ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక.. మళ్లీ జన్మభూమి కమిటీలు రాబోతున్నాయి.. దేనికైనా ఏభై శాతం విరాళం చెల్లించవలసిందే. అలా చేయకపోతే రాష్ట్ర ద్రోహులుగా ప్రచారం చేయడానికి టీడీపీ మీడియా సిద్దం అవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఇంటి నుంచి బండ్ల ద్వారా చెత్త సేకరించడానికి ఏభై రూపాయలు వసూలు చేస్తే చెత్త ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు విమర్శించేవారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో గ్యాంగ్ మద్దతు ఇచ్చేవి. ఇంకేముంది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏభై రూపాయల చెత్తపన్ను ద్వారా దోపిడీ చేస్తున్నారని నానా చెత్తంతా ప్రచారం చేసేవి.
ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అంటే అందరి గాత్రం మారిపోయింది. యథా ప్రకారం చంద్రబాబుకు జన్మభూమి పథకం గుర్తుకు వచ్చింది. ఈనాడు మీడియాకు జన్మభూమి అంటే తల్లిపాల రుణం తీర్చుకోవడం అని రాగం అలాపించడం ఆరంభించింది. గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలపై తీవ్ర స్థాయిలో దూషించిన పవన్ కల్యాణ్ నోట ప్రస్తుతం మాట రావడం లేదు. కాలం ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఎదుటివారు అధికారంలో ఉంటే ఏ రకంగా విమర్శలు చేస్తారు.. అదే తమకు అధికారం దక్కగానే ఎలా మారిపోతారో అనడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది.
జన్మభూమి పథకం అంటే, గ్రామంలో లేదా, పట్టణంలోని వార్డులో ఏదైనా పని జరగాలంటే ప్రజలు తమ వంతుగా ప్రభుత్వం నిర్దేశించిన శాతం ప్రకారం విరాళం చెల్లించాలి. లేకుంటే రోడ్డు పడదు. కాల్వల నిర్మాణం జరగదు. అసలు పనులే సాగవు. 2004కి ముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ పనుల కోసం ఏభై శాతం విరాళాలు వసూలు చేసేవారు. అది గొప్ప కార్యక్రమంగా ఈనాడు వంటి మీడియా ప్రచారం చేసేది. పోనీ దానికి కట్టుబడి ఉన్నారా అంటే తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్ లేదా, ఆ తర్వాత కాలంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే, వెంటనే ఈనాడు మీడియా స్వరం మార్చేసి, చిన్న పన్ను వేసినా జనంపై తెగబాదుతున్నారు అంటూ నీచంగా కథనాలు ఇస్తుంటుంది.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ప్రజల నుంచి ఎలాంటి విరాళాలు తీసుకోకుండానే వివిధ కార్యక్రమాలు నిర్వహించేవారు. అయినా ఈనాడు మీడిమా ఆయనపై ఉన్నవి, లేనివి కల్పించి మరీ రాసింది. 2019-24 టరమ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఈనాడు మీడియా చేసినంత దుష్ప్రచారం బహుశా ప్రపంచంలోనే మరే ప్రభుత్వంపై ఇంకే మీడియా చేసి ఉండదు. పచ్చి అబద్ధాలను రాసింది. ప్రస్తుతం ఏబైవ వార్షికోత్సవం జరుపుకుంటే చాలా ప్రజాసేవ చేశానని చెప్పుకుంటు ఈనాడు ఒకప్పటి సంగతి ఎలా ఉన్నా, గత ఐదేళ్లలో మాత్రం దారుణాతిదారుణంగా వ్యవహరించింది. జర్నలిజం కనీస సూత్రాలను తుంగలో తొక్కి, బట్టలూడదీసుకుని తిరగడానికి కూడా సిగ్గుపడలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీని భుజాన వేసుకుని మోస్తూ ఇదే జర్నలిజం అని ప్రజలను మోసం చేసే యత్నం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పడిపోయాక మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం అభివృద్ధి తప్ప ఇంకొకటి కనిపించడం లేదు. జన్మభూమి స్కీమ్ మళ్లీ వస్తోందని పరవశంతో వార్తలు ఇస్తోంది. ఉదాహరణకు చంద్రబాబు గిరిజన దినోత్సవం సందర్బంగా ఉపన్యాసం చేశారు. దానికి ఈనాడు పత్రిక పెట్టిన హెడింగ్.. అభివృద్ది మోత మోగాలి.. అని. అదే టైమ్‌లో చంద్రబాబునాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాని, ఆయన తరచు వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీరు మీదకాని, హామీల అమలును ఎలా ఎగవేయాలా అని చూస్తున్న ధోరణి గురించి కాని ఒక్క ముక్క రాస్తే ఒట్టు.
ఏభై వార్షికోత్సవం సందర్భంగా ఈనాడు మీడియా ఆత్మ విమర్శ చేసుకుని వాస్తవ కథనాలు ఇవ్వాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారికి వ్యాపార, రాజకీయ ప్రయోజనాలు చంద్రబాబుతో అంతగా కలగలిసిపోయాయన్నమాట. మరో సంగతి చెప్పాలి. జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తున్నాయని, ఇసుక మొదలు అన్నిటిలో అరాచకంగా వ్యవహరిస్తున్నాయని ఆ రోజుల్లో పవన్ కల్యాణ్ విమర్శించేవారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. టీడీపీ వారు జన్మభూమి కమిటీల గురించి చర్చిస్తున్నా పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నది ఆయన అభిమానుల బాధగా ఉంది.
నిజంగానే జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు ఇన్నీ, అన్నీ కావు. వారి అవినీతికి అంతే లేదు. ప్రజలకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇలా ఏ అవసరం ఉన్నా టీడీపీ ఆధ్వర్యంలో పనిచేసే జన్మభూమి కమిటీలవారి చుట్టూ తిరగవలసిందే. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న జన్మభూమిని మళ్లీ తీసుకురావాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నదంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలకు ఒక సంపాదన మార్గం ఏర్పాటు చేయడమే అని భావించాలి. మళ్లీ యధేచ్చగా ప్రజలపై పడి దోచుకోవడానికే అనే భావన కలుగుతుంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో వచ్చాక ఇలాంటి అరాచకాలకు పుల్ స్టాప్ పెట్టడమే కాకుండా, మొత్తం కొత్త వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజల గడప వద్దకు పాలన చేర్చారు.
వలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్లకే సేవలు అందించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అన్ని పనులు చకచకా జరిగేలా చేశారు. అదంతా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముద్ర ఉండడంతో దానిని ఎలాగైనా తొలగించే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసింది. సచివాలయ వ్యవస్థను ఏదో రకంగా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటి స్థానే జన్మభూమి కమిటీలను ప్రవేశ పెట్టడం ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నట్లా? కీడు చేస్తున్నట్లా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ వారు చెప్పినవారికే పనులు చేస్తామని చెప్పేవారు. ఇప్పుడు అందులో భాగంగానే జన్మభూమి కమిటీలు ప్రవేశపెడుతున్నారని భావించవచ్చు. ప్రజలు వీటిని రిసీవ్ చేసుకుంటారా?
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment