నెహ్రూ మాటలు మరిచారా: సీఎంకు డీకే అరుణ సూటి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డి.కే.అరుణ స్పందించారు. శనివారం హైదరాబాద్లో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ... విభజనపై సీఎం స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని అభిప్రాయపడ్డారు.
కాలానుగుణంగా రాజ్యాంగాన్ని, చట్టాలను మార్చుకుంటున్నామని... తెలంగాణపై నిర్ణయం కూడా అలాంటిదే అని అరుణ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇరుప్రాంతాల ప్రజలకు ఇష్టం లేని రోజు విడిపోవచ్చని గతంలో భారత మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహార్లాల్ నెహ్రూ చెప్పిన మాటలను అరుణ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ మాటలు మరిచారా అని సీఎం కిరణ్ను ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై నెహ్రూ కుటుంబ సభ్యురాలు సోనియా తీసుకున్న నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారు అని మరో మారు సీఎంను సూటిగా అరుణ ప్రశ్నించారు.