ఇద్దరు చంద్రులూ కుమ్మక్కయ్యారు! | DK aruna reveals inner voice about Telangana | Sakshi
Sakshi News home page

ఇద్దరు చంద్రులూ కుమ్మక్కయ్యారు!

Published Wed, Oct 5 2016 5:58 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ఇద్దరు చంద్రులూ కుమ్మక్కయ్యారు! - Sakshi

ఇద్దరు చంద్రులూ కుమ్మక్కయ్యారు!

మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో గద్వాల ఎమ్మెల్యే డి.కె. అరుణ

తెలంగాణ ఇచ్చి తప్పు చేశామనుకోలేదు. చివరి నిమిషంలో కాకుండా ఒక సంవత్సరం ముందే ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉండేది. కిరణ్‌కుమార్ రెడ్డి పూర్తిగా తెలంగాణకు వ్యతిరేక వైఖరి తీసుకోకుండా ఉంటే బాగుండేది. ఆంధ్రకు ఏదో జరిగిపోతోందనే ఉద్వేగంతో ఆయన మరో మార్గం చేపట్టారు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ పార్టీ నష్టపోయింది.
 
రాజకీయాల్లో మహిళలు రాణించడం కష్ట సాధ్యమవుతున్న సంక్లిష్ట పరిస్థితుల్లో చట్టసభల్లో అత్యున్నత స్థానాలకు ఎదిగిన గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ.. అధికారంలో ఉన్నా లేకున్నా పోరాటమే మార్గం అంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంటును చూపి పబ్బం గడుపుకుంటున్నప్పటికీ చంద్రబాబుకీ, కేసీఆర్‌కీ మధ్య చక్కగా ఒప్పందాలు కుదిరిపోయాయని అంటున్నారు. ఇక్కడేమో ఫోన్ ట్యాంపింగ్, అక్కడేమో ఓటుకు కోట్లు.. వీటిలోంచి బయటపడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, కానీ సెంటిమెంటుతో రాజకీయం చేస్తున్నారని అరుణ విమర్శించారు.
 
సీఎం పదవిపై ఆశ లేదంటూనే సమర్థ మహిళగా తనకు సీఎం అయ్యే అర్హత లేదా అని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తే లేదని, వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తంచేస్తున్న  డీకె అరుణ మనసులోమాట కార్యక్రమంలో చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..

మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రావాలనే ఆసక్తి ఎలా కలిగింది?
మా నాన్న నర్సిరెడ్డి మా చిన్నప్పటినుంచే రాజకీయాల్లో ఉండేవారు. తర్వాత కోడలిగా ఇంకో రాజకీయ కుటుంబంలో అడుగుపెట్టాను కానీ నేను రాజకీయాల్లోకి వస్తానని ఎన్నడూ భావించలేదు. రాజకీయాల్లోకి ఇష్టపడి రాలేదు. పార్టీ ఆహ్వానం మేరకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటివరకు నా భర్త ఎన్నికల్లో నిలిచినప్పుడు ప్రచారం చేశాను తప్ప నేరుగా రాజకీయాల్లో లేను.
 
మీ నాన్న, మీరు ఏక కాలంలో అసెంబ్లీలో ఉండిన స్థితిని ఊహించారా?
2004లో నాన్న కాంగ్రెస్ తరపున పోటీ చేయగా నేను స్వతంత్ర అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేశాను.ఇద్దరంగెలిచాము. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాను. కాబట్టి అసెంబ్లీలో ఎలా ఉం డాలి, ఎలా మాట్లాడాలి అని ఆయన నన్ను గైడ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంవత్సరం తర్వాత 2005లో ఆగస్టు 15వ రోజునే మా నాన్నను, బ్రదర్‌ని ఇద్దరినీ నక్సలైట్లు చంపేశారు. అది జీవితంలో మర్చిపోలేని బాధాకరమైన సంఘటన.
 
మీ కుటుంబం అక్రమ దందాలు, అక్రమ మైనింగు చేసిందని అంటున్నారు కదా !
ఇన్నేళ్ళుగా మేం రాజకీయాల్లో ఉంటున్నాము. అక్రమ దందాలు చేసి ఉంటే ప్రజలు మమ్మల్ని ఆదరించరు కదా. మైనింగ్‌లో అక్రమ వ్యవహారం కూడా కక్షసా దింపే. మా బంధువుగా చెప్పుకునేటాయన ద్వేషంతో మమ్మల్ని ఇబ్బందులపాలు చేయాలని మాపై ఫిర్యాదు చేశాడు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని ఆసరా చేసుకుని 33 కోట్ల రూపాయల అక్రమ మైనింగుకు పాల్పడినామని ప్రచారం చేసింది. 33 కోట్ల విలువైన మైనింగు మేము చేయలేదు.
 
రాజశేఖరరెడ్డి స్వభావం ఎలాంటిది ?
నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు వైఎస్సార్‌కి ఉన్నాయి. కింది స్థాయి నేతలను ఏవిధంగా ప్రోత్సహించాలి, ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా వారిని పార్టీవైపుకు లాక్కోవాలి అనే వాటికి సంబంధించి పూర్తి నాయకత్వ లక్షణాలు ఆయనకున్నాయి. మహిళలుగా రాజకీయాల్లోకి వచ్చిన మాకు కూడా ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు. మేం దూరంగా ఉన్నప్పుడు కూడా రాండమ్మా ముందుకురండి, వాళ్లను ముందుకు రానియ్యండయ్యా అని మాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించారు.

చంద్రబాబుకు, వైఎస్సార్‌కు ఉన్న తేడా ఏమిటి?
రాజకీయంగా తన వెంట ఉన్నవారు, తనవారు అనుకుంటే వారిని ఏం చేసైనా సరే కాపాడుకోవాలనే గొప్ప గుణం రాజశేఖరరెడ్డిలో ఉండేది. లేని ముద్రలు వేసి పరాభవించే తత్వం టీడీపీలో చూశాం. దానికీ దీనికీ చాలా తేడా ఉంది.
 
కేసీఆర్, వైఎస్సార్.. ఈ ఇద్దరిపై మీ అంచనా ఏమిటి?
పోలికే లేదు.  కేసీఆర్ పూర్తిగా నియంతగా మారిపోయారు. తను చెప్పిందే శాసనం. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఉదయం పూట ఒకటన్నర గంట పాటు వందలాది, వేలాది మంది ప్రజలను కలిసేవారు. కేసీఆర్ అయితే ప్రజలను పక్కన పెట్టండి, ఎమ్మెల్యేలకే సమయం ఇవ్వడం లేదు. ప్రజానేత ప్రజలను కలవాలి.
 
వైఎస్సార్ ఆకస్మిక మరణంతో మీరంతా వైఎస్ జగన్‌ని సీఎంని చేయాలని కోరిన, అధిష్టానం చేయకపోవడంపై మీ స్పందన ఏమిటీ?
వైఎస్సార్‌కు అలా జరుగుతుందని అనేది ఊహించలేదు. తల్చుకుంటేనే బాధేస్తుంది. ఆయన మీద అభిమానం అనుకోండి, ఆ సమయంలో రేగిన ఉద్వేగాలు అనుకోండి. అప్పట్లో వైఎస్ జగన్‌ని సీఎం చేయాలనే మేమంతా కోరుకున్నాం. వాళ్ల కుటుంబం మొత్తానికి అప్పట్లో పెద్ద అండగా ఉన్నాం. కొంత ఓపిక పట్టమని జగన్ కి కూడా చెప్పాం. కాని భిన్నమార్గంలో జరిగిపోయింది.
 
పార్టీని వదిలిపెట్టడానే కోపంతోనే అధిష్టానం జగన్‌పై కేసులు పెట్టించిందా?
కోపంతో కేసులు పెట్టించారని అనుకోను. కొందరు కోర్టుల్లో కేసులు వేశారు. అలా కేసులు వేసినప్పుడు అనేక పరిణామాలు జరిగాయి. అప్పుడు యూపీఏ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెసే చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులతోనే అనేక విధాలుగా యాక్షన్  జరిగాయి, రియాక్షన్స్ జరిగాయి. అంతే కానీ ప్రత్యేకంగా కక్ష గట్టి సాధించారని నేననుకోను.
 
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం ఏమంటారు?
కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటుకు మరింతగా పెట్రోలు వేసి, మంటలు మండించి లబ్ది పొందడానికి ప్రజలకు అనేక హామీలిచ్చారు. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు నిజం అయిపోతాయి, కేసీఆర్ ఉంటేనే మాకు మేలు జరుగుతుందని, టీఆర్‌ఎస్‌కు ఒకసారి ఓటు వేసి చూద్దాం అనే ఆలోచనతోనే ఓటేశారు.
 
చంద్రబాబుతో కేసీఆర్‌కి ఎలాంటి సంబంధాలున్నాయి?
ఇద్దరు చంద్రులకూ ఒప్పందాలు జరిగిపోయాయి. బయటకు మాత్రం ఇద్దరూ సెంటిమెంటు చూపిస్తున్నారు. చంద్రబాబేమో తెలంగాణను చూపించి అక్కడ సెంటి మెంటు ఆట ఆడతాడు. ఈయనేమో చంద్రబాబును చూపించి ఇక్కడ ఆట ఆడతాడు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్, అక్కడ ఓటుకు కోట్లు. ఉన్నదల్లా సెంటిమెంటు రాజకీయమే.
 
తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు?
టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదనేది అందరికీ తెలిసిన విషయం. ఆ పార్టీ ఉండ వచ్చు. కొందరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయవచ్చు. కొంతమంది  గెలవవచ్చు. కానీ టీడీపీతో కాంగ్రెస్ కలిసి పోటీ చేసే ప్రశ్నే లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చే మాట అంతకంటే లేదు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది.
 
తెలంగాణ ప్రజలకు ఏం సందేశమిస్తారు
కేసీఆర్ ఆడుతున్న సెంటిమెంట్ రాజకీయాలకు లోబడవద్దు. దేనికోసం తెలం గాణను అందరం కోరుకున్నామో ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తోందా అలోచించండి. ప్రజాస్వామ్యం లేనటువంటి రాష్ట్రంలో పాలకులకు సమిధలుగా మారకుండా మేల్కొనండి అని చెబుతున్నాను.
 (డి.కె. అరుణతో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి)
 https://www.youtube.com/watch?v=LqtKOOTupSs

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement