారాల నిమిత్తం సింగపూర్ వెళ్లి కూర్చున్నారు. కాని కర్నాటక ప్రజలు ఒకే పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చి ఈ రాజకీయ వ్యాపారలావాదేవీలకు స్వస్థి పలికారు. కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ నుంచి ప్రమాదం ఎక్కువని బీజేపీ అంచనా వేయకపోలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి పలుమార్లు ఆయనపై దాడులు చేసింది.
జైలులో కూడా పెట్టింది. వాటన్నిటిని తట్టుకుని ఆయన విశేషమైన ప్రజాదరణ పొందారు. ఏది ఏమైనా దక్షిణాది రాజకీయాలలో మతానికి అంత ప్రాధాన్యత ఉండదన్న విషయం మరోసారి రుజువు అయింది. బీజేపీ దీనిని ఒక గుణపాఠంగా తీసుకుని జాతీయ రాజకీయాలను నడిపితే మంచిది. కాని వారి మౌలిక స్వభావం మారుతుందా అన్నది సందేహమే.
కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా జాతీయ స్థాయిలో పుంజుకుంటుందా అంటే అప్పుడే చెప్పలేం. ప్రధానిమోదీకి రాహుల్ ధీటైన పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఆయన జోడో యాత్రతో కొంత సీరియస్ నెస్ వచ్చినా, రాజకీయంగా కాంగ్రెస్ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి అది సరిపోయేలా లేదు. కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు వచ్చి 136 సీట్లు సాధించగా, బీజేపీ గతంలో మాదిరి 36 శాతం ఓట్లు తెచ్చుకున్నా 65 సీట్లకే పరిమితం అయి అధికారాన్ని కోల్పోయింది. జేడీఎస్ 13 శాతం ఓట్లతో 19 సీట్లు మాత్రమే తెచ్చుకుని వెనుకబడిపోయింది. దానికి కారణం ముఖ్యంగా ఓటర్ల సమీకరణలో, పునరేకీకరణలో వచ్చిన మార్పులే అని చెప్పవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment