మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన కుటుంబం ప్రస్తుతం రాజకీయాలలో తలోదారి చూసుకుంటున్నట్లుగా ఉంది. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కిరణ్ అయితే 2014 నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అలా అని రాజకీయాలను వదలివేయలేదు. మధ్యలో కొంతకాలం కాంగ్రెస్‌లో చేరివచ్చారు. కాని అంత సంతృప్తి కలగలేదు. ఆ పార్టీ అధిష్టానం కూడా కిరణ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆయన బీజేపీలో ఏమైనా గుర్తింపు వస్తుందేమోనన్న ఆశతో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉన్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతోందని ఆయన అన్నారు. తప్పు నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. అంటే దీని అర్ధం కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేయడం కూడా తప్పు నిర్ణయమేనా?అని ప్రశ్నిస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఆయనకు నచ్చలేదు. బాగానే ఉంది. కాని ఆయన ఒకసారి పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ లో ఎందుకు చేరినట్లు? ఆ తర్వాత బీజేపీలో చేరడంలోని ఆంతర్యం ఏమిటి? బీజేపీ కూడా ఉమ్మడి ఏపీ విభజనకు సహకరించిన పార్టీనే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి విభజన హామీలన్నిటిని నెరవేర్చలేదు కదా! పోలవరం ప్రాజెక్టు కు పూర్తిస్థాయిలో నిదులు ఇవ్వడానికి వెనుక, ముందాడుతోంది కదా!
తెలంగాణ బీజేపీ కోసమా? ఏపీ బీజేపీకా?
విశాఖ రైల్వేజోన్ ను ఆరంభించలేదు కదా! తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనకు చొరవ తీసుకోవడం లేదు కదా! ఇలా పలు అంశాలలో బీజేపీ పెద్ద సీరియస్‌గా లేదని విమర్శలు ఉన్న తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో చేరడం విశేషం. అసలు కిరణ్ తెలంగాణ బీజేపీ కోసం పనిచేస్తారా?లేక ఏపీకి పరిమితం అవుతారా? లేక రెండు రాష్ట్రాలలో కీలక పాత్ర పోషిస్తారా? అందుకు తెలంగాణ బీజేపీ నేతలు అంగీకరించే అవకాశం ఉంటుందా?ఏపీతో పాటు తెలంగాణలో కూడా కిరణ్ ప్రభావం ఉంటుందని పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి అన్నారు. అది అయ్యేపనేనా! ఇప్పటికే భారతీయ రాష్ట్ర సమితి ఈ విషయమై విమర్శలు చేసింది.
తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నించిన కిరణ్ ను బీజేపీలో చేర్చుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే బల్క సుమన్ ద్వజమెత్తారు. ఏపీలో క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకున్నా,అక్కడ పార్టీ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జనసేనతో పొత్తు ఉంటుందో, లేదో తెలియని అయోమయ పరిస్థితి. ఈ నేపధ్యంలో కిరణ్ సోదరుడు టీడీపీలో ఉండడం, ఈయనేమో బీజేపీలో చేరడం ఏమైనా వ్యూహం ఉందా అన్న అనుమానం వస్తుంది. నేరుగా తెలుగుదేశం లో చేరలేని పరిస్థితిలో ఆయన బీజేపీలో చేరవలసి వచ్చిందా? కిషోర్ కుమార్ రెడ్డి 2014లో అన్న స్థాపించిన జై సమైక్యాంద్ర పార్టీ తరపున పీలేరులో పోటీచేసి ఓడిపోయారు. తదుపరి ఆయన టీడీపీలో చేరి గతసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
ఒకరు టీడీపీ.. మరొకరు బీజేపీ?
కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన మరో సోదరుడు సంతోష్ రెడ్డి ఆయా వ్యవహారాలను చక్కబెట్టేవారని అంటారు. నిజానికి నల్లారి కుటుంబం వ్యక్తి ఒకరు టీడీపీలో చేరడం, మరొకరు బీజేపీలో ప్రవేశించడం ఆశ్చర్యమే. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కిరణ్‌కు మధ్య ఉప్పు,నిప్పు మాదిరగా పరిస్థితి ఉండేది. కిరణ్ స్పీకర్ గా ఎన్నికైనప్పుడు ఆయనను సీటులో కూర్చోబెట్టడానికిగాను ముఖ్యమంత్రి ,ఇతర పార్టీల నేతలతో కలిసి సీటువరకు రావడానికి చంద్రబాబు అంత ఇష్టపడలేదని చెబుతారు. కాని రాజకీయం ఎప్పుడూ ఒకమాదిరిగా ఉండదు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాలు మారిపోయాయి. సీనియర్ నేత రోశయ్య సీఎం అయ్యారు. తదుపరి కిరణ్ అధిష్టానాన్ని ఎలా దారిలోకి తెచ్చుకున్నారో తెలియదు కాని, అందరిని ఆశ్చర్యపరుస్తూ రోశయ్య తర్వాత , ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. సీనియర్ నేత చిదంబరం, ఏపీకి చెందిన పల్లంరాజు, ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ ల ద్వారా రాహుల్ గాంధీని ఆకట్టుకోగలిగారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
రాష్ట్ర విభజనకు పరోక్ష కారణమన్న ప్రచారం కూడా..
కిరణ్ ముఖ్యమంత్రి అవడం సంగతి ఎలా ఉన్నా, రాష్ట్ర విభజనకు ఆయన కూడా పరోక్షంగా కారణమన్న ప్రచారం ఉంది. అదెలా అంటే ఒకదశలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఉమ్మడి ఏపీని విభజించకుండా తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అనుకున్నారు. ఆ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జరగవలసి ఉంది. ఆ సమావేశాలు అయిన తర్వాత ప్యాకేజీని ప్రకటించాలని కిరణ్ కోరారని చెబుతారు. దాంతో అధిష్టానానికి ఈయనపై నమ్మకం సన్నగిల్లి తెలంగాణ ఏర్పాటుకు మొగ్గు చూపారని చెబుతారు. దానికి తోడు కాంగ్రెస్ ఎమ్.పిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని వదలిపెట్టి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని సంచలనంగా మారడంతో ఆయన హవా తగ్గించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ విభజన వైపు వెళ్లిందని అంటారు.
కిరణ్ కుమార్ రెడ్డికి బదులుగా జగన్ కు ముఖ్యమంత్రి బాద్యతలు అప్పగించి ఉంటే విభజనకు ఆస్కారం ఉండేదికాదని చాలా మంది నమ్ముతారు. అదంతా చరిత్ర. ఒక సారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు సహకరించి కిరణ్ ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడారు.అంతకుముందే జగన్ పై సోనియాగాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు కేసులు పెట్టి, ఆయనను జైలుకు పంపించిన స్నేహం కూడా ఉంది. విశేషం ఏమిటంటే కాంగ్రెస్ అధిష్టానం విభజనకు సంబందించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు ఇస్తానని చెప్పిన కిరణ్ అప్పట్లో చిత్ర, విచిత్రంగా వ్యవహరించారు.
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి సమైక్యాంధ్ర పార్టీ..
ఆంధ్ర, రాయలసీమ మంత్రులతో క్యాబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేశారు. అలాగే అసెంబ్లీలో గందరగోళం మధ్య కేంద్రం పంపిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఆ పరిణామాలను పార్టీ ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ వంటివారు సమర్దించడం మరో విడ్డూరం. ఈ పరిణామాలన్నిటిని గమనించిన ప్రజలు కాంగ్రెస్‌ను అసహ్యించుకున్నారు.ఈ నేపద్యంలో కిరణ్ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జై సమైక్యాంద్ర పార్టీ అంటూ సొంతంగా పార్టీ పెట్టుకుని, చెప్పుల గుర్తుతో ఎన్నికలలో దిగారు. ఆయన పోటీచేయకుండా తన అభ్యర్ధులను నిలబెట్టారు. కాని ఒక్క చోట కూడా గెలవలేదు సరికదా..దాదాపు అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయారు.
ఆ ఎన్నికలలో విభజిత ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తదుపరి కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ టీడీపీలో ప్రవేశించడం విశేషం. దీనికి కిరణ్ అనుమతి లేకుండా జరిగిందా అన్న చర్చ కూడా వచ్చింది. అయినా రాజకీయాలలో ఇలాంటివి మామూలే అనుకున్నా, కిరణ్ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తదుపరి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కాని యాక్టివ్ కాలేదు. ఇప్పుడు సడన్ గా బీజేపీ వైపు ఆయన మనసుపడ్డారు. ప్రధాని మోడీ బాగా పనిచేస్తున్నారని మెచ్చుకుంటున్నారు. కిరణ్ వల్ల ఏపీలోకాని, తెలంగాణలో కాని బీజేపీకి ఎంత ప్రయోజనమన్నది అప్పుడే చెప్పలేం.కాకపోతే కిరణ్ బాల్యం నుంచి హైదరాబాద్ లోనే ఎక్కువకాలం పెరిగారు.
అదే కిరణ్‌కు టర్నింగ్ పాయింట్
ఆయన తండ్రి అమరనాధ్ రెడ్డి కరడుకట్టిన కాంగ్రెస్ వాదిగా గుర్తింపు పొందారు. ఇందిరాగాంధీకి విదేయుడుగా ఉన్నారు. తండ్రి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కిరణ్ తల్లి టీడీపీపై పోటీచేసి ఓటమిచెందడం మరో ప్రత్యేకత. ఆ తర్వాత కిరణ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి 1989, 1999, 2004, 2009లలో గెలుపొందారు. తొలుత వైఎస్ హయాంలో ఛీప్ విప్ గా పనిచేసి, అనేక సందర్భాలలో చంద్రబాబును ఇరుకున పెట్టడానికి యత్నించేవారు. 2009లో కిరణ్ కు వైఎస్ స్పీకర్ పదవి ఇచ్చారు.
అది ఆయనకు టర్నింగ్ పాయింట్ . ఆ హోదాతో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అంతేకాక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రోశయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలన్న ఆలోచన రావడం వంటివి ఆయనకు కలిసి వచ్చాయి. తన పదవిలో ఉన్నప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసి కొన్ని కేసులలో జైలులో పెట్టించడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అయినా కాంగ్రెస్‌కు అవేమీ పనికి రాలేదు. అభయహస్తం పేరుతో వంద రూపాయలకే నిత్యావసర వస్తువులు ఇచ్చే స్కీమును తీసుకు వచ్చారు కాని జనం పట్టించుకోలేదు. తెలుగులో అంత పెద్ద వాగ్దాటి లేని కిరణ్ ఉమ్మడి ఏపీలో చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. కాంగ్రెస్‌ను కాదని బీజేపీలో చేరిన కిరణ్ ఆ పార్టీకి ఎలా ఉపయోగపడతారో అప్పుడే చెప్పలేం.కొసమెరుపు ఏమిటంటే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా ఏపీ, తెలంగాణలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు పెద్దగా డిల్లీలో కనిపించకపోవడం.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment